Monday, 13 October, 2008

చందమామ పిచ్చోళ్ళ కథ

నాగమురళి గారి బ్లాగులో పాత చందమామలు చదివారా? నా కలల్లో కనిపించే స్వర్గం కూడా అలాగే ఉంటుంది. కాకపోతే నా అభిమానం పూర్తిగా చందమామ మీదే కేంద్రీకృతమైంది. బాలజ్యోతి రుచి దాదాపుగా నేనెరుగను. చిన్నప్పుడు చదివిన బాలమిత్ర కాస్త పెద్దయ్యాక నాకు నచ్చడం మానేసింది. చందమామ అలా కాదు. కొన్నేళ్ల కిందట తెలుగులోనూ, ఇంగ్లీషులోనూ చందమామకు విరివిగా ఉత్తరాలు రాశాను. అప్పట్లోనే నేను రాసిన సింగిల్ పేజీ కథ కూడా ఒకటి చందమామలో వచ్చింది. అంతర్జాలంలోకొచ్చాక తెవికీలో చురుగ్గా ఉన్నరోజుల్లో చందమామ గురించి రాశాను, ఆర్కుట్లో చందమామ కమ్యూనిటీని ఏర్పాటు చేశాను. ఇంకా... బ్లాగుల్లో కూడా బహుశా చందమామ గురించి ఎక్కువసార్లు బ్లాగింది నేనే అనుకుంటా. ఇప్పటికీ ప్రతినెలా విడవకుండా చందమామ చదువుతాను. ఎప్పటికీ చదువుతూనే ఉంటాను. అందుకే చందమామ పిచ్చోళ్ళ క్లబ్బులో నాకు శాశ్వత సభ్యత్వముంది. :) ఇస్తే చిన్నదో, పెద్దదో ఒక పదవి కూడా తీసుకుంటా!

మొదట్లో chandamama.com లో పెట్టిన PDF ఫైళ్ళు అన్నీ ఆత్రంగా డౌన్లోడు చేసి పెట్టుకున్నాను. అదెంత మంచిపనో ఇప్పుడు chandamama.comలో ఆర్కైవ్స్ చూసినవాళ్లకు అర్థమౌతుంది. ఐతే ఒక లోటేమిటంటే ఆ PDF ఫైళ్లలో జూలై 1947, డిసెంబర్ 1948, ఫిబ్రవరి 1949, మార్చ్ 1955, సెప్టెంబర్ 1959 సంచికలు లేవు. "ఎలాగరా దేవుడా! మనకు ఇంతేనా ప్రాప్తం?" అనుకుంటూ ఉంటే దేవుడల్లే నాగమురళి గారు తన బ్లాగులో నేను చూడని ఆ టపా గురించి బ్లాగాగ్ని గారి బ్లాగులో వ్యాఖ్య రాసి ulib.orgకి దారి చూపించారు. ఐతే ఆ ulibలో డిసెంబరు 1948 పేరుతో ఉన్నది డిసెంబరు 1949 సంచిక. (ఈ విషయం నేను ULIB వాళ్ళకు తెలిపాను. డిసెంబరు 1948 సంచిక ULIBలో లేకపోయినా ఇప్పుడు నా దగ్గర ఉంది లెండి. లేకపోతే నేను చంపినెలా అవుతాను? :)) పైగా ulib.org సర్వరు మీద మనలాంటి పిచ్చోళ్ళు ఎక్కువగా దాడి చేస్తూండడం వల్లనో ఏమో ఆ సైటు ఎప్పుడూ ముక్కుతూ మూల్గుతూ ఉంటుంది. పోయిన్నెల్లో పరిస్థితి ఇది. ఇప్పుడు బాగైందేమో తెలియదు.

