Tuesday, 31 October 2006

సాహిత్య నేత్రం-మరో మంచి పత్రిక

అనిల్ చీమలమఱ్ఱి తన బ్లాగులో పేర్కొనని మరో మంచి పత్రిక సాహిత్య నేత్రం.


సాహిత్య నేత్రం త్రైమాస పత్రిక. ఇది పదేళ్ళ కిందట మొదలైంది. దీంట్లో ప్రతి సంచికలోనూ అద్భుతమైన కథలు, కవితలు , సాహితీ వ్యాసాలు, విశ్లేషణలు వచ్చేవి. ఉత్తమాభిరుచిగల వారందరి ఆదరణా పొందినా ఆర్థికంగా నిలదొక్కుకోలేక రెండేళ్ళ కాలంలో 9 సంచికలు వెలువడి ఆగిపోయింది. అయితే పట్టు వదలని విక్రమార్కుడు శశిశ్రీ పదేళ్ళ తర్వాత ఇపుడు దాన్ని డిసెంబరు 2005 నుంచి తిరిగి నడిపిస్తున్నాడు.

ఈ పత్రిక ప్రత్యేకతలు: ఇప్పుడు సరికొత్త ఆకర్షణ ప్రతి సంచికలోనూ ఒక మంచి తెలుగు కథను ఇంగ్లీషులోకి అనువదించి ప్రచురించడం. (మన దురదృష్టమేమిటంటే ప్రపంచ, దేశ భాషల్లోని ఉత్తమసాహిత్యాన్ని తెలుగువాళ్ళకు పరిచయం చేసేవాళ్ళు, తేటతెలుగులోకి అనువదించేవాళ్ళు, ప్రచురించేవాళ్ళు ఉన్నారు గానీ మన సాహిత్యాన్ని ఇతరభాషలవారికి పరిచయం చేసే ప్రయత్నాలెవరూ సీరియస్ గా చెయ్యడం లేదు. ఒక తెలుగుకవి గుంటూరు శేషేంద్రశర్మ నోబెల్ పురస్కారానికి నామినేట్ అవడానికి కారణం తన రచనలన్నిటినీ ఆయన ఆంగ్లంలో రాయడం లేదా తెలుగులో రాసినా వెంటనే ఆంగ్లంలోకి తనే స్వయంగా అనువదించుకోవడం. నోబెల్ దాకా ఎందుకు? మనకు దక్కిన జ్ఞానపీఠాలెన్ని? రెండు (అవి కూడా జ్ఞానపీఠ్ అవార్డుల కమిటీ అధ్యక్షుడుగా పి.వి.నరసింహారావు ఉన్నప్పుడు ఒకటి, బెజవాడ గోపాలరెడ్డి ఉన్నప్పుడు ఇంకొకటి) కాగా కన్నడానికి ఏడు. తేడా ఎక్కడుందో తెలియడం లేదూ??)

ఈ పత్రికను మార్కెట్లోకి విడుదల చెయ్యడం లేదు. ప్రతులు కావలసినవారు శశిశ్రీ (సంపాదకుడు), సాహిత్య నేత్రం త్రైమాస పత్రిక, డోర్నెంబరు 21-107, ఏడురోడ్లకూడలి, కడప - 516001 ఆం.ప్ర., ఫోన్: 93474 10689 ను సంప్రదించవచ్చు. విడిప్రతి 12/-.

పత్రిక సలహామండలి:

కాళీపట్నం రామారావు
డా||వై. బాలశౌరిరెడ్డి (సుప్రసిద్ధ హిందీ రచయిత, అనువాదకుడు. ఈయన హిందీ చందమామకు నలభయ్యేళ్ళపాటు సంపాదకుడుగా పనిచేశాడు.)
డా||జానమద్ది హనుమచ్ఛాస్త్రి (ప్రసిద్ధ సాహితీవేత్త, బహుగ్రంథకర్త)
డా||కేతు విశ్వనాథరెడ్డి
డా||పాపినేని శివశంకర్
వల్లంపాటి వెంకటసుబ్బయ్య
సింగమనేని నారాయణ
షేక్ హుసేన్ సత్యాగ్ని
మాకం అశోక కుమార్
బి.కె.ఆర్. మూర్తి

Monday, 30 October 2006

Confessions of a kid

Little Bobby came into the kitchen where his mother was making dinner. His birthday was coming up and he thought this was a good time to tell his mother what he wanted.


"Mom, I want a bike for my birthday." Little Bobby was a bit of a troublemaker. He had gotten into trouble at school and at home. Bobby's mother asked him if he thought he deserved to get a bike for his birthday. Little Bobby, of course, thought he did.

Bobby's mother wanted Bobby to reflect on his behavior over the last year. "Go to your room, Bobby, and think about how you have behaved this year. Then write a letter to God and tell him why you deserve a bike for your birthday." Little Bobby stomped up the steps to his room and sat down to write God a letter.


Letter 1



Dear God,
I have been a very good boy this year and I would like a bike for my birthday. I want a red one.
Your friend,
Bobby


Bobby knew that this wasn't true. He had not been a very good boy this year, so he tore up the letter and started over.


