Wednesday 8 August, 2007

వైవీయూలో ఎరుకల భాష

ఎరుకల భాషకు నిన్నమొన్నటిదాకా అసలు లిపే లేదని మీకు తెలుసా? కడప నగరం బహుజన నగర్ కు చెందిన రామకోటేశ్వర రావుకూ తెలియదు - ఆయనకు ఎరుకలతో పరిచయం ఏర్పడేదాకా. పది భాషల్లో ప్రావీణ్యమున్న ఆయనకు ఆ విషయం తెలియగానే ఆశ్చర్యమనిపించింది. ఆయన తెలుగు, హిందీ, ఆంగ్ల లిపుల ఆధారంగా కొత్త లిపిని తయారు చేశాడు. (దీనికి ఆయన 2005లో పేటెంటు కూడా పొందాడు.) ఎరుకల భాష నేర్చుకునే వారి కోసం ఆ లిపిలోనే ఐదో తరగతి వరకు పాఠ్య పుస్తకాలు కూడా తయారుచేశాడు. ఇంత చేసిన రామకోటేశ్వరరావు ఉండేది ఒక గుడిసెలో! ఆ గుడిసెకు విద్యుత్ సౌకర్యం కూడా లేదట!!

ఎరుకల భాష కోసం ఆయన చేసిన కృషిని గుర్తించిన యోగి వేమన విశ్వవిద్యాలయం (YVU, కడప) కులపతి (వైస్ ఛాన్సలర్) ఎ. రామచంద్రారెడ్డి ఆయన్ను విశ్వవిద్యాలయంలో స్నాతకోత్తర విద్యార్థులకు, పూర్వ విద్యార్థులకు ఎరుకల భాష నేర్పడానికి టీచింగ్ అసిస్టెంటుగా నియమించారు. ఎరుకల భాష లిపిని మరింత సరళం చేయడానికి ప్రభుత్వం లేదా విశ్వవిద్యాలయం నుంచి సహకారం లభించగలదని ఆశిస్తున్నాడు రామకోటేశ్వరరావు.

(ఈరోజు హిందూలో వచ్చిన వార్త ఆధారంగా)

8 comments:

spandana said...

అసలు లిపి వున్నవాళ్ళు దాన్ని కాపాడుకోవాలని తపన పడటంలో అర్థం వుంది కానీ, అసలు లిపిలేని భాషలకు కొత్త లిపిని ఎందుకు సృష్టించాలో దాని అవసరం ఎంటో నాకు భోధపడలేదు. వున్న లిపుల్లో కొన్ని శబ్దాలకు అక్షరం లేకుంటే దాన్ని తయారుచేసుకుంటే సరిపోదా?

--ప్రసాద్
http://blog.charasala.com

రవి వైజాసత్య said...

లిపి ఉన్నా లేకున్నా ఎవరికైనా తల్లిభాష తల్లిభాషే. లిపి ఉన్న భాషలే సజీవంగా ఉండటానికి కష్టపడుతుంటే ఇక లిపి కూడా లేకుంటే అంతే సంగతులు..గోవిందా గోవిందా. ఈయన కృషి మెచ్చదగినదే!! (ఆశ్చర్యం కడపలో కొత్త విశ్వవిద్యాలయం తెరిచారా? భలే భలే రాజశేఖరుని పుణ్యమా? రాష్ట్రంలో ఓడినా గెలిచినా కడప జిల్లాలో మాత్రం భారీ ఎత్తున గెలుస్తాడని మొన్నీమధ్య వెళ్లినప్పుడు జనాలన్నారు) (సైడుట్రాకును క్షమించగలరు)

రాధిక said...

ఎరుకల భాష కి లిపి లేదని తెలుసు.మా అమ్మమ్మ చెపుతూ వుండేవారు.మిగిలిన విషయాలన్నీ ఇప్పుడే తెలుసుకున్నాను మీ ద్వారా.కొత్త లిపి అనవసరమనే నా వుద్దేస్యం కూడా.వున్నవాటిని వుద్దరించుకుంటే సరిపోతుంది కదా.

S said...

ఇది నిజంగా గొప్ప విషయం.
పంచుకున్నందుకు ధన్యవాదాలు.
కొత్త లిపి - hmm .. దీని గురించి ఏమీ వ్యాఖ్హ్యానించలేను కానీ... YVU అని ఒక విశ్వవిద్యాలయం ఉందా! ఈరోజే తెలిసింది....