ఇదంతా ఇప్పుడెందుకంటే ఈమధ్య నేను హైదరాబాదుకు వెళ్ళినప్పుడు పని ఉండి ఒక పెద్దాయన్ను కలిశాను. మాటల మధ్యలో చందమామ ప్రస్తావన వచ్చింది. ఆయన తన దగ్గర పాత చందమామలు చాలా ఉన్నాయి కానీ ప్రారంభ సంచిక (1947 జూలై) లేదని వాపోయాడు. అప్పుడు నేను ఆయనకు చాలా ఉత్సాహంగా "ఆన్లైన్లో చందమామ" కథ చెప్పాను. ulib.org నుంచి శ్రమపడి అంతకుముందురోజే డౌన్లోడు చేసుకున్న సదరు సంచికలోని 68 పేజీలూ 68 పీడీఎఫ్ ఫైళ్ళుగా నా దగ్గరున్న పెన్ డ్రైవ్ లో భద్రపరచుకుని తిరుగుతున్న నేను ఆయన కోరిన సంచికతో బాటు బ్లాగాగ్ని కానుకలైన సీరియళ్లను కూడా ఆయన కంప్యూటర్లోకి కాపీ చేసి ఇచ్చాను. అవి చూసి ఆయన పరమానందభరితుడయ్యాడు.

అన్నిటికంటే ముఖ్యంగా (అసలు దొరుకుతుందనే ఆశలు దాదాపుగా వదిలేసుకున్న) ప్రారంభసంచిక కంటబడడంతో ఆయన ఉత్సాహంగా మాట్లాడుతూ, ఆ విడి విడి పేజీలను పేజ్ మేకర్లో అమర్చుకుని, వెలిసిన రంగులు సరిచేసి, పడిన మరకలు తుడిచేసి, ప్రింటౌట్లు తీసుకుని మళ్ళీ కొత్తగా చందమామను తయారుచేసుకుంటాననేసరికి నేను నోరెళ్ళబెట్టాను. ఆయన అదేమీ గమనించకుండా తన ధోరణిలో తాను ఇంకా సెలవిచ్చిందేమంటే అలా చెయ్యడానికి రోజుకు పద్దెమినిది గంటల చొప్పున పనిచేస్తే మూడురోజులు పడుతుందని, ఇంతకుముందొకసారి తాను అలాగే చేశాడని! అప్పుడే అనిపించింది నాకు - ఆయన్ను ఆలిండియా చందమామ పిచ్చోళ్ళ సంఘానికి అధ్యక్షుణ్ణి చేసెయ్యొచ్చని. ఐతే మరి కాసేపట్లోనే ఆ అభిప్రాయం మార్చుకున్నాను. ఎందుకో కింద చదవండి. ;)

నా నోరు మూతపడిన తర్వాత మాటలు చందమామ సీరియళ్ల మీదికి మళ్ళాయి. నేను 1980 ల ప్రారంభంలో చందమామ చదవడం మొదలుపెట్టినప్పుడే ముగ్గురు మాంత్రికులు సీరియల్ మొదలైందని నేనంటే ఆయన "ఆ సీరియళ్లన్నీ అంతకుముందే ఒకసారి వచ్చాయి. 80లలో వెయ్యడం అంటే అది రెండోసారి" అన్నాడు. దానికి నేను "అవునండీ, మా తరం వాళ్లం ఫాలో అవగలిగింది రెండో ఇన్నింగ్స్ నే" అని చెప్పాను. ఆయన తాను చదివిన సీరియళ్ల గురించి చెప్తూ పుస్తకరూపంలో తన దగ్గరున్న విచిత్ర కవలలు, మరికొన్ని చందమామ సంచికలను కలిపి బైండ్ చేసిన పుస్తకాన్ని నాకు చూపించాడు. (ఇంతకు ముందు చందమామలో ప్రజాదరణ పొందిన సీరియళ్ళను, కథలను తెలుగులో (కూడా) పుస్తకాలుగా విడుదల చేసేవాళ్ళు. ఆ పుస్తకం చూడగా నాకు తెలిసింది ఏమిటంటే అలా విడుదల చేసిన పుస్తకాల్లో ఆ కథలు బొమ్మలతో సహా అచ్చం చందమామలో వచ్చినప్పుడు ఎలా ఉండేవో అలానే ఉండేవని. ఎంత గొప్ప విషయమో కదా? సాధారణంగా పుస్తకాలుగా వచ్చే కథలు, నవలల్లో అలా బొమ్మలు ఉండవు.) మడతలు పెట్టి, ట్వైన్ దారంతో చుట్టిన ఒక పాలిథీన్ కవర్లో భద్రంగా ఉంది ఆ పుస్తకం. ఉద్వేగంగా దాన్ని అందుకుని తెరవబోతే తిప్పిన పేజీలు తిప్పినట్లు ఊడి చేతిలోకొచ్చేస్తున్నాయి. బహుశా చందమామ ప్రారంభసంచికను ఏదో ఒకరూపంలో అందజేశానన్న అభిమానంతోనే వాటిని నాకు చూపెట్టినట్లు అర్థం చేసుకున్నాను.అదే పుస్తకం ఆ స్థితిలో నా దగ్గరున్నట్లైతే సాక్షాత్తూ మన్మోహన్ సింగ్ వచ్చి అడిగినా ఇచ్చేవాడిని కాను. ఏమో, బహుశా అబ్దుల్ కలాం అడిగితే ఇస్తానేమో లెండి. ;) పైగా ఆయన ULIB founding sponsor కూడా.