Letter 2


Dear God,
This is your friend Bobby. I have been a good boy this year and I would like a red bike for my birthday.
Thank you.
Your friend Bobby


Bobby knew that this wasn't true either. So, he tore up the letter and started again.


Letter 3


Dear God,
I have been an "OK" boy this year. I still would really like a bike for my birthday.
Bobby


Bobby knew he could not send this letter to God either. So, Bobby wrote a fourth letter.


Letter 4


Dear God,
I know I haven't been a good boy this year. I am very sorry. I will be a good boy if you just send me a bike for my birthday. Please!
Thank you,
Bobby

Bobby knew, even if it was true, this letter was not going to get him a bike.

Now, Bobby was very upset. He went downstairs and told his mom that he wanted to go to church. Bobby's mother thought her plan had worked, as Bobby looked very sad. "Just be home in time for dinner," Bobby's mother told him.

Bobby walked down the street to the church on the corner. Little Bobby went into the church and up to the altar. He looked around to see if anyone was there. Bobby bent down and picked up a statue of the Mary. He slipped the statue under his shirt and ran out of the church, down the street, into the house, and up to his room. He shut the door to his room and sat down with a piece of paper and a pen. Bobby began to write his letter to God.

Letter 5


DEAR GOD,
I'VE KIDNAPPED YOUR MAMA. IF YOU WANT TO SEE HER AGAIN,

SEND THE BIKE!





(A forwarded mail)

Sunday, 29 October 2006

లైంగికవేధింపులు

ఇటీవల వెలువడిన ఒక సర్వేక్షణలో విస్మయం కలిగించే విషయాలు బయటపడ్డాయి. దీన్ని బట్టి చూస్తే అజ్ఞానంలో ఉండడాన్ని తమ జన్మహక్కుగా భావించే గృహిణులే కాదు ఉద్యోగాలు చేసే మహిళల్లో సైతం చాలా మందికి లైంగికవేధింపుల పట్ల సరైన అవగాహన లేదు. 1997లో విశాక కేసులో సుప్రీమ్‌కోర్టు లైంగిక వేధింపులంటే ఏమిటో కూలంకషంగా వివరించడమేగాక మహిళలు తాము పనిచేసేచోట లైంగిక వేధింపులకు గురికాకుండా చూడవలసిన బాధ్యత వారిచేత పనిచేయించుకుంటున్నవారిదే (employers)నని తేల్చిచెప్పింది.
ఈ నేపథ్యంలో :
అసలు దేన్ని లైంగికవేధింపు అనవచ్చు?
లైంగికవేధింపు మానవహక్కుల ఉల్లంఘనా? కాదా?
లైంగికవేధింపులకు పాల్పడే వాళ్ళకు శిక్ష లేదా?
వాళ్ళమీద ఎవరికి ఫిర్యాదు చెయ్యాలి?
మహిళలు పనిచేసేచోట లైంగికవేధింపులను అరికట్టడానికి ఎలాంటి ఏర్పాట్లుండాలి?
అది ఎవరి బాధ్యత?
లైంగిక వేధింపులు జరిగేచోట పై అధికారుల, సహోద్యోగుల బాధ్యతలేమిటి?
ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి ఇక్కడ చూడండి.
ఏయే చర్యలు లైంగికవేధింపులుగా పరిగణించబడుతాయో ఇక్కడ కూడా చూడవచ్చు.

Monday, 23 October 2006

భాషలో భేదాలు

రాష్ట్రం మొత్తం మీద భాష ఒకటే ఐనా ఒక్కోప్రాంతంలో ఒక్కో మాటకు ఒక్కో అర్థముంటుంది. ప్రతి ఐదు కిలోమీటర్లకూ భాష కాస్తైనా మారుతుందంటారు. మేం మాట్లాడేదే అన్నివిధాలా సరైన భాష అనే దురభిమానం నాకు లేదు. ఇవి కేవలం సరదాకోసం రాసినవి. "సరదా కోసం మా భాషను విమర్శిస్తావా?" అని ఎవరైనా కళ్ళెర్రజేస్తే నేనేం చెయ్యలేను.

రాయలసీమలో గమ్మున ఉండమని కసిరితే నోరుమూసుకొమ్మని అర్థం.
గోదావరి జిల్లాల్లో గమ్మున అంటే త్వరగా అని అర్థం.
"గమ్మునుండడం" ఏమిటో, ఎలాగో అర్థం కాక వాళ్ళు తెల్లమొహం వేస్తారు.

మేం మటిక్కాయలని పిలిచే ఒక కూరగాయను కొన్ని ప్రాంతాల్లో గోరుచిక్కుడు అని పిలిస్తే మాకు గందరగోళంగా అనిపిస్తుంది. చిక్కుడుతో ఎందులోనూ పోలికలేని దీనికి ఈపేరెట్లా పెట్టారా అని. "మొటిక్కాయలు తింటారా? అదేం సరదా మీకు?" అని మా మీద ఎవరైనా హాస్యమాడవచ్చు నిరభ్యంతరంగా.