త్రివిక్రమ్ Trivikram said...

ఒక భాషలో అవసరమైన అక్షరాలు మరో భాషలో అవసరం లేకపోవచ్చు. ఈయన రూపొందించిన లిపి నేను చూడలేదుగానీ నాకేమనిపిస్తోందంటే తెలుగు, హిందీలతో పోల్చుకుంటే ఆంగ్లాక్షరాలు రాయడం సులభం. ఐతే ఆ లిపికి చాలా పరిమితులున్నాయి. ఏ లిపీ లేని చోట తెలుగు వర్ణమాలను ఆధారంగా చేసుకుని ఆంగ్లాక్షరాలంత సరళంగా ఉండే లిపి కనిపెట్టడం అభిలషణీయమే. అలాగే ద్విత్వ, సంయుక్తాక్షరాలను రాయడానికి సరళమైన కొత్త విధానమేదైనా కనిపెట్టడం కూడా. తెలుగులో ఐనా, హిందీలో ఐనా క-ఖ లకు; గ-ఘ లకు; జ-ఝ లకు, ట-ఠ లకు (తెలుగులో మాత్రమే); త-థ లకు; రాతలో పోలికే లేదు. అవకాశమున్నచోట వీటికి బదులుగా ఒకదాన్నొకటి పోలి ఉండే కొత్త అక్షరాలు కనిపెడితే నేర్చుకునేవాళ్ళకు సులభంగా ఉంటుంది. తెలుగు, హిందీల్లో అచ్చులకు - గుణింతాలకు; కొన్ని హల్లులకు - వాటి ఒత్తులకు వేర్వేరు గుర్తులుండడం లిపులను సంక్లిష్టం చేసింది. తమిళంలో ఒత్తుల గొడవ లేకుండా ఒక చుక్క పెడితే పక్క అక్షరాన్ని కలుపుకుని చదువుతారనుకుంటా. (అన్నట్లు లిపిలేని సంతాలీ అనే గిరిజనభాషలోని శబ్దాలను రాయడానికి బెంగాలీ, ఒరియా, లాటిన్, వగైరా లిపులేవీ సరిపోకపోవడం వల్ల ఇరవయ్యో శతాబ్దంలో పండిత్ రఘునాథ్ మూర్ము కనిపెట్టిన కొత్త లిపి (ఓల్చికి)ని వాడుకుంటున్నారు.)

వైవీయూ గురించి: రవి అన్నట్లు అది రాజశేఖరుని పుణ్యమే. దీంతోబాటే మరి రెండు విశ్వవిద్యాలయాలను (నన్నయ, తెలంగాణా) కూడా ప్రతిపాదించారు గానీ అవేమయ్యాయో తెలియదు. ఇది మాత్రం ఆఘమేఘాల మీద మొదలైంది. కడప జిల్లాను దేశంలోనే (ప్రపంచంలోనే?) అత్యుత్తమ విద్యాకేంద్రంగా చెయ్యాలని ఆయన ఆశయమట. భేషో! ఐతే అత్యంత ప్రతిష్టాత్మకంగా, అట్టహాసంగా కడపలో సోనియాగాంధీ స్వహస్తాలతో ప్రారంభించిన RIMS వైద్యకళాశాల ఆదినుంచే పేరుగొప్ప, ఊరుదిబ్బ గా ఉందని వార్తలొస్తున్నాయి. పులివెందులలో JNTU constituent ఇంజినీరింగ్ కళాశాల (తెలంగాణా, ఉత్తరాంధ్రల్లో దీంతోబాటే ప్రతిపాదించిన కళాశాలల అతీగతీ తెలియదు), ఇడుపులపాయలో IIIT,... ఇవన్నీ రాజశేఖరుని పుణ్యమే!

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

లిపి ఉన్నట్లుండి ఆకాశం నుంచి ఊడిపడింది కాదు. ఎన్నో పరిణామ దశల్ని దాటుకుని మనం చూస్తున్న స్థితికి వచ్చింది. ఆ పరిణామమేదో మంచికే జరిగింది.

ఈ ప్రస్తావన గురించి నేను ఇదివరకే ఒకచోట రాశాను. మళ్ళీ రాస్తున్నాను.