తా.క.:

అన్నట్లు మీకు దాసరి వెంకట రమణ అనే పేరు తెలుసా? చందమామలో అప్పుడప్పుడూ కథలు రాసే ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో "చందమామ కథలు - బాలల్లో వ్యక్తిత్వ వికాసం" గురించి పరిశోధన (Ph.D.) చేస్తున్నారు. ఆయన చాలా కాలంగా పాత చందమామల కోసం వెదుకుతున్నారు. గతంలో ఆయన ఫోన్నంబరు, ఈమెయిల్ ఐడీ కూడా నా దగ్గర ఉండేవి. ఇప్పుడు వెదికితే కనిపించలేదు. మీకు తెలిస్తే పాత చందమామలు chandamama.comలోను, ulib.orgలోను దొరుకుతాయని ఆయనకు చెప్పండి.

వచ్చే నెలనుంచి చందమామ విడిప్రతి 20 రూపాయలు ఔతుందట. ఈ నెలాఖరులోగా చందా కట్టేవారికి ప్రత్యేక తగ్గింపు ధరలు ఉంటాయి. కాబట్టి త్వరపడండి.

16 comments:

Anonymous said...

వామ్మో! ఇంతమంది ‘చంపి’ల గురించి తెలుసుకోగలుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మీరన్నట్టుగా ఆయనెవరో గానీ చంపిల ప్రెసిడెంటు పదవికి ఖచ్చితంగా అర్హుడే. నేను మాత్రం సాధారణ సభ్యుణ్ణే.

యూలిబ్ వాళ్ళ సైటు చూస్తే కొంచం బాధేస్తుంది. చేస్తున్నది చాలా మంచి పని. దాన్ని ఇంకాస్త క్వాలిటీతో చేస్తే ఎంత బాగుంటుందో కదా...

కత్తి మహేష్ కుమార్ said...

నేనూ ‘చంపి’నే..మీ సంఘంలో చోటివ్వండి బాబూ!

మేధ said...

ఇంకొక 'చంపి'... :-)

బ్లాగాగ్ని said...

చంపి సంఘం వర్ధిల్లాలి :) 20/- కాదు 200/- అయినా చందమామ కొనటం మానేది లేదని మనవి చేస్తున్నా అధ్యక్షా. పాత బాలజ్యోతి పుస్తకాలు కూడా ఏదోవిధంగా సంపాదించగలిగితే ఎంత బాగుంటుందో.

ఉమాశంకర్ said...

నాక్కూడా ఒక టికెట్ ఇవ్వండి.

నేను చందమామ , బాలమిత్ర, బాలజ్యొతి ల తో పాటు అప్పట్లో కొత్తగా వచ్చిన ఇంకొక పత్రిక ని కూడా చూసినట్టూ గుర్తు. దాని పేరు జాబిల్లి అనుకొంటా.

రమణి said...

మీ 'చంపి ' జనాభా లెక్కల్లో నన్నూ కలిపేసుకొండి.

సిరిసిరిమువ్వ said...

ఆలిండియా చందమామ పిచ్చోళ్ళ సంఘానికి మిమ్ముల్ని కార్యదర్శిని చేసేసాం పోండి:)))

అప్పట్లో చందమామ వచ్చిన రోజు ఇంట్లో పిల్లల సందడే సందడి, నేను ముందంటే నేను ముందని పోట్లాడుకుని మరీ చదివేవాళ్ళం. బాలజ్యోతి, బాలమిత్ర కూడా బాగుండేవి.

