Sunday 17 June, 2007

చెప్పుకోండి చూద్దాం

మొన్న రానారెకు పుట్టిన నవ్వే ఈపొద్దు నాకూ పుట్టింది. (అసలు ఇది ఎప్పుడో... పుట్టాల్సిన నవ్వ!) కాచుకోండి:

1. "కుయ్యో మొర్రో" అనడం అందరికీ తెలుసు. పోతన కూడా శ్రీమహావిష్ణువు గజేంద్రుడి "కుయ్యాలించి సంరంభియై" సిరికింజెప్పక పరిగెత్తుకొచ్చినాడని రాసినాడు. మరి కుయ్యి అంటే ఏమిటి?
2. అబాపురి = ?
3. అబ్బి = ?
4. అమ్మి = ?
5. ఓదె = ?
6. కూసం ? (కుబుసం కాదు)
7. తీటగందెరాకు ?
8. పదును ? (పదను కాదు)
9. బెట్ట ?
10. మడవ ?
11. మాసూళ్ళు ?
12. మెట్టు ? (stair కాదు)
13. లెక్క ? (గణిత సంబంధ పదం కాదు)
14. వారు ? (ఏకవచనమే!)
15. సరివాల ?



అసలివన్నీ తెలుగు పదాలేనా అన్న అనుమానం కూడా మీకు వచ్చి ఉండొచ్చు... (ముగ్గురు నలుగురికి తప్ప)! నవ్వ మాదిరే ఇవి కూడా (మొదటిది తప్ప) కడప జిల్లాలోని వాడుక పదాలు. వాటిలో కూడా వ్యవసాయ సంబంధ పదాలు ఎక్కువగా ఉన్నాయి.
(2, 7, 15 పదాల ఉచ్చారణలో తేడాలుండవచ్చు)

14 comments:

వెంకట రమణ said...

వీటిలో నాకు అర్ధాలు తెలిసిన పదాలు

3. అబ్బి = మగవారిని ఇలా సంబోదిస్తారు.
4. అమ్మి = ఆడవారిని ఇలా సంబోదిస్తారు
5. ఓదె = వరిని కోసి నప్పుడు చిన్న చిన్న కుప్పలుగా పెడతారు. వీటినే ఓదె అంటారు
8. పదును - చేను విత్తడానికి వీలుగా ఉంటే పదునుగా ఉందంటారు.
9. బెట్ట - నీరు ఎక్కువయి చేను ఎండిపోవడాన్నే చేను బెట్టకొచ్చిందంటారు.
11. మాసూళ్ళు - వరి కుప్పలనుండి వడ్లు వేరుచేసే ప్రక్రియ
12. మెట్టు - ఈ పదం విన్నాను గాని గుర్తు రావడంలేదు.
14. వారు - చర్నాకోలలో వాడేతాడు(??)

రవి వైజాసత్య said...

1. మరి కుయ్యి అంటే ఏమిటి? - చెప్పాల్సింది చెప్పు అని
2. అబాపురి = ? - ఇక ఆపండి?
3. అబ్బి = ? - అబ్బాయి
4. అమ్మి = ? - అమ్మాయి
5. ఓదె = ?
6. కూసం ? (కుబుసం కాదు) - నడుము, వెన్నెముక అనుకుంటా, దెబ్బకు కూసాలు కదిలాయి అంటారు
7. తీటగందెరాకు ? ???
8. పదును ? (పదను కాదు) - వర్షం పడగానే పొలం పదునువుతుంది
9. బెట్ట ? - అలసట
10. మడవ ? - పొలానికి గెట్టు (నీళ్లు పారడానికి)
11. మాసూళ్ళు ?
12. మెట్టు ? = చెప్పు (కాళ్లకు తొడుక్కునేది) మెట్లను తాపలంటారు
13. లెక్క =దబ్బు, కాసు, దుడ్డు
14. వారు ? (ఏకవచనమే!) - దేవుడి ముందు నీళ్లు అటూఇటూ పొయ్యడాన్ని కూడా వారు పోయడం అంటారు. దీనికి మరిన్ని ప్రయోగాలు ఉన్నాయి అనుకుంటా
15. సరివాల ?

