Friday, 25 May 2007

వచ్చే నెలలో డిజిటల్ చందమామ!

1947 జూలైలో మొదలైన చందమామకు ఈ నెలతో 60 సంవత్సరాలు నిండాయి. ఈ సందర్భంగా వచ్చే నెలలో డిజిటల్ రూపంలో చందమామను అభిమాన పాఠకులకు అందించే ప్రయత్నాలు చురుగ్గా సాగుతున్నాయి. వివరాలు జూలై 2007 సంచికలో ప్రచురిస్తామని ప్రచురణకర్తలు పేర్కొన్నారు. పోయిన్నెలలో కథానిలయం వెబ్సైటు ప్రారంభోత్సవ సమావేశంలో సిలికానాంధ్ర అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ మాట్లాడుతూ "ప్రపంచవ్యాప్తంగా విశేషంగా అమ్ముడుపోయిన/పోతున్న హారీ పోటర్ కథలు గతంలో చందమామలో వచ్చిన శిథిలాలయం సీరియల్ కంటే గొప్పవేం కావని" అన్నారు. శిథిలాలయం గురించి నాకు అప్పుడే తెలిసింది. ఈనెల చందమామలో పాఠకుల లేఖల్లో ఒకరు శిథిలాలయం సీరియల్ ను మళ్ళీ ప్రచురించమని కోరారు. ఇలాంటి విషయాలు విన్నప్పుడు, చదివినప్పుడు ఆ శిథిలాలయం చదవాలనే కోరిక కలగడం సహజం - అందులోనూ నాలాంటివాడికి. ఆమాటకొస్తే నేను చదవాలనుకొంటున్నవాటిలో "విచిత్రకవలలు" కూడా ఉంది. అందుకే పాత చందమామలు అందుబాటులోకి వచ్చే రోజు కోసం నేను చాలా ఆత్రంగా ఎదురుచూస్తున్నాను.

చందమామలో బాపుబొమ్మలు


ఈమధ్య ఆర్కుట్లో చందమామ కమ్యూనిటీ సభ్యుడొకరు ఆసక్తికరమైన ప్రశ్నడిగినారు - చందమామలో బాపు ఎప్పుడైనా బొమ్మలేసినారా? వేస్తే ఎప్పుడు? అని. నేను పుట్టకముందెప్పుడో చందమామలో ముళ్ళపూడి వెంకటరమణ కథలు రాయడము, వాటికి బాపు బొమ్మలెయ్యడమూ జరిగినాయి. అవి నాకెట్లా తెలుస్తాయి? :)

రచన శాయి ప్రచురించిన, బాపు-రమణలు శాయికే అంకితమిచ్చిన ఉద్గ్రంథం "బాపు-రమణల బొమ్మల కథలు" గత డిసెంబర్లో హైదరాబాదులో వంగూరి ఫౌండేషన్ వారు నిర్వహించిన ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో ఆవిష్కరించడం, ఆ సదస్సుకు హాజరైన సుధాకర్, చదువరి, రమణ, నేను తలా ఒక బుక్కు కొనుక్కుని వాటిలో మొదటి పేజీలో బాపు-రమణల సంతకాలు తీసుకోవడం జరిగింది.

ఆ ఉద్గ్రంథం వెలికితీసి వెతికితే బాపు బొమ్మలేసిన రమణ కథలు 1960-1972 మధ్యకాలంలో చందమామలో వచ్చినట్లు తెలిసింది. బాపు కార్టూనులు కూడా చందమామలో 1960 నవంబర్లో వచ్చాయి. ఇవి "చందమామలో బాపు బొమ్మలు." అలా కాకుండా ఆ ప్రశ్ననే కాస్త మార్చి "చందమామ కథలకు బాపు ఎప్పుడు బొమ్మలేశారు?" అనడిగితే పై సమాధానం సరిపోదు. ఎందుకంటే బాపు చందమామ కథలకు చందమామలోనే కాకుండా బయట కూడా బొమ్మలేశారు కాబట్టి. అది ఎట్లనగా:

విద్వాన్ విశ్వం గారు ద్విపదరూపంలో రాసిన పంచతంత్రం 1950 లలో చందమామలో వచ్చింది. తర్వాత అదే పంచతంత్రం చందమామలో కథల రూపంలో కూడా సీరియల్ గా వచ్చింది. చందమామలో ఆ కథలకు బొమ్మలేసింది వపా అనుకుంటా. ఆ ద్విపద పద్యాలు, వచనం ఎంత బాగున్నాయంటే అప్పట్లోనే వాటిని పుస్తకరూపంలో తెద్దామనుకున్నారు చందమామ ప్రచురణకర్తలు. ఐతే ఎందుకనో వీలుపడలేదు. తర్వాత విశ్వం గారు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణల సంపాదకుడుగా ఉన్నప్పుడు ఆయన పంచతంత్రం గురించి నాగిరెడ్డిగారిని కదిలిస్తే ఆయన "వాటిని మీరేరకంగా ప్రచురించినా నాకు మహదానందమే!" అని ప్రచురణహక్కులు ఆయనకే ఇచ్చేశారు. అప్పుడు విశ్వం గారు వాటికి బాపు చేత బొమ్మలేయించి తి.తి.దే. తరపున ద్విపదలోను, వచనంలోను ఒకే పుస్తకంగా ప్రచురించారు. అరుదైన ఈ పుస్తకం ఒకసారి హైదరాబాదు పాత పుస్తకాల షాపులో నాకంటబడి నా పంటపండింది.


ఒక పిట్టకథ: ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో "బాపు-రమణల బొమ్మల కథలు" కొన్నప్పుడు మొదటిపేజీలో బాపు-రమణల సంతకాలు తీసుకున్న మేము పనిలోపనిగా చివరిపేజీలో కార్టూనిస్టులు బాలి, చంద్రల సంతకాలు కూడా తీసేసుకున్నాం.

సరిగ్గా అప్పుడే అక్కడికి తనికెళ్ళ భరణి వచ్చాడు. సదస్సుకు బ్రహ్మానందం కూడా వచ్చాడనుకోండి - కానీ మనకు చిక్కే ఆనందాలు మూడేనట కదా: సదానందం, చిదానందం, పరమానందం. అందుకేనేమో ఆయన మాకు చిక్కలేదు. :( బాలి, చంద్ర సంతకాలు చేసిన పేజీలోనే ఆటోగ్రాఫివ్వమని నేను తనికెళ్ళ భరణిని అడిగాను. ఆయన పైనున్న సంతకాలను చూసి "వాళ్ళంటే చిత్రకారులయ్యా. మరి నేను?" అని ప్రశ్నించాడు. నేను (అతి?)తెలివిగా "మీరు రచయిత సార్!" అన్నాను - ఆయన సినీనటుడవక ముందే రచయిత కాబట్టి, పైగా అది "సాహితీ" సదస్సు కాబట్టి. ఆయన సంతోషించినట్లే కనబడ్డాడు. 'భరణి' అని సంతకం చేశాడు.

అన్నట్లు ఇంకో విషయం: ఆర్కుట్లో చందమామ కమ్యూనిటీలో 4 పోల్సు (అంటే 4 రకాల ఓట్లన్నమాట) జరుగుతున్నాయి. ఆర్కుట్లో అకౌంటున్నవారెవరైనా ఓట్లెయ్యొచ్చు. చందమామ కమ్యూనిటీలో సభ్యత్వం ఉండనక్ఖర్లేదు.

5 comments:

రానారె said...

చల్లని కబురు తెచ్చావు నాయనా, చల్లగా ఉండు. ఎప్పటిలాగే(కాస్త ఆయాసంగా) నాకు ఆసక్తిగల కొత్త విషయాలు కొన్ని తెలుసుకున్నాను బాబూ, నీ బ్లాగుకొచ్చి. థాంకులు బాబూ, థాంకులు నాయినా(గుమ్మడి స్టైల్లో).

oremuna said...

బాలజ్యోతినో, చందమామనో మరేదో గుర్తు లేదు కానీ

చిన్నప్పుడు "సమీర వర్మ సాహస యాత్రలు" ( మొదటయితే సమీర వర్మ సాహసమే తరువాతి చివరి పదమే డఔటు)

అనేది నాకు చాలా చాలా నచ్చిన సీరియల్!

Unknown said...

చిన్నప్పుడు బాలమిత్ర, చందమామ రెండూ తప్పక చదవాల్సిందే.
నాకు చందమామ కంటే బాలమిత్రే ఎక్కువ నచ్చేది. అందులోనూ మినే నవల.
చందమామ లో నాకు నచ్చేది అందులో బొమ్మలు, విక్రమార్క కథలు.

భలే ఇప్పుఢవన్నీ మళ్ళీ చదువుకోవచ్చన్నమాట.

రాధిక said...

అంతమంది మహానుభావులను చూడడము,వారి సంతకాలు సేకరించడమూ.....అద్రుష్టవంతులండి.

రానారె said...

ఏదీ!!? చందమామరావే అని పాడితే వస్తుందా? :)