చందా కట్టాలనుకునేవాళ్ళకి ఈ వివరాలు పనికొస్తాయేమో చూడండి.

www.Chandamama.org కి వెళ్ళి ఖాతాదారులుగా చేరవచ్చు.

చందా డబ్బు డి.డి కానీ, మని ఆర్డర్ ద్వారా కానీ
Remittances in Favour of
" CHANDAMAMA INDIA LIMITED"

TO address
Subscription Division
Chandamama India limited
82, Defence officers Colony
Ekkatuthangal
Chennai - 600032

E mail : subscription@chandamama.org


ఇంకా తెలుగుదుకాణం వారి నుండి కూడా పొందవచ్చు.
http://www.telugudukanam.co.in/magazine.php?page=4&sortOrderParam=Product_Name

http://www.telugudukanam.co.in/Magazine/0_Telugu_Monthly_6.htm#%E0%B0%9A%E0%B0%82%E0%B0%A6%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AE%20(%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81)

భావకుడన్ said...

ప్రతీ నేలా వచ్చే చందమామ, బాలమిత్రా, బొమ్మరిల్లు -ఇవి మూడు నేను, మా ఇద్దరు చెల్లెళ్ళు వంతులు వేసుకొనే వాళ్లము, ముందు ఎవరు చదవాలా అనేదానికి.

మేమందరం కూడా ముగ్గురు మాంత్రికుల సమయం వాళ్ళమేనండోయ్.

సో, ఇంకో చంపీకి టిక్ కొట్టండి.

త్రివిక్రమ్ Trivikram said...

@ నాగమురళి,

కలలో ఏకంగా స్వర్గాన్నే సృష్టించుకున్న మీరు సాధారణ సభ్యుణ్ణే అంటే ఎలా నమ్మమంటారు? :) యూలిబ్ వాళ్ల గురించి మీ బాధ నా బాధ కూడా.

@ మహేష్, మేధ, ఉమాశంకర్ & రమణి,

నేనూ చం.పి.నే అని సగర్వంగా చెప్పుకునేవాళ్లందరికీ చోటు ఉంటుందిలెండి.

@ బ్లాగాగ్ని,

చం.పి. సంఘంలో మీకో పేద్ధ పీట వేసి ఉంచాం. :) బాలజ్యోతి కూడా యూలిబ్ లో పెడతారేమో చూడాలి.

@ సిరిసిరిమువ్వగారూ,

అదగంది అమ్మైనా పెట్టదంటారు. అందుకే అడిగేశా. నా కోరికను అనుగ్రహించినందుకు మీకు ప్రత్యేకంగా నెనర్లు. మా ఇంట్లో కూడా అదే పరిస్థితి. అన్నిటికంటే ముందు బొమ్మరిల్లు వచ్చేది. ఇక అప్పట్నుంచి ఎదురుచూపులు మొదలు. బాలమిత్ర వచ్చినప్పుడు ఆరాటం కాస్త ఉపశమించినా క్లైమాక్స్ మాత్రం చందమామతోనే. పది రోజులు గడవగానే మళ్ళీ ఎదురుచూపులు మొదలు.

చందా కట్టదలచుకున్నవారు ఈ లింకు చూడండి: http://www.chandamama.com/subscribe/subscribebook.php