సిరిసిరిమువ్వ said...

1.కుయ్యి = మాట్లాడటం, చెప్పటం. (నోటికొచ్చినట్లు కుయ్యవాకు).
2.అబాపురి = ?
3.అబ్బి = అబ్బాయి
4.అమ్మి = అమ్మాయి
5.ఓదె = పొలంలో పంట కోసినప్పుడు చిన్న చిన్న కుప్పలుగా పెడతారు. వీటిని ఓదెలు అంటారు
6.కూసం = రెండు కర్రముక్కలిని కలిపే మూల.(మంచం కోళ్ళని నాలుగు మూలలా కలిపే చోటు).
7.తీటగందెరాకు = దురదగుంటాకు-దురదగుండాకు.
8.పదును = పనులు మొదలుపెట్టటానికి పొలం తయారుగా ఉండటం. (దున్నటానికి, విత్తటానికి వీలుగా ఉండటం).
9.బెట్ట = పోలం నీరు లేక ఎండి పోవటం, పగుళ్ళు ఇవ్వటం.
10.మడవ = అడ్డకట్ట. మళ్లకు పాదులకు నీళ్లుపోయేదోవయొక్క మొదటి భాగము. (http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?query=మడవ&display=utf8&table=brown)
11.మాసూళ్ళు = పంట కుప్పలిని నూర్చటం.
12.మెట్టు = ధాన్యం బస్తాలని ఒకదాని మీద ఒకటి అమర్చటం.
13.లెక్క = డబ్బు, కాసు, దుడ్డు
14.వారు = తోలుతో తయారు చేసిన తాడు-పంది వారు.
15.సరివాల = ?

రానారె said...

హహ్హహ్హ... బాగుంది. చదువుతుంటే చాన్నాళ్ల తరువాత మళ్లీ వీరబల్లెకు వచ్చినట్టుంది. అబాపురితో పాటు అవలయ అనే మాటొకటుంది. 7వదాన్ని తీటగింజరాకు అనికూడా అంటారు. కుయ్యి = కూతపెట్టు, మాట్లాడు అనడానికి వ్యంగ్యం. బెట్టగొట్టింది అంటే ఎండదెబ్బ వడదెబ్బ అనే అర్థంలో కూడా వాడుకగలదు. పదునుకు ఇంకో అర్థం ఉంది - వర్షపాతానికి కొలమానం.

సేద్యానికి సంబంధించి లెక్కలేనన్ని పదాలున్నాయి. కొన్ని:
1. కారు
2. చాడ
3. చాడు
4. గుది
5. ఇరుకుమాను
6. కల్ల (అబద్ధం కాదు)
7. కయ్య
8. బొక్కెన
9. కవిల
10. పట్టెడ
11. నాళా
12. యడ
13. కొండ్ర
14. కొండ్రకట్టె
15. మోపు (క్రియకాదు,నామవాచకం)

spandana said...