అనపకాయ ఒకటి ఉండగా సొరకాయకు ఆనపకాయ అనే పేరెందుకో? అనవసరమైన కన్‌ఫ్యూజన్ కాదూ?

ఇక నాకు మరీ విడ్డూరంగా అనిపించేది "పదిహేను". "పదుగురాడుమాట"గా ఇది వ్యాప్తిలో ఉందేగానీ పది+ఐదు పదిహేను ఎలా అవుతుందని నేనడిగిన కొంటె ప్రశ్న*కు తెల్లమొహాలేశారు చాలామంది. 15 ను రాయలసీమలో పదహైదు అనే అంటారు. ఇదే నాకు అన్నివిధాలా సహజమైన, తార్కికమైన పదం అనిపిస్తుంది (పది+ఐదు = పదహైదు).

(*ఈ ప్రశ్నకు సమాధానం తెలిసినవాళ్ళు ఈ టపా వ్యాఖ్యల్లో రాయండి. రేపటిలోగా ఎవరూ రాయకపోతే దీన్ని బేతాళప్రశ్నగా భావించి విక్రమార్కుడే వివరిస్తాడు.)

Sunday, 22 October 2006

కడప జిల్లా-మౌలిక సదుపాయాలు

రాష్ట్రంలో విమనయాన సౌకర్యాల అభివృద్ధి ఆవశ్యకతను నొక్కిచెప్పిన తెలుగు జాతీయవాది బ్లాగులో కడప, పుట్టపర్తి విమానాశ్రయాల ప్రస్తావనే లేదు. ఇక ఆంధ్రప్రగతి బ్లాగులోనేమో కడపలో ఏర్పాటు కానున్నది "క్రొత్త" విమానాశ్రయమని ఉంది. కానీ వాస్తవమేమిటంటే రాష్ట్రంలో దొనకొండ విమానాశ్రయం తర్వాత నిర్మించబడిన రెండో అతి ప్రాచీన విమానాశ్రయం కడపలో ఉండేది. దురదృష్టవశాత్తూ అది తెలుగువాడైన పి.వి.నరసింహారావు హయాంలోనే మూతపడింది. ఇప్పుడు దక్కన్ ఎయిర్‌లైన్స్ సహకారంతో అదే విమానాశ్రయాన్ని తెరిపించే ప్రయత్నాలు జరుగుతున్నాయే తప్ప అక్కడ ఏర్పాటు కానున్నది క్రొత్త విమానాశ్రయం కాదు.

విమానాలతో పోల్చుకుంటే ఆర్థికంగాను, భౌగోళికంగాను ఎక్కువమందికి అందుబాటులో ఉండేవి; ప్రయాణీకులను, భారీ వస్తుసామగ్రిని చౌకగా తరలించడానికి ఉపయోగపడేవి రైలు మార్గాలే. అభివృద్ధికి జీవనాడులు రైలు మార్గాలు. రాష్ట్రంలో మొట్టమొదట రైల్వే సౌకర్యం కల్పించబడిన జిల్లాకేంద్రం కడప. అది నాటికీ, నేటికీ దేశంలోని అతిప్రధానమైన రైల్వే మార్గాల్లో ఒకటైన ముంబై-చెన్నై మార్గంలో ఉండడమే దానికి కారణం. రైల్వే కోడూరు, రైల్వే కొండాపురం లాంటి పేర్లు గల ఊర్లు కడప జిల్లాలోనే ఆ మార్గం లోనే ఉన్నాయి. ఐతే అంత ముఖ్యమైన మార్గం కూడా నాటికీ, నేటికీ ఎదుగూబొదుగూ లేకుండా అలాగే ఉంది. ఇప్పటికీ ఒక ఎక్స్‌ప్రెస్ రైలు వస్తోందంటే ఆ మార్గంలో తిరిగే రైళ్ళన్నిటినీ ఎక్కడివక్కడ ఆపేసి దారి వదలాల్సిందే. ఇప్పటికీ ఆ మార్గంలో పొగబండ్లే తప్ప ఎలెక్ట్రిక్ రైళ్ళు నడవలేవు. ఆ ఒక్క మార్గం తప్ప జిల్లాలో మరో రైలుమార్గమే లేదు. బంగారు-వెండి నగలు, వస్త్రవ్యాపారంలో రెండో బొంబాయిగా ప్రసిద్ధిపొందిన ప్రొదుటూరుకు రైల్వే సౌకర్యం లేదు. ఎర్రగుంట్ల-నంద్యాల మార్గం నిర్మించాలనే శతాబ్దం నాటి ప్రతిపాదనలు ఇప్పుడిప్పుడే కార్యరూపం దాలుస్తున్నాయి.