@ భావకుడన్,

చందమామ, బాలమిత్రా, బొమ్మరిల్లు - మా ఇంట్లో కూడా సరిగ్గా ఇదే కాంబినేషను! బొమ్మరిల్లు అంతా బాగానే ఉండేదిగానీ పౌరాణిక సీరియల్ చదువుతూ ఉంటే చాలా చిరాకేసేది. కానీ కథల్లో ఎవర్ గ్రీన్ బేతాళ కథల్లాంటి కరాళ కథలు, వాటికితోడు మా చిన్నప్పుడు వస్తూ ఉండిన నూరుకట్ల పిశాచం కథలు, తర్వాతి కాలంలో వచ్చిన అపూర్వగాథలు చాలా బాగుండేవి. ఈ అపూర్వగాథలు (పురాణాల్లోంచి సేకరించి డా.జొన్నలగడ్డ మార్కండేయులు రాసినవి అద్భుతంగా ఉండేవి. ఈ కథలు చాలామందికి తెలియనివి) తర్వాత పుస్తకరూపంలో కూడా వచ్చాయి. ఇక కాల్పనికేతర శీర్షికలు కూడా బొమ్మరిల్లులో చాలా బాగుండేవి. తాతయ్య ప్రశ్న - మనవడి జవాబు, మొట్టమొదట...ఇలా జరిగింది, ఈ శతాబ్దపు చివరి దశాబ్దం, వింతలు-విశేషాలు, మొదలైనవి. ఈ శీర్షికలన్నీ వసుంధర గారి నిర్వహణే అనుకుంటా.

కొత్త పాళీ said...

నిజంగా గొప్ప చంపి (ఎంపి కి పోటీగా, అంతకన్నా ఇంకా గౌరవ ప్రదంగా పేరు వెనుక తగిలించుకోదగిన బిరుదు) లని పరిచయం చేశారు. నేనూ బాల్యంలో ఉత్సుకతతో చదివాను కానీ, 10 ముగియడంతో ఆసక్తులు వేరే దారి పట్టేశాయి. ఒక తమాషా ఉంది. మనం ఏక్టివ్ గా చదివే రోజుల్లో ఏ సీరియళ్ళు వచ్చేవో మాత్లాడితే, దాన్ని బట్టి వయసు ఉజ్జాయింపుగా గెస్ చెయ్యొచ్చన్న మాట! :)
మా అన్నయ్య అజమాయిషీ ముగిశాక నేను చందమామకి ఏకైక హక్కుదారుణ్ణై ఉన్న సమయంలో సీరియల్సు కత్తిరించి దాచి పెట్టాను. ఒక సారెప్పుడో ఏదో పరిక్షలో మార్కులు తక్కువొచ్చాయని అమ్మ కోప్పడితే ఆ ఉక్రోషంలో ఆ పేజీలన్నీ, దాదాపు మూడు సీరియళ్ళు, ఒక్కటి కూడా మిగల్చకుండా చించి పారేశా :(

జ్యోతి said...

నేనైతే మీ అందరికంటే పెద్ద చంపిని అని నాకు నేనే నిర్ణయించేసానన్నమాట.
ఇప్పుడు ఆసక్తి తగ్గింది కాని. చిన్నప్పుడూ ఎవరింటికి వెళ్లినా చందమామ పుస్తకాలు వెతకడమే. కాని అవి కనపడవు. బాలమిత్రకంటే చందమామ ఎక్కువ ఇష్టం. కొత్త పుస్తకం రాగానే మా తమ్ముళ్లకు కనపడకుండా దాచేసి రెండు గంటల్లో అవగొట్టేసి మళ్ళి నెల దాకా ఎదురుచూడాలంటే విసుగొచ్చేది. కనీసం వారానికొకటైనా వేస్తే బాగుండేది అనుకున్నాను ఎన్నోసార్లు. ఆ పుస్తకాలు అమ్మేయలేక, సీరియళ్లు కత్తిరించి, బైండింగ్ చేయించేదాన్ని అమ్మతో చెప్పి. అసలు నాకు తెలుగు బాగా చదవడం, రాయడం వచ్చింది అంటే చిన్నప్పుడూ అమ్మ అలవాటు చేసిన చందమామా నే..మా పిల్లలకు కూడా ప్రయత్నించాను. ఎక్కడ బండెడు క్లాసు పుస్తకాలతో కుస్తీ పట్టడంలోనే అలిసిపోయేవారు.

త్రివిక్రమ్ Trivikram said...

@ కొత్తపాళీ:

>> ఎంపి కి పోటీగా, అంతకన్నా ఇంకా గౌరవ ప్రదంగా పేరు వెనుక తగిలించుకోదగిన బిరుదు

మంచి మాట చెప్పారు. నెనర్లు. :)

>> వయసు ఉజ్జాయింపుగా గెస్ చెయ్యొచ్చన్న మాట! :) ఔనండోయ్, ఐతే అది ఎన్నో ఇన్నింగ్సో కూడా తెలియాలి.