మన ప్రస్తుత తెలుగులిపి చాలా బావుంది. నేర్చుకోవడం అత్యంత సులభం. తమిళం కంటే ఇంగ్లీషు కంటే సులభం. తమిళంలో తగినన్ని అక్షరాలు లేక ఒకదాని బదులు ఇంకొకటి చదువుతారు. గాంధి కి కాంతి అని శ్రీలంకా అనడానికి శ్రీ లంగా అని చదువుతారు. అది మనకెంతమాత్రమూ ఆదర్శం కాదు. ఈ అరాచకం వాళ్ళ నోళ్ళకు బావుంది. మనకు బావుండదు. మనం అన్ని అక్షరాలూ పలకగల జాతిగా పేరుమోశామంటే మన లిపి మనకిచ్చిన శిక్షణే కారణం.

నెత్తి మీద చుక్క పెట్టి సంయుక్తాక్షరాల్ని సూచించడం : తమిళంలో ద్విత్వాలే తప్ప సంయుక్తాక్షరాలు లేకపోవడం వల్ల వాళ్ళకే బాధా లేదు. కాని సంయుక్తాక్షరాలున్న తెలుగులాంటి భాషల్లో అలాంటి పద్ధతులు నరకప్రాయం. అలాంటి పద్ధతిలో నాలాంటివాడి పేరు రాయాలంటే ఒక పూర్తిపంక్తిని వినియోగించాలి. అంత పొడవుండే లిపుల్ని చదవడం చాలా కష్టం. అప్పుడు కూడా "మన లిపి బాగా లేదు, చాలా పొడవుగా ఉం"దని సణిగేవాళ్ళూ గొణిగేవాళ్ళూ ఉంటారు.

ఇంగ్లీషు విషయానికొస్తే, లిపి విషయంలో అంత చెత్త దరిద్రగొట్టు భాష మఱొకటి భూమండలం మీదనే లేదు. మనం జీవితాంతం స్పెల్లింగుల పేరిట లిపి నేర్చుకుంటూనే ఉండాలి. మన అజ్ఞానం ఆ విధంగా శాశ్వతం చెయ్యబడుతుంది. చెప్పగానే ఏదీ రాయలేడు ఇంగ్లీషువాడు.

తెలుగులిపికి ఏదీ సాటి రాదు. దాని అందం, చందం, అన్ని రకాల చిత్రకళాకృతులకూ చులాగ్గా ఒదిగిపోయే సౌలభ్యం, క్లుప్తత, అన్ని ధ్వనుల్నీ పలికించగల సమర్థతా దేనికీ లేవు. తెలుగులిపికి ఒక గట్టిగా ఒక సంవత్సరం మహా అయితే ఇంకో ఆరునెలల పాటు చదివి రాసే అభ్యాసం చాలు. తెలుగులిపి కష్టమనే ఈ ప్రచారం చెయ్యకండి. మీ కాలు మొక్కుతా. ఇది పూర్తి అవాస్తవం. పచ్చి అబద్ధం. వివాదాస్పదం కాని వాటిని వివాదాస్పదం చెయ్యడం. ఇది తెలుగుతల్లికి చెయ్యగల అతిగొప్ప ద్రోహం. pure defamation campaign.

spandana said...

నా మొదటి అభిప్రాయాన్ని సవరించుకుంటున్నాను.
తత్సమాన తెలుగు పదాలు లేనిచోట కల్పించుకుంటున్న మనం ఒక భాషకు లిపి లేకుంటే కల్పించుకోవడాన్ని ఆక్షేపించడం తగదు. కనుక కొత్త తెలుగు పదాలను సృష్టించుకోవడానికి మనకున్న కారణమే వాళ్ళకూ తమకంటూ ఓలిపిని సృష్టించుకోవడానికి వుంది.
గనుక నేను మొదట అనాలోచితంగా వెలిబుచ్చిన అభిప్రాయాన్ని వెనుకకు తీసుకుంటున్నాను.

--ప్రసాద్
http://blog.charasala.com

రవి వైజాసత్య said...

తాబాసు గారూ మీరన్నది అక్షరాల సత్యం
ఆంగ్ల లిపి దారిద్ర్యాన్ని పోగొట్టడానికి జార్జి బెర్నార్డ్ షా గారు తన యావదాస్తినంతా ఖర్చు చేసి పరిశోధన చేయించినట్టు ఎక్కడో చదివాను