(వీటన్నిటికీ మూలకారణం ఇక్కడి ప్రజాప్రతినిధుల అలవిమాలిన అలసత్వమే. వాళ్ళకు స్వప్రయోజనాలే తప్ప అభివృద్ధి పట్టలేదు. ఒక్కొక్కరూ నాలుగేసి సార్లు పార్లమెంటు సభ్యులుగా ఉండి, రైల్వే బడ్జెట్లో ప్రతిసారీ కడపజిల్లాలోని రైల్వే ప్రాజెక్టులకు కేటాయించబడిన నిధులు వేరే రాష్ట్రాలకు తరలిపోతుంటే మౌనప్రేక్షకుల్లా చూస్తూండిపోయారే తప్ప ఏనాడూ పార్లమెంటులోగానీ, ఇతర వేదికలపైగానీ నోరెత్తిన పాపానపోలేదు. వారిలో ఒకరు పార్లమెంటులో రైల్వే స్టాండింగ్ కమిటీ సభ్యులు కూడా!)

ఇంకో శుభపరిణామం(తెలుగువీరుడు ప్రస్తావించనిది) ఏమిటంటే రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో ఒక రైల్వేలైను నిర్మాణానికి నాంది పలికారు. 588 కోట్ల అంచనా వ్యయంతో కృష్ణపట్నం-ఓబులవారిపల్లె రైలు మార్గం నిర్మించడానికి రైల్ వికాస్ నిగం లిమిటెడ్, రాష్ట్రప్రభుత్వం, కృష్ణపట్నం పోర్టు కంపెనీ, ఎన్.ఎం.డీ.సీ. ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ లైనుతో కృష్ణపట్నం నుంచి ముంబై వరకు నేరుగా రైళ్ళు నడుస్తాయి. హోస్పేట్-బళ్ళారి ప్రాంత ఖనిజాలు కృష్ణపట్నం రేవుకు, ముడి ఇనుము చెన్నై రేవుకు నేరుగా చేరడానికి అవకాశముంటుంది.


అన్నట్లు నవంబర్ 14 నాటికల్లా కడప జిల్లాలో ఒక్క బాలకార్మికుడు కూడా ఉండరట. ఆ ఘనత సాధించిన మొట్టమొదటి జిల్లా ఇదే కాబోతోంది. అందుకోసం జిల్లాలో అధికారుల లెక్కల ప్రకారమే ఉన్న ఐదువేల పైచిలుకు బాలకార్మికులను ఈలోపల "హాంఫట్" చెయ్యడానికి అధికారులు ఎన్ని తిప్పలు పడాలో మరి :(

Sunday, 8 October 2006

తెలుగు పౌరాణికాలు

భారతదేశంలో చిత్రపరిశ్రమ పౌరాణికాలతో మొదలై సాంఘిక, చారిత్రక, జానపద, అభ్యుదయ, వినోదప్రధాన చిత్రాలతో బహుముఖాలుగా విస్తరిల్లింది. భాషల పరంగా చూస్తే కలకత్తాలో బెంగాలీ చిత్రాలు , ముంబై (బొంబాయి)లో హిందీ చిత్రాలు , చెన్నై (మద్రాసు)లో తెలుగు/తమిళ చిత్రాలు ...ఇలా ఒక్కోచోట ఒక్కోభాషాచిత్రాలు అభివృద్ధి చెందాయి.

సత్యజిత్ రే, తదితర దిగ్గజాలు తీసిన బెంగాలీ సాంఘిక చిత్రాలు ప్రపంచప్రఖ్యాతి పొందినవి.

ఇక చారిత్రకాలు అన్ని భాషల్లోనూ మంచివి వచ్చాయి.

కానీ...తెలుగు పౌరాణికాలతో సాటిరాగల చిత్రాలు మరే భాషలోనూ లేవు, లేవు, లేవు.

Saturday, 7 October 2006

రామాయణం-మహాభారతం

"మన ప్రవర్తన ఎలా ఉండాలి?" అనే ప్రశ్నకు సమాధానం రామాయణమైతే "లోకం పోకడ ఎలా ఉంది?" అనే ప్రశ్నకు సమాధానం మహాభారతం.

మన ప్రవర్తన ఎలా ఉండాలో రామాయణంలోని పాత్రలు చెబుతాయి:

అన్నదమ్ముల అనుబంధం: రామ-లక్ష్మణులు
స్నేహం: సుగ్రీవమైత్రి
తండ్రీకొడుకుల అనుబంధం: దశరథ-రాములు
యజమాని-సేవకులు: రామ-హనుమ
పాలకుడు-ప్రజలు: రాముడు-అయోధ్య ప్రజలు

ఐతే భార్యాభర్తల అనుబంధమెలా ఉండాలో తెలుసుకోవడానికి మాత్రం రామాయణంలో వెదక్కండి. ఒక ఆదర్శవంతుడైన పాలకుడిగా ఉండాలో, లేక ఒక మంచి భర్తగా ఉండాలో నిర్ణయించుకోవలసిన పరిస్థితి ఎదురైనప్పుడు రాముడు ఒక మంచి పాలకుడిగా ఉండడానికే నిశ్చయించుకున్నాడు. ఎటుతిరిగీ తన తప్పేమీ లేకుండా ఆ నిర్ణయానికి బలైపోయింది మాత్రం సీత. (సీత-ద్రౌపదుల గురించి వివరంగా ఇంకొకసారి)

