Friday 8 September, 2006

కాళిదాసు కంచుబొమ్మ

గత సంవత్సరం (2005) చైనా ప్రభుత్వం నుంచి మన విదేశాంగశాఖవారికి వచ్చిన ఒక అభ్యర్థన వారిని తెల్లబోయేలా చేసింది. గందరగోళంలోకి నెట్టింది. చైనీయులు కోరింది క్రీ.శ. ఆరవ శతాబ్దానికి చెందిన ఒక మహనీయుడి కాంస్యవిగ్రహం కావాలని. ఆయనెలా ఉంటాడో ఎవరికీ తెలియదు. కనీసం రేఖాచిత్రాలు కూడా లేవు. అలాంటివాడి ప్రతిమ చేసివ్వమని అడిగితే ఏం చెయ్యడం? ఎలా ఇవ్వడం? అసలు చైనీయులకు ఆ విగ్రహంతో ఏం పనిబడింది?

చైనా ప్రభుత్వం తమ దేశప్రజల్లో సాంస్కృతిక అవగాహనను పెంచడానికిగాను షాంఘై థియేటర్ స్ట్రీట్ లో కాళిదాసు విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించింది. ఐతే సమస్యేమిటంటే కాళిదాసు బొమ్మలు కాదుగదా కనీసం ఆయన రూపురేఖావిలాసాదులెలాంటివో తెలిపే వర్ణనలైనా ఎక్కడా లేవు. చైనీయుల అభ్యర్థనను మన విదేశాంగశాఖ వారు భారతదేశ సాంస్కృతిక సంబంధాల మండలి (ICCR)కి, ఆ మండలి మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వమేమో ఉజ్జయినిలో ఉండే కాళిదాసు అకాడెమీకి పంపించారు. ఆ మహాకవి, నాటకకర్త క్రీ.శ. ఆరవ శతాబ్దంలో ఉజ్జయినిలోనే నివసించాడని నమ్ముతున్నారు.

కాళిదాసు రచనలను మనోవిశ్లేషణాత్మక దృక్పథంతో అధ్యయనం చేసిన నిపుణులు ఆయన చాలా అందగాడని తేల్చారు. (ఆయన పేరు మీద ప్రచారంలో ఉన్న అనేక కథలు; సాహిత్య, చారిత్రక గాథలు దీనికి అనుగుణంగానే ఉన్నాయి.) ఈ అంచనాల ఆధారంతో చివరికి తల నుంచి రొమ్ము వరకు గల ఒక 30 అంగుళాల కంచుబొమ్మను తయారుచేయించారు. ఇలాంటి ప్రయత్నం జరగడం మనదేశంలో ఇదే మొదటిసారి. ఈ విగ్రహాన్ని సాంస్కృతిక సంబంధాల మండలికి చెందిన విగ్రహ తయారీ నిపుణుల సంఘం ఆమోదించాక విదేశాంగశాఖ గత జూన్ నెల చివరి వారంలో చైనాకు పంపింది. ఆ విగ్రహాన్ని నిన్ననే షాంఘై థియేటర్ స్ట్రీట్ లో ఆవిష్కరించారు.

అక్కడ కొలువుదీరనున్న 19 మంది జగత్ప్రసిద్ధుల్లో ఆసియా ఖండానికి చెందిన ఒకేఒక వ్యక్తి మహాకవి కాళిదాసు.

మొదటివార్త ట్రిబ్యూన్ లో

తాజావార్త ఈరోజు హిందూ (ప్రింట్ ఎడిషన్)లో

3 comments:

Anonymous said...

చైనీయులు చాలా అభినందనీయులు. వారు వారినే ఎంతో గౌరవించుకున్నట్టయింది.మన వాళ్ళూ వున్నారు, ఎందుకూ ఎక్కడ చూసినా ఇందిర, రాజీవు, అంబేద్కరు..గాంధి గారు, నెహ్రూ గారు ఎప్పుడో కనుమరుగైపోయారు లేండి.

Naga said...

చాలా బాగుంది ఈ టపా...

cbrao said...

ఈ వ్యాసం ఉజ్జయినీ పట్టణంలో నా విద్యభ్యాసపు రోజులను గుర్తుకు తెచ్చింది. అక్కడ ప్రతి వత్సరమూ కాళిదాస సమారోహములు జురుగుతూ ఉండెడివి. విక్రం యూనివర్సిటి ఉపాధ్యక్షులు సుమన్ గారికి ఒక సంవత్సరము ఈ బహుమతి(కాళిదాస పురస్కారము) లభించినది.ఉజ్జయినీ పట్టణంలో అక్కడి ప్రజలు చెప్పే కాళిదాసు రాజసౌధము (palace) షిప్రా నది ఒడ్డున 1458లో మాండు సుల్తానులచే నిర్మింపబడినది.