1. కుయ్యి= కూత వెయ్యి
2. అబాపురి = ?
3. అబ్బి = అబ్బాయి
4. అమ్మి = అమ్మాయి
5. ఓదె = చిన్న కుప్పగా వేసిన కోసిన పంట
6. కూసం = పందిరి స్తంభం
7. తీటగందెరాకు = దురద పెట్టేమొక్క ఆకు
8. పదును = ఒక్కసారి దున్నడానికి వీలయ్యేవిధంగా కురిసిన వాన (ఈసారి ఓ పదును వాన పడింది)
9. బెట్ట = ఎండలకు వాలిపోవడం (పంట వాన లేక బెట్ట పోయింది)
10. మడవ = నీళ్ళను దారి మళ్ళించడానికి వేసే మట్టి (మడవ వేయడం)
11. మాసూళ్ళు = పంట కోతకొచ్చే సమయం (ఈసారి మాసుళికి అప్పు తీరుస్త్
12. మెట్టు = చెప్పు (మెట్టుతో కొడతా!)
13. లెక్క = డబ్బు
14. వారు = చెప్పులు లేదా బొక్కెన లేదా ఏదైనా చర్మ సంబందమైన దాన్ని కుట్టాడానికి వుపయోగించే సన్నటి చర్మపు దారం
15. సరివాల = మ్నంటి పశువుని యజమాని హక్కు వుంచుకోంటూనే అనుభవించే హక్కు మాత్రమేఇస్తూఇతరులకు అప్పగించేవిధానం. ఆ పశువుల సంతానాన్ని యజమాని పెంపకందారు సమానంగా పంచుకుంటారు. (నేను మా గొర్రెలను సరివాల దోలినా)

1. కారు = నాగలికి (మడకకు) అతికించే ఇనుప బద్ద. (సన్నకారు రైతు అనే పదంఇందులోంఛేవచ్చిందా?)
2. చాడ = వరిమడ నాటడానికి మెత్తగా చేసిన బురద కయ్య.
3. చాడు = ఒక వరుస (విత్తనం చాళ్ళలోనే వెయ్యాలి), దున్నేప్పుడు ఏర్పడే లోతైన దారి.
4. గుది = ఆవు గానీఎనుము (బర్రె) గానీ పరిగెత్తకుండా నిరోధించే మెడలో కట్టిన కర్ర.
5. ఇరుకుమాను = పశువులు/బండ్లు పోకుండామనుషులు మాత్రమేదూరగలిగిన రెండు కొయ్యలతో ఏర్పరిచిన సన్నటి దారి
6. కల్ల (అబద్ధం కాదు) = ముళ్ళ కంచె
7. కయ్య = కమతం
8. బొక్కెన = నీళ్ళు చేదడానికి వుపయోగించే పెద్ద చర్మపు తిత్తి
9. కవిల = బొక్కెనతో, ఎద్దులతో నీళ్ళు తోడే పద్దతి
10. పట్టెడ = ఎద్దును కాడిమానుకు కట్టే తాడు + చర్మపు పట్టితో చేసినది
11. నాళా = నాడా, ఎద్దు గిట్టలకు కొట్టే ఇనుప వస్తువు
12. యడ = ???
13. కొండ్ర = బారెడు/రెండు బారల వెడల్పుతో దున్నడానికి విభజించే .... కోండ్ర :)
14. కొండ్రకట్టె = ??
15. మోపు (క్రియకాదు,నామవాచకం) = గడ్డీ కట్ట (గడ్డీ మోపు)

ఇంకా నాకు జ్ఞప్తికి వచ్చినవి

1. మోకు
2. గుంటక
3. చిక్కం
4. మేడి
5. ముల్లుకర్ర
6. దాపటి, వలపటి


--ప్రసాద్
http://blog.charasala.com

రవి వైజాసత్య said...

1. కారు - వ్యవసాయ సీజన్ (ఎడగారు, వానాకారు)
9. కవిల - కపిల ఒకటేనా?

1. మోకు - లావాటి తాడు
2. గుంటక - పొలంలో గుంటక తోలటం అంటారు (అర్ధం ఇప్పుడు గుర్తుకు రావటం లేదు)
3. చిక్కం - ఎద్దుల మూతికి కట్టేది
4. మేడి ?
5. ముల్లుకర్ర - ఎద్దులను అదిలించటానికి వెదురుగర్రకు చివరన ముల్లు ఉంటుంది
6. దాపటి, వలపటి ?

త్రివిక్రమ్ Trivikram said...

యథాశక్తి ప్రయత్నించిన వెంకట రమణ, వైజాసత్య, సిరిసిరిమువ్వ గార్లకు ధన్యవాదాలు. రవీ! కొన్ని పదాలు మీకు చాలా బాగా గుర్తున్నాయి! రానారె, ప్రసాద్ చక్కటి సమాధానాలు చెప్పడమేగాక మరిన్ని పదాలు గుర్తుచేసినారు. వాళ్ళిద్దరికీ ప్రత్యేక ధన్యవాదాలు.
అర్థాలు:
కుయ్యి లేక కూత అంటే అరుపు. A cry, yell, vociferation, loud entreaty, or prayer: an exclamation like 'alas' - బ్రౌన్
అబాపురి = ఎందుకూ కొరగాని (అబాపురి చేష్టలు/మాటలు, అబాపురి నాయాలు)
అవలయ/అవులయ = ఎగతాళి/కొరగాని ("అవలయ పడొద్దు", అవలయ చేష్టలు/మాటలు, అవలయ నాయాలు)
అబ్బి = అబ్బాయి
అమ్మి = అమ్మాయి
ఓదె = పొలంలో పంట కోసినప్పుడు చిన్న చిన్న కుప్పలుగా పెడతారు. వీటిని ఓదెలు అంటారు
కూసం = పందిరి స్థంభం/నిలువుగా పాతిన స్థంభం
తీటగందెరాకు/తీటగింజరాకు = దురదగుంటాకు-దురదగుండాకు
పదును = నాగలి దిగేటంతలోతు నేల తడిసేటట్లు పడిన వాన. పనులు మొదలుపెట్టటానికి పొలం తయారుగా ఉండటం. (దున్నటానికి, విత్తటానికి వీలుగా ఉండటం).
బెట్ట = ఎండలకు వాలిపోవడం (పంట వాన లేక బెట్ట పోయింది), అలసట. బెట్టగొట్టింది/బెట్ట తగిలింది అంటే ఎండదెబ్బ/వడదెబ్బ తగిలింది అని అర్థం.
మడవ = అడ్డకట్ట. మళ్లకు పాదులకు నీళ్లుపోయేదోవ (మడవ కట్టడం, మడవ పారించడం అనే రెండు ప్రయోగాలున్నాయి)
మాసూళ్ళు = పంట కుప్పలిని నూర్చటం, వరి కుప్పలనుండి వడ్లు వేరుచేసే ప్రక్రియ.
మెట్టు = చెప్పు (కాళ్లకు తొడుక్కునేవి)
(మెట్లను ను తాపలు అంటారు)
లెక్క = డబ్బు
వారు = తోలుతో తయారు చేసిన తాడు
(కలాసం = పశువు యొక్క చర్మం)
సరివాల = పశువుని యజమాని హక్కు వుంచుకుంటూనే అనుభవించే హక్కు మాత్రమే ఇస్తూ ఇతరులకు అప్పగించేవిధానం. ఆ పశువుల సంతానాన్ని యజమాని, పెంపకందారు సమానంగా పంచుకుంటారు. (నేను మా గొర్రెలను సరివాల దోలినా)

త్రివిక్రమ్ Trivikram said...

రవీ! కపిల, కవిల ఒకటే.
మరికొన్ని పదాలు:
కరుకోల
లిక్కి
దుంపు
మునుం
గెనెం
ఆకుతోటలకు సంబంధించిన పదాలు:
కోలె
కట్నం
సద్దకం
దింపకం
ముద్దింపకం

రవి వైజాసత్య said...

ఇవన్నీ నా పరిధిని దాటిపోయాయి..(వృత్తి పదకోశంలో కాపీకొడితే తప్ప)
మునుం అంటే ఐదు సేర్లు/పడులు అనుకుంటా..

రాజశేఖర్ said...

దాపలి - ఎడమ చేతి వైపు
వలపటి - కుడిచేతి వైపు
(వీటిని విశేషణాలుగా వాడతారు.)


లిక్కి - కొడవలి ?
మునుం - చిగురు/మొలక/అంకురం ?

త్రివిక్రమ్ Trivikram said...

రాజశేఖర్ గారూ!

మీరు చెప్పినవి కరెక్టే (మునుం తప్ప)

కరుకోల = మూరెడు పొడవుండే గడ్డపార (గునపం) లాంటి సాధనం
లిక్కి = చిన్న సైజు కొడవలి (కొయ్యపిడితో ఉంటుంది)
దొంపు లేక మునుం = చేలోని ఒక వరుస పైరు
గెనెం/గెనుం = గనిమ/గట్టు
"గెనుం వార మునుం బడితి ఓరి మగడా" అంటూ సాగే జానపద గేయం కింద ఆ పదాలకు అర్థాలు ఇచ్చాను చూడండి.
కోలె = తీగ నుంచి తమలపాకులు కోయడం
కట్నం/కట్ణం = తమలపాకు తీగను దానికి ఆధారంగా పెంచే అవిసె/మునగ చెట్టుకు జమ్ము/జంబు లేక తడపలతో కట్టడం
సద్దకం = చిన్న చిన్న తమలపాకు తీగలు అడ్డదిడ్డంగా పెరగకుండా సర్ది కట్టడం (మొదటి దశ కట్ణం)
దింపకం = ఎత్తు పెరిగిన తీగలను కిందికి మళ్ళించి కట్టడం (రెండో దశ కట్ణం)
ముద్దింపకం = మూడో దశ కట్ణం

రానారె said...

ప్రసాద్‌గారు,
కొండ్రకట్టె అంటే మీకు తెలుసు. చెనిగచెట్లు (వేరుశెనగ) మొలిచిన కొన్ని వారాలకు వాటితోపాటు చేనులో గడ్డికూడా మొలిచి బలిసిపోతుంది. చెనిగచెట్లకు తగలకుండా వాటిచుట్టూరా ఉండే ఆ గడ్డిని తవ్వి, అలాగే నేలను గుల్లగిచ్చేదానికి (చెట్ట వేర్లకు కొంచెం గాలి తగలడానికి వీలుగా పెళ్లగించడానికి) చిన్న అరచేతి మందంగల చిన్న పారల్లాంటివి కొండ్రకట్టెలు. మూరెడుపొడవున్న కట్టెకు మధ్యలో చిన్న రంధ్రంచేసి అందులో ఈ పారకుగల ఇనుము భాగాన్ని బిగిస్తారు. ఇప్పుడు గుర్తొచ్చిందా? ఇదంతా వివరించాలంటే కొద్దిగా మొహమాటంగా ఉంది :-)

రానారె said...

నీళ్లు పారగట్టేటప్పుడు కాలువల్లోని నీళ్లు పైరుకు మళ్లించాలంటే పారతో మట్టినితీసి ఆనకట్టకడతామే అదే యడ. నీళ్లుపారగట్టడమంటే ముఖ్యంగా చేసేపని యడలు మార్చడమేకదా!

శ్రీధర్ రెడ్డి said...

@అందరికీ

మీరు ఇక్కడ చెప్పిన పదాలను చదువుతుంటే ,... నేను చిన్నప్పుడు బురద మళ్ళో మాయప్ప యలపట కర్రావు దాపట ఒంగోలు గిత్త కట్టి దున్నేటప్పుడు నేను కూడా దున్నతాను అని కొన్రా వేసేప్పుడు ఆ ఊటు మడిలొ ఇర్రుక్‌కుపోయున సంఘటన గుర్తుకు వస్తోంది..,... ఆ పదాలు అన్నీ దాదాపు గా నాకు తెలుసు.

గమనిక::: నేను కూడా తెలుగు బాష వ్యాప్తి కోసం న వంతు కృషి గా ,.. తెలుగు పద్యాలకోసం ఒక బ్లాగ్ ని నడుపుతున్నాను ,.... (the URL is http://telugupadyaalu.blogspot.com)
(ఇదే మొదటి విమర్శ ,.. తప్పులుంటే క్షమించండి ,..)