ఇక మహాభారతం విషయానికొస్తే అది అన్నదమ్ముల బిడ్డల (దాయాదుల) మధ్య ఆస్థి (రాజ్యం) కోసం జరిగిన గొడవ. ఇలాంటి గొడవ రామాయణంలో వాలి-సుగ్రీవుల మధ్య జరిగినట్లనిపించినా అక్కడి పరిస్థితులు వేరు. సుగ్రీవుడు తనను చంపడానికి కుట్ర పన్నాడని వాలి బలంగా నమ్మాడు. సుగ్రీవుడి సదుద్దేశాన్ని ఋజువుచేసే ఆధారాలేమీ లేవు. పైగా వాలి తిరిగొచ్చేటప్పటికి సుగ్రీవుడు వాలి భార్యతో ఉంటూ, వాలి రాజ్యాన్ని పాలిస్తున్నాడు. అందుకే వాలి సుగ్రీవుడి మీద ద్వేషం పెంచుకున్నాడు. ఇక తను చెప్పేది ఏ మాత్రమూ నమ్మక వాలి నేరుగా తనను చంపవస్తే పారిపోవడమో ఎదురు తిరగడమో తప్ప సుగ్రీవుడికి గత్యంతరం లేదు.

మహాభారతంలో నాకు కౌరవులు-పాండవుల మధ్య మౌలికంగా ఎటువంటి తేడా కనబడలేదు. వాళ్ళు చేసింది అధర్మమైతే వీళ్ళూ తక్కువేమీ చెయ్యలేదు. వీళ్ళు వీరులైతే వాళ్ళ వైపు అంతకంటే గొప్ప వీరులున్నారు. ధర్మరాజుగా పిలవబడే యుధిష్ఠిరుడు జూదం ఆడేటప్పుడు ఎంతటి హీనస్థితికైనా దిగజారుతాడని ఒకసారి కాదు రెండుసార్లు ఋజువైంది. ఇతర విషయాల్లో కూడా అతడి ప్రవర్తన నాకేమీ ఉదాత్తంగా అనిపించలేదు. అతడికి ధర్మం తెలుసు. కానీ తనకు తెలిసిన ధర్మాన్ని అతడు పాటించడంలోనే వచ్చింది తేడా.

జూదం సప్తవ్యసనాల్లో ఒకటి. తప్పుడుపని అన్న తర్వాత ఎవరుచేసినా తప్పే. జూదం యుధిష్ఠిరుడి అతిపెద్ద బలహీనత - తనతోబాటు తోడబుట్టినవాళ్ళను, కట్టుకున్న పెళ్ళాన్ని సైతం తాకట్టు పెట్టేంత. (అందులోనూ అతడు పందెంగా ఒడ్డిన ద్రౌపది అతడొక్కడికే భార్య కాదు! ఆమెను ఒడ్డేముందు ఆమె ఆమోదం, ఆమె ఇతర భర్తల అంగీకారం తీసుకోవాలనే కనీస బాధ్యత కూడా మరిచిపోయేటంతగా ఆ వ్యసనానికి బానిసైనాడు). దీన్ని ఎవరైనా ఏ రకంగా సమర్థిస్తారో నాకర్థం కాదు. అందులోనూ ఇవే పందాలు ఒడ్డి ఓడిపోవడం వెంటవెంటనే రెండుసార్లు జరిగింది. మొదటిసారి ఓడిపోయినప్పుడు ద్రౌపదికి ధృతరాష్ట్రుడు ఇచ్చిన వరాలతో దాస్యవిముక్తి పొందిన వాడు, మళ్ళీ వెంటనే గుడ్డిగా జూదానికి సిద్ధపడ్డమేమిటో! బలహీనతలున్నవాళ్ళు బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉండతగరు. కేవలం దృష్టి లోపం వల్ల ధృతరాష్ట్రుడు రాజ్యపాలనకు అనర్హుడైతే, వ్యసనపరుడు కాబట్టి యుధిష్ఠిరుడూ అనర్హుడే కావాలి.

ఇక అందరికీ తెలిసినా గుర్తించడానికి ఇష్టపడని, కుంటిసాకులు చెప్పే విషయాలు(చారిత్రక దృక్పథంతో చూసినప్పుడు కృష్ణుడు భగవదవతారమనే విషయాన్ని కాసేపు మరిచిపోదాం):

భీష్ముడి చావు: యుద్ధభూమిలో రాత్రిపూట శతృశిబిరానికి వెళ్ళి "బాబ్బాబు! నువ్వు చచ్చిపో! లేదా కనీసం నిన్నెలా చంపాలో నువ్వే చెప్పు." అని దేబిరించినవాడు యుధిష్ఠిరుడు.

ద్రోణుడి చావు: 'మిన్ను విరిగి మీదపడినా సరే వీడు అబద్ధమాడడు' అని నమ్మించి అతిఘోరమైన అబద్ధంతో గురువు ప్రాణాలనే బలిగొన్నవాడు యుధిష్ఠిరుడు. (యుద్ధంలో గెలవాలంటే గురువును చంపక తప్పదని ముందే తెలుసు. కానీ చంపించడానికి అవలంబించిన పద్ధతే అనైతికం.)

అది అనైతికం కాదనే వాళ్ళు ఒక్కసారి నిష్పాక్షికంగా ఆలోచించండి: ద్రోణుడికి వినబడేలా చెప్పదలచుకున్నదేమో పచ్చి అబద్ధం. ఆ అబద్ధాన్ని కూడా ధైర్యంగా చెప్పలేని పిరికివాడు, అబద్ధాన్ని నిజంలా భ్రమింపజేయడానికి మరింత కుటిలత్వానికి పాల్పడినవాడు యుధిష్ఠిరుడు.

ఇక కర్ణుడి చావులోనూ, దుర్యోధనుడి చావులోనూ జరిగింది అధర్మమే. "నిరాయుధుల మీద ఆయుధాన్ని ప్రయోగించరాదు." ఇది యుద్ధనీతి. భీష్ముణ్ణీ, ద్రోణుణ్ణీ ఆయుధం ప్రయోగించలేని స్థితిలోకి నెట్టీ, కర్ణుణ్ణి నిరాయుధుడుగా ఉన్నప్పుడూ చంపడం జరిగింది. వాళ్ళలో ఏ ఒక్కరు చనిపోకపోయినా యుద్ధఫలితం తారుమారై ఉండేది.

ఇక గదాయుద్ధంలో ప్రథమ నియమం: గదను నాభి క్రిందిభాగంలో ప్రయోగించరాదు. దుర్యోధనుణ్ణి చంపిందేమో గదతో తొడలు విరగ్గొట్టి. చిన్నప్పుడు భీముణ్ణీ, పెద్దయ్యాక లక్క ఇంట్లో పాండవులందరినీ చంపబూనడం, మాయాజూదం కౌరవులు చేసిన నేరాలైతే, వాటిని సాకులుగా చూపి పాండవులు చేసిన తప్పుడు పనులు అంతకంటే ఎక్కువే. యుద్ధం ధర్మబద్ధంగా జరిగి ఉన్నట్లైతే పాండవులు తుక్కుతుక్కుగా ఓడిపోయుండేవాళ్ళు.

మహాభారతయుద్ధం చరిత్రే. అందులో అనుమానం లేదు. ఐతే స్వర్గారోహణపర్వం లాంటివి కేవలం కవుల కల్పన. "ఒక్క విజయం వంద తప్పుల్ని కప్పేస్తుంది." అన్నట్లు కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులు పొందిన అంతిమ విజయం వారిలోని లోటుపాట్లను కప్పేసి వారిని హీరోలను చేసింది.

Sunday, 1 October 2006

చిన్నకథ

తెలుగుపీపుల్.కామ్‌లో సౌమ్య గారు "చిన్నకథ నిడివి ఇంత ఉండాలి అనేం రూలు లేదు కావొచ్చు గానీ...ఎలా చూసినా ఇది చాలా చిన్నదండీ చిన్నకథ కేటగిరీకి." అన్నారు. అంటే రూలు లేకపోయినా తనకొక అభిప్రాయముంది: కథ కనీసం ఇన్ని లైన్లుండాలని. కథ గురించి నా అభిప్రాయాలు వేరు. కథ చిన్నదా పెద్దదా అని కాక అది నాలో కలిగించిన అనుభూతి చిన్నదా పెద్దదా అనే చూస్తాను నేను. ఒక కథ చెత్తకథా, మామూలు కథా, మంచి కథా లేక గొప్ప కథా అనేది తేల్చుకోవడానికి నాకదే గీటురాయి. (ఐతే కథకు క్లుప్తతే ప్రాణం అని చాలామంది నమ్ముతారు.) అనవసరమైన సోదంతా మానేసి సూటిగా విషయం చెప్పేవాళ్ళు నాకు బాగా నచ్చుతారు.

కథంటూ మొదలయ్యాక దిక్కులు చూడ్డం మానేసి సూటిగా లక్ష్యం వైపు పరుగెత్తాలి. నవలారచన విశాలమైన మైదానంలో గుర్రపుస్వారీ లాంటిదైతే కథారచన తాడుమీదనడక లాంటిదంటారు. రచయిత దృష్టి చెప్పదలచుకున్న పాయింటు నుంచి ఏ మాత్రం పక్కకు తప్పినా కథ కుప్పకూలిపోతుంది. అందుకే కథారచయితకు కథ రాసేటప్పుడు తన మీద తనకు గొప్ప అదుపు ఉండాలి. ఈ విషయంలో స్వర్గీయ సొదుం జయరాం చాలా గొప్పవాడని, ఆయన కథల్లో అనవసరమైన సన్నివేశం గానీ, అనవసరమైన వాక్యం గానీ, అనవసరమైన మాటగానీ ఉండవని రచయితలు, విమర్శకులు, సాహితీపత్రికల సంపాదకులు గొప్పగా చెబుతారు. ఆయన రాసిన కథలు చాలా మటుకు రెండుపేజీల్లోపలే ముగుస్తాయి. అయితేనేం? అవి నిస్సందేహంగా చాలాగొప్ప కథలు. కొడవటిగంటి కుటుంబరావు ప్రశంసలు పొందిన కథకుడాయన. రెండేళ్ళ కిందట ఆయన కథలకు రాచకొండ రచనాపురస్కారం వచ్చింది. (సొదుం జయరాం కథలు: ప్రచురణ బండ్ల పబ్లికేషన్స్, విజేత కాంపిటీషన్స్ జనరల్ బుక్స్ సీరీస్).

కేతు విశ్వనాథరెడ్డి ముప్ఫయ్యేళ్ళ కిందట కడప నుంచి వెలువడిన లిఖిత మాసపత్రిక మనోరంజనిలో (సాహిత్యనేత్రం సంపాదకుడు శశిశ్రీ ఈ పత్రికను నడిపారు) "మారుచీరె" అనే కార్డుకథ రాశారు. అది తెలుగుపీపుల్ లోని దాట్ల గారి కథ కంటే చిన్నది. ఐనా ఆ కథ గొప్పదనానికొచ్చిన లోటేమీ లేదు. పాత్రల పేర్లు నాకు గుర్తుండవు. ఈ కథలోని పాత్రల పేర్లు అచ్చమ్మ, బుచ్చమ్మ అనుకుందాం.
ఒకే కాలేజీలో చదివే అచ్చమ్మ ధనవంతుల పిల్ల, బుచ్చమ్మ పేదరాలు. కాలేజీ వార్షికోత్సవమప్పుడు వేసిన నాటికలో అచ్చమ్మ పేదరాలి వేషం, బుచ్చమ్మ ఒక మగవాడి వేషం వేశారు (పేద హీరోయిన్, ధనిక హీరో వేషాలనుకుంటా). స్టేజీ మీద కట్టుకోవడానికి అచ్చమ్మ దగ్గర పాతచీరె లేదు. బుచ్చమ్మ ఎలాగూ మగవాడి వేషం వేస్తోంది కాబట్టి ఆమె చీరె అచ్చమ్మ తీసుకుంది. నాటిక పూర్తయ్యాక బుచ్చమ్మ తన చీరివ్వమని అచ్చమ్మను అడిగింది. దానికి అచ్చమ్మ "ఆ చీరె మళ్ళీ కట్టుకుంటావటే? సహజత్వం కోసం దానికున్న చిరుగులను పెద్దవి చేశానే." అంది. సమాధానంగా "నాకున్న మారుచీరె అదొక్కటేనే." అంటున్న బుచ్చమ్మ గొంతు వణికింది.
కథంతా ఇంతే.

ఇటీవలి సంవత్సరాల్లో రచనలో ఛాయామల్లిక్ మైక్రోకథలు కొన్ని రాశారు. వాటిలో ఒకటి చాక్లెట్-రేపర్: పెళ్ళైన కొత్తలో ఒకనాటి రాత్రి భర్త తన పట్టుచీరను లుంగలు చుట్టిపారేస్తూంటే భార్య "అయ్యో!" అని బాధపడుతుంది. దానికి భర్త "నాకు రేపర్ కంటే చాక్లెట్టే ముఖ్యం." అంటాడు. ముప్ఫయ్యేళ్ళ తర్వాత: భార్య "మీ చాక్లెట్ పాడైపోయిందండీ" అని బాధపడుతుంది. దానికి భర్త "ఇంతకాలం నేను చాక్లెట్ అనుకొన్నదీ రేపరేనని ఇప్పుడు తెలుసుకున్నాను. అసలైన చాక్లెట్ నీ వ్యక్తిత్వమే." అంటాడు.

కొడవటిగంటి కుటుంబరావు రాసిన అనేక గల్పికలు - గొప్ప ఎడ్యుకేటివ్ వాల్యూస్ ఉన్నవి - సగం పేజీలోనే ముగుస్తాయి. చందమామలో సింగిల్ పేజీ కథలు ప్రత్యేక ఆకర్షణ. కాదంటారా?

"వసుంధర"

"ఒక అందమైన సాయంత్రం" టపాలో కిరణ్ అడిగారు - ధర్మనిధి పురస్కారం పొందిన వసుంధర, చందమామ కథల రచయిత వసుంధర ఒకరేనా అని. అవును, ఒకరే. వారి గురించి నాకు తెలిసిన కొన్ని వివరాలు:

జొన్నలగడ్డ రాజగోపాలరావు-రామలక్ష్మి దంపతులు వసుంధర కలం పేరుతో రాస్తున్న జంటరచయితలు. రాజగోపాలరావు గారు రసాయనశాస్త్రవేత్తగా పనిచేసి రిటైరయ్యారు. భువనేశ్వర్లో చాలాకాలం పనిచేశారు. ప్రస్తుతం హైదరాబాదులోనే మకాం. వారుంటున్న ఇంటిపేరు శ్రీవాణీగిరిజానిలయం. (శ్రీ అంటే లక్ష్మిదేవి, వాణి అంటే సరస్వతి, గిరిజ అంటే పార్వతి అని అందరికీ తెలిసిన విషయమే. ముగ్గురమ్మల నిలయమన్నమాట వారి ఇల్లు). వసుంధరతో బాటు బాబి, కమల, సైరంధ్రి, రాజా, రాజకుమారి, శ్రీరామకమల్, యశస్వి, కైవల్య, మనోహర్ వారి కలం పేర్లు.

