Showing posts with label సినిమా. Show all posts
Showing posts with label సినిమా. Show all posts

Sunday, 28 January 2007

సినిమా పండుగ రెండోరోజు విశేషాలు


మార్కస్ బార్ట్లే వాడిన మిచెల్ కెమెరా


పాతపాత్రల్లో కొత్తనటులు

దుర్యోధనుడిగా బాలకృష్ణ
ఆహార్యం: అదిరింది.
ఆంగికం: ