- ఎం. కేశవరెడ్డి, కడప
డిసెంబరు31 లోపు తెలంగాణా ఇవ్వాలి! ఇవ్వకుంటే రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది అని తెలంగాణావాదులు, ఇస్తే మా తడాఖా చూపిస్తాం అని సమైక్యవాదుల పరస్పర ప్రేలాపనలు, ఏమౌతుందో ఏమో అన్న అపోహలు ప్రభుత్వానికి గుక్కతిప్పుకోనివ్వని వైనం. సాయుధ పోరాటానికి సిద్ధం కమ్మని నాయకుల రణఘోషలు, ఆపేందుకు ప్రభుత్వ దళాల మోహరింపు. (తేదీ జనవరి 6కు మారింది. కానీ పరిస్థితుల్లో మార్పు లేదు.) ఏమిటిది? ఒక సమస్యకు పరిష్కారం హింసా? ఇది గాంధీ పుట్టిన దేశమేనా? శాంతిని ప్రపంచానికి అందించిన నేల ఇదేనా? ఆధ్యాత్మిక సంపన్నులుగా ప్రపంచ గుర్తింపు పొందిన భారతీయులు, విభిన్న జాతి, కుల, మతాలకతీతులుగా సామరస్యంగా జీవించే భారతీయులు తన్నుకు చావడం ఏమిటి? మనమంతా పాఠశాలలో చదువుకొనేటప్పుడు ప్రతిజ్ఞ చేస్తుంటాం. భారతీయులందరూ నా సహోదరులు అని చెయ్యిచాపి ప్రతిజ్ఞచేసి ఎదిగినవాళ్ళం. నేడు కులం, మతం, ప్రాంతం విభేదాలతో విరోధులుగా తన్నుకుచావడం ఏమిటి? ఇది ఏ కులం, ఏ మతం చెబుతుంది?
సమస్య సమస్యకో ఉద్యమం. మా కులానికే ముఖ్యమంత్రి కావాలి. కాదు మా ప్రాంతానికే ఇవ్వాలి. అంటూ అజ్ఞానంతో చేసే ఉద్యమాలు అభివృద్ధికి అడ్డుగా మారడం భారతీయతకే మచ్చ. కాటన్, మన్రో, బ్రౌన్ లాంటి వారిదే మతం? ఏ కులం? ఏ జాతి? మేలు చేయాలనే తలంపు ఉండాలేగానీ మా కులం వాడో, మా మతం వాడో వీరుడు, శూరుడు కాడనే సత్యం గమనించాలి. సేవచేయగల్గిన సమర్థులు మనకు పాలకులుగా రావాలి. అలాంటివారిని మనం ఆహ్వానించాలి. సాయుధులను కమ్మంటున్నారు. పోరాటాలకు ఉరకండి అంటున్నారు. తన్నులు తిని చచ్చేదెవరు? మిమ్మల్ని ప్రేరేపించి ఎయిర్ కండిషన్డ్ గదుల్లో నాయకులు విశ్రాంతి తీసుకొంటుంటే మీ ప్రాణాలు పణంగా పెట్టి మనలో మనం తన్నుకుచావడం బాధ్యత గల పౌరుని లక్షణమేనా? ఆలోచించండి.
తెలంగాణా ఇస్తే ఏమౌతుంది? ఎవరో ఒకరు ముఖ్యమంత్రి. ఆ పదవి నాక్కావాలంటే నాక్కావాలంటూ పెనుగులాటలు, పోరాటాలు, పదవులు దక్కినవారికి సంతోషం, దక్కని వారికి ఆక్రోషం, మా కులంవారికి అన్యాయం, మా జిల్లాకు మొండిచేయి, సీనియర్ కు అన్యాయం, జూనియర్ కు అందలం, ఇదీ వరుస. పదవుల కోసం పైరవీలు, లాబీయింగ్ వీరులకే అధికారం. యధా మామూలే. రొటీన్ అసంతృప్తే. ఉద్యోగాలొస్తాయి, ఆ లాభమొస్తుంది, ఈ లాభమొస్తుంది, అని ఊదరగొట్టి ప్రజలను భ్రమల్లో తేల్చిన ఆ నాయకుల కుర్చీ కుస్తీలో మళ్ళీ మీరు సమిధలే. అప్పుడు మళ్ళీ సామాన్యులకు నిరాశే. బాగా ఆలోచించండి. నాయకుల పదవుల కోసం కుల, మత, ప్రాంతాల సంకుచితత్వంతో జరిగే పోరాటాల్లో మీకేంటి పని? ఉపాధి ఆశా? బాగా చదవండి ఉద్యోగాలొస్తాయి. సత్తా లేకుండా అవకాశాల కోసం ఎదురుచూడడం మూర్ఖుల పని. ఆలోచించండి. అలాంటివి మనకొద్దు. సమర్థులుగా ఎదగాలి. ఉద్యమంలో పాల్గొంటే మీకు చరిత్రలో కొన్ని పేజీలొస్తాయా? మీరు లేని పేజీలు దేనికి? ఈ స్వార్థపు పోరాటాలు వద్దు. పరిపాలనా సౌలభ్యం కోసం విభాగాలుగా చేయాల్సి వస్తే అది కేంద్రం చేస్తుంది. అవి విభజన రేఖలు కావు. పాలనా సౌలభ్యం కోసం మాత్రమే. మీ పోరాటాలు మానవ జాతి సమస్తానికి మేలు చేకూర్చేవై ఉండాలి. అవినీతి వల్ల, కాలుష్యం వల్ల మన సమాజం, భవిష్యత్తు నేడు తీవ్ర విపత్తునెదుర్కొంటున్నాయి. వాటి గురించి ఆలోచించండి. ఉద్యమించండి. కుల, మత, ప్రాంతాలకతీతంగా మానవ జాతి కళ్యాణానికి ప్రయత్నం చేయండి.ప్రగతితో బాటు చరిత్రలో నిలిచిపోతారు. ఎవరి కోసమో ఆత్మహత్యలు, లాఠీదెబ్బలు మీకెందుకు? మీ చదువు, విజ్ఞానం నవ సమాజానికి ఉపయోగపడాలి. ఎవరి కిందో, ఏ పదవి ఆశకో చేసేది ఉద్యమం కాదు. దాని వల్ల మార్పు రాదు. నిస్వార్థంగా ఆలోచించాలి. అలాంటి నాయకులు మన మధ్య ఉన్నారా? గమనించాలి. ప్రజలందరినీ సహజీవనులుగా గౌరవించడం నేర్చుకోవాలి. అలాంటప్పుడు సమస్త ప్రపంచం మీకు సలాం కొడుతుంది. మీ నిజాయితీ ప్రశ్నించలేనిదై దేదీప్యమానమౌతుంది. చదువుల కోసం వచ్చిన మీరు ఉద్యమాలకు బలయిపోతే కాయకష్టంతో చదువులకై పంపిన మీ తల్లిదండ్రులకు గుండెకోతను మిగిల్చినవారవుతారా?
ఓటుకు నోటో, సారా పాకెట్టో, క్రికెట్ కిట్టో మీరడిగితే అది సమకూర్చేందుకు మీ నాయకులకు డబ్బు కావాలి. అది కావాలంటే అవినీతి చేయాలి. ఆ అవినీతిలో బలయిపోయేదెవరో ఆలోచించారా? వచ్చే రూపాయి గురించి ఆలోచిస్తున్నారే తప్ప పోయే కోట్ల గురించి, భవిష్యత్ వినాశనం గురించి ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? అవినీతిలో భారతదేశం కూరుకుపోయిందనే సంగతి ప్రపంచ సంస్థలు కోడై కూస్తున్నాయి. ప్రజాసేవకుల ముసుగులో వేలకోట్లు సంపాదిస్తున్న వారిని మీరు సమర్థించడం ఏమిటి? తాత్కాలిక ప్రయోజనాలకు మనం తృప్తిపడితే భవిష్యత్తులో మరింత నష్టపోవాల్సి వస్తుంది. డబ్బు కక్కుర్తికో, శృంగార సంతృప్తికో, మద్యవిలాసాలకో దేశ పరువును తాకట్టు పెట్టిన ప్రబుద్ధులను మన చట్టం, న్యాయం శిక్షించలేని పరిస్థితులలో ఉన్నాయి. వారి అవినీతిని ప్రశ్నించలేని దౌర్బల్యంలో మనముంటే మనకు బాధలు కాక మరేముంటాయి?
ఒక పసిపాప బోరుబావిలో పడ్డప్పుడు, ఒక పాప బాయిలర్ లో కాల్చబడినప్పుడు యావత్ మానవ హృదయం ద్రవించింది. అదే మానవీయత. కుల, మత, ప్రాంతాలకతీతంగా మన కళ్ళలో కన్నీరు రాలాయే అదే మనలోని దైవత్వం. దానిని వెలికితీయాలి. అందుకు మనం సమర్థులను వెదకాలి. అందుకు ముందు మనం మారాలి. మన ఆలోచనలు మారాలి. మనం పీల్చే గాలి స్వచ్ఛంగా ఉండాలంటే బాహ్యంలో గాలి స్వచ్ఛంగా ఉండాలి. మన సమాజం బాగున్నప్పుడే మనం బాగుంటాం. సమాజాన్ని సంస్కరించాలంటే ముందు విద్యా వ్యవస్థను సంస్కరించాలి. సాంకేతిక ప్రగతిపై ఉన్న శ్రద్ధ విలువల పెంపుకు లేదు. మద్యంపై ఉన్న ఆసక్తి విద్యపైన లేదు. ఆధ్యాత్మిక జ్ఞానంతో సేదదీరాల్సిన జనం మత్తులో జోగడం వ్యవస్థ పతనానికి పరాకాష్ట కాదా? ఇంకా మార్పు కోసం చేయాల్సిన ప్రయత్నానికి వేళ కాలేదా? సమయం రాలేదా? ఆలోచించండి.
మన బిడ్డకు దెబ్బ తగిలితే ఎంత బాధపడతామో ఇతరులకు తగిలినా అలాగే స్పందించాలి. శరీరాలు, ఆస్థులు, మేడలు పెరిగినా బుద్ధులు పెరగడం లేదు. తప్పు చేసినవాడు మనవాడైతే ఒకలాగ, వేరొకరైతే ఒకలాగ స్పందించడం మానవునిలోని ద్వంద్వ ప్రవృత్తికి నిదర్శనం. ఇది వ్యవస్థ పతనానికో కారణం. ఒక తండ్రి కోట్లు కూడబెట్టి సంతానానికిచ్చి తృప్తి పడుతున్నాడు. మరి ఆ కోట్లు అతనికి బ్రతుకు భరోసా ఇస్తున్నాయా? అతని పతనానికో, కుట్రలతో అతని మరణానికో కారణం అవుతున్నాయి. అందుకే మంచి సమాజం కావాలి. ఒక డ్యాం నిర్మాణానికి ఎంతో మంది శ్రమ కావాలి. కూల్చాలంటే ఒకే ఒక బాంబు చాలు. వినాశనం మనకొద్దు. నిర్మాణాత్మకంగానే మనమూ మన ఆలోచనలూ ఉండాలి. మన సమాజంలోని రుగ్మతలకు టీకా వేయాలి. అదీ యువత చేతుల్లోనే ఉంది.
టీవీ ఛానల్స్, పత్రికలు సమాజంలో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. స్వప్రయోజనాల లబ్దికై కృషి చేస్తున్నాయి. సమస్య సృష్టించడం, వ్యాపింపజేయడం, తద్వారా వ్యాపారలబ్ది పొందడం వాటి నైజమైంది. వ్యాపార లబ్ది వాటికి వంటబట్టి సమాజహితాన్ని గాలికొదిలాయి.
అపార మేధావులు సమాజ మార్పుకై సాయుధులై నక్సలైట్లుగా చాటుగా, మాటుగా చలికీ, వేడికీ పగలనక, రేయనక కొండల్లో, లోయల్లో సంచారం, ప్రభుత్వంపై పోరాటం. సమాజ వ్యతిరేకులంటూ ప్రభుత్వ పోలీసులు కూంబింగ్ లు, ఆపరేషన్లు. ఎందుకు? నక్సలైట్లు మనవాళ్ళే, పోలీసులు మనవాళ్ళే. ఒకరిని ఒకరు చంపుకుంటూ ఎంతో కాలంగా హింసను సృష్టిస్తూనే ఉన్నారు. మార్పు వచ్చిందా? రాదు. ఎందుకంటే వారి విజ్ఞానం హింసపై పెరుగుతున్నదే తప్ప సమాజ మరమ్మత్తు ప్రజా చైతన్యంలో ఉన్నదన్న సత్యాన్ని వారు గ్రహించలేకున్నారు. సహజ ఎరువులు వాడితే ప్రయోజనం. శరీరంలో రోగనిరోధక శక్తి పెంచుకుంటే ఆరోగ్యం అని మనకు తెలుసు. మరి వ్యవస్థలో అవినీతి వ్యతిరేక నిరోధక శక్తి పెంచేదానికి ప్రజాచైతన్యమే మందు అనే సత్యం వారిరువురూ ఎరగాలి. అహింసాయుతంగా ఆ మార్పు జరగాలి.
రిజర్వేషన్లు, కులమతాలు సమాజంలో వర్గ వైరుద్ధ్యానికి కారణాలవుతూ అభివృద్ధికి ఆటంకాలవుతున్నాయి. ఆర్థికంగా అభివృద్ధి చెందినా వాటిని ఉపయోగించుకుంటూ సంపన్నులో, అధికార బలం కలిగినవారో లబ్ది పొందుతున్నారు తప్ప సామాన్యుడికి ఉపయోగపడడం లేదు. అందరి రక్తం ఒక్కటే, అందరం మనుషులమే. మనమధ్య ఎందుకీ అంతరాలు? వాటిని రద్దుచేసి పేదలను గుర్తించి వారి స్థితిగతులను మెరుగుపరచి, జీవన ప్రమాణాలను అభివృద్ధిచేసే వ్యవస్థలను మనం పెంచుకోవాలి. అందుకు టెక్నాలజీని సక్రమంగా ఉపయోగించుకోవాలి.
భారీ ప్రాజెక్టులతో తలనొప్పులు, పర్యావరణ ఇబ్బందులు తెచ్చుకోక మైనర్ ఇర్రిగేషన్ కు ప్రాధాన్యత ఇవ్వాలి. వృధాను అరికట్టాలి. వేసిన రోడ్డు వేసుకొంటూ కట్టిన ఇల్లే కట్టుకుంటూ పోతే అభివృద్ధి జరగదు. నాయకులూ మీరూ ఆలోచించండి. పదవుల కోసం, పైరవీల కోసం డబ్బు కావాలి. అందుకు మీరు అవినీతి చేయాలి. అందుకు ప్రభుత్వ నిధులు వృథా అవుతున్నాయి. వాటిని సక్రమంగా నిర్వహిస్తే పదవులు అవే వస్తాయి. వాటి కోసం కాళ్ళు మొక్కడం, లంచమివ్వడం, లాబీయింగ్ చేయడం చేసి మీ వ్యక్తిత్వానికి మచ్చ తెచ్చుకోవద్దు. మీ ప్రజలకు తలవొంపులు తేవద్దు.