వీరు ఒక్క చందమామలోనే వెయ్యికి పైగా కథలు రాశారు. వాటిలో కథల ప్రయోజనం, అపకారికి ఉపకారం, మొదలైనవి సుప్రసిద్ధం. వీరి కథల్లో పిల్లలకు విలువైన సందేశం గానీ, అద్వితీయమైన చమత్కారం గానీ తప్పనిసరిగా ఉంటాయి. బొమ్మరిల్లులో నూరుకట్ల పిశాచం కథలు, మరికొన్ని ఇతర కథలు రాయడంతోబాటు లోకజ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలు-జవాబులు, ఈ శతాబ్దపు చివరి దశాబ్దం, లాంటి ఇతర శీర్షికలు కూడా చాలాకాలం నిర్వహించారు. రామలక్ష్మి గారు ఆ పత్రికకు పేరులేని సంపాదకురాలిగా పనిచేశారని చదివాను. ఆమె వసుంధరలో భాగస్వామిగానే కాకుండా విడిగా కూడా చాలా కథలు, నవలలు రాశారు.

ఇక పెద్దలకోసం వారు రాసిన కథలను, నవలలను ప్రచురించని పత్రికలు తెలుగులో దాదాపుగా లేవనే చెప్పవచ్చు. ఈ కథలు ఇంకో వెయ్యిదాకా ఉంటాయి. వాటిలో "ఒక్క అపనలోనే రెండొందలుంటాయి." (అపన: అపరాధపరిశోధన అనే పేరుగల పత్రిక) ఈ కథల్లోనుంచి ఎంపికచేసిన కొన్ని కథలు రెండు సంపుటాలుగా వచ్చాయి: రసికరాజతగువారముకామా?, చిరునవ్వు వెల ఎంత?(హాస్యకథల సంపుటి) వీటిలోని కొన్ని కథలు చదివితే 'ఇలాంటి విశేషాలు అందరి జీవితాల్లోనూ ఉంటాయి. వాటిని కథలుగా మలచగల దృష్టి ఉండాలేగానీ ఎవరైనా కథలు రాయొచ్చు' ననే ధైర్యమొస్తుంది. (నిజంగా వీరు చాలామందిని కథలు రాయమని ప్రోత్సహించారు, కొందరిని వేధించారు కూడా: తీరుబాటు అనే కథలో ఆ విషయం వివరిస్తారు.) కానీ అధిక శాతం కథలు అద్భుతమనిపిస్తాయి. అలాంటి కథలు రాయడం మాత్రం నిజంగా అనితరసాధ్యం.

మనకు ఎప్పుడైనా ఎవరైనా వ్యక్తులమీద గానీ , పరిస్థితుల మీద గానీ కోపమో, చిరాకో, అసహ్యమో, అభిమానమో, అబ్బురపాటో, అవేశమో, ఆక్రోశమో, నవ్వో, ఇలా ఎలాంటి భావమైనా కలిగితే దాన్ని మాటల్లోనో, చేతల్లోనో చూపిస్తాం. వీరు మాత్రం దాని మీద కథ రాసేస్తారు అని కూడా అనిపిస్తుంది వీరి కథలు చదివితే. తాము చెప్పదలచుకున్న ఏ విషయాన్ని గురించైనా కథో, నవలో రాయగల ప్రతిభ వీరికి ఉంది.

అలాగని వీరు కథలు మాత్రమే రాసి ఊరుకోలేదు. రచన మాసపత్రికలో సాహితీవైద్యం(సా.వై.), కథాపీఠం, కథాప్రహేళిక, నిషిద్ధాక్షరి, దొరకునా ఇటువంటిసేవ, లాంటి శీర్షికలు నిర్వహించారు. సా.వై. శీర్షిక కొన్ని వందలమంది రచయితలను తయారుచేసింది, ఇంకా చేస్తోంది. ఇలాంటి శీర్షికానిర్వహణ ఏ భాషలోనైనా అపూర్వం కాగా ఆ శీర్షికను దశాబ్దం పైగా ఏకధాటిగా నిర్వహిస్తున్నారు. ఇన్ని పనులు చేయడానికి వీరికి సమయమెలా సరిపోతుంది? ప్రతిరోజూ ఒక నిర్ణీతసమయంలో ఏదో ఒకటి రాయాలి అని నిశ్చయించుకుంటే ఎన్నైనా రాయవచ్చు అనేది వీరి అనుభవం.

వీరు రాసిన నవలలు నేను ఎక్కువ చదవలేదు. నేను చదివిన నవలల్లో నాకు అద్భుతంగా అనిపించినవి అద్దం ముందు పిచికలు, ఆడపడుచు, సూర్యనమస్కారం, శ్రీరామునిదయచేతను, మొక్కలు పిలుస్తున్నాయి, మొదలైనవి. వీరి నవలలు కొన్ని సినిమాలుగా కూడా వచ్చాయి.

వీటితోబాటు వీరు అప్పుడప్పుడూ కవితలు కూడా రాస్తారు.