>> ఆ పేజీలన్నీ, ... చించి పారేశా :(

అయ్యో, ఎంతపని చేశారండీ? ఆ పెన్నిధిని అలా ధ్వంసం చేసే బదులు ఎవరికైనా ఇచ్చెయ్యవలసింది.

జ్యోతక్కా,

మీరూ చంపి నే అని తెలిసి ఆనందంగా ఉంది. చందమామలు అమ్మెయ్యడమెందుకూ? ఇంట్లో ఉంటే అవేమైనా అల్లరి చేస్తాయా? అన్నమూ నీళ్ళూ అడుగుతాయా? ఎక్కువ స్థలం కూడా ఆక్రమించవు కదా? అన్నట్లు మీ దగ్గర పాత సీరియళ్ళు ఉన్నాయా?

జ్యోతి said...

త్రివిక్రం.

ఉండేవి కొన్ని పుస్తకాలు. కాని గత సంవత్సరం అన్నీ పంచేసానుగా. ఎవరికి వెళ్లాయో గుర్తులేదు. ఇపుడు అవి చదివే ఓపిక లేదు. చూడాలి ఎవరిదగ్గరైనా ఉన్నాయేమో?

బ్లాగాగ్ని said...

గురూగారూ, ఇటో లుక్కెయ్యండి
http://blogaagni.blogspot.com/2008/12/wwwuliborg.html

Chandamama said...

చందమామ ఆర్కైవ్స్‌లో ఇప్పుడు 1947 నుంచి 1990 వరకు క్రమం తప్పకుండా అన్ని సంచికలూ అందుబాటులో ఉంటున్నాయి చూడండి. telugu.chandamama.com లో దాసరి సుబ్రహ్మణ్యం గారి ధారావాహికలు క్రమం తప్పకుండా వేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. చందమామ చిరునామా కూడా ఢిపెన్స్ కాలనీనుంచి మరో రెండు తావులు మారి ప్రస్తుతం చెన్నయ్, తిరువాన్మయూర్ లోని చిన నీలాంగరై ప్రాంతానికి చేరుకుంది. చందమామ పిచ్చోళ్లు అందరికీ చందమామ తరపున వేనవేల కృతజ్ఞతలు. నిజంగా చందమామ బ్రాండ్ విలువను పెంచుతున్నది మీలాంటివారే.. పదికాలాల పాటు కొనసాగడం మాట అటుంచితే మన కళ్లముందు మిలమిలాడుతున్న చందమామ ప్రింట్,ఆన్‌లైన్ ఎడిషన్లను మిగిల్చుకోవాలంటే మీ అందరి ఆధరాభిమానాలు తప్పక కావాలి. ఇందుకు మీ ప్రయత్నం మీరు చేస్తారని ఆశిస్తూ...

ప్రసూన said...

నాకూ ఒక టికెట్ ప్లీజ్ ... :-)
నాదీ ఇదే కధండీ. చిన్నప్పుడు, నేనూ , మా చెల్లేళ్ళూ, మా నాన్నగారూ చందమామ కోసం ఎంతగా ఎదురుచూసేవాళ్ళామో. ఒక్కోసారి రెండు మూడు రోజులు ఆలస్యంగా వచ్చేది. నెల మొదట్లో చందమామ చేతికి వచ్చేదాకా రోజూ స్కూల్ అయిపోగానే పుస్తకాల షాపుకి వెళ్ళి "చందమామ వచ్చిందా? ఇంకా రాలేదా ? ఎప్పుడు వస్తుంది? " అని ఆడుగుతూ ఉండేవాళ్ళం. :-) ఇప్పటికీ మా ఊరు వెళ్ళినప్పుడల్లా ఆ షాపు చూస్తే ఇదే గుర్తొస్తుంది.

చిన్నప్పుదు చందమామ బైండు పుస్తకాలు చదివేవాళ్ళం. :-( అవి ఇప్పుడు లేవు. :-(

ఇక్కడ ఇంతమంది చందమామ అభిమానుల్ని చూస్తుంటే ఎంత సంతోషంగా ఉందో.. :-)