ఈనాటి సమాజాన్ని చూడండి. ఆత్మహత్యలు, మారణకాండలు, మానభంగాలు, అవినీతి, లంచగొండితనం ఇలాంటివెన్నో పీడించే సమస్యలు. వీటిని ఎదుర్కోలేక ప్రభుత్వాలు, చట్టాలు నిర్వేదంలో ఉన్నాయి. టెర్రరిజం, ఉగ్రవాదం, కాలుష్యం విపత్తులు మన వినాశనానికై ఎదురుచూస్తున్నాయి. మనం జాగ్రత్తగా లేకపోతే మానవ జాతికి ముప్పు తప్పదు.
కోటాను కోట్లు జనాభా పెరిగినా వారి మధ్య ప్రేమ లేదు, విశ్వాసం లేదు. నమ్మకం లేదు. నిత్యం ఒత్తిడిలో కోరికల సుడిలో రోగాలు ఆవహించి బ్రతుకును ఛిద్రం చేసుకుంటున్నారు. తల్లికి బిడ్డ, బిడ్డకు తల్లి లేని సంబంధాలు మన మధ్య పెరిగాయి. ప్రపంచంలో కోట్ల మంది జనాలున్నా నాకెవ్వరూ లేరనే ఒంటరితనం జనాల్లో ఉంది.
బిడ్డల భవిష్యత్తు ఆలోచించే తల్లిదండ్రులు మేము పోతే మా బిడ్డలు ఏమౌతారో. వారినెవరు చూస్తారో అన్న విశ్వాసం లేక తమకు ఆపద వచ్చినప్పుడు తమతో పాటు తమ బిడ్డలను పరలోకానికి తీసుకుపోవడం మనం వింటున్నాం. ఎంత దైన్యం? పొరుగువాడిని ప్రేమించలేకున్నాం. అనుమానాలు, భ్రమలు, అభద్రత మనలో ఉన్నాయి. అవి తొలగాలంటే మనం మారి, సమాజాన్ని మార్చాలి. అందుకు ప్రజలందరూ చైతన్యులవ్వాలి. మాకు ఉద్యోగాలు ఇప్పించండీ అని ఏ యువకుడూ ఏ నాయకుణ్ణీ అడుక్కొనే పరిస్థితి రాకూడదు. ఉద్యోగాలు సృష్టించుకొనే స్థితికి యువత ఎదగాలి. వారి ఆలోచనలు మారాలి. అప్పుడు ప్రభుత్వాలు, వ్యవస్థలు వాటంతట అవే మారుతాయి. అందుకు ప్రజాచైతన్యం అహింసాయుత విప్లవం రావాలి. అదే విశ్వాసంతో వదలని పట్టుదలతో యువత ఉద్యమిస్తే ప్రతి మనిషి సంతోషాన్ని ఆస్వాదిస్తారు. జీవితాన్ని ఆనందంగా అనుభవిస్తారు.
లేదంటే రాబోయే రోజుల్లో మానవ వికృత చేష్టల వల్ల పర్యావరణం, అవినీతి వ్యవస్థలు మన బిడ్డలను, వారి బిడ్డలను కబళించక మానవు. మనం పేర్చిన ఈ కోట్లూ, నోట్లూ ఆ ఉపద్రవాల నుంచి భవిష్యత్తు తరాలను కాపాడలేవు. ఆలోచించండి సంకుచిత పోరాటాల్లో సమిధలు కాకండి. శాంతికి కృషి చేయండి. వ్యవస్థ మార్పుకు ఉద్యమించండి. అణువులు విడిపోతే వెలువడే ఆటంబాంబు శక్తి కన్నా అణువుల సంలీనం వల్ల వెలువడే హైడ్రోజన్ బాంబు శక్తి అమోఘమనే సత్యం మీకు తెలుసు. ఉమ్మడి చైతన్యంతో ముందుకు ఉరకండి. వ్యవస్థ మార్పు మీ చేతుల్లోనే ఉంది. అహింసాయుత వైజ్ఞానిక విప్లవజ్యోతులై ప్రకాశించి ఈ జనవరి 6ను రక్త చరిత్ర కాకుండా కాపాడండి. యువకులారా ఆలోచించండి. మార్పుకు శ్రీకారం చుట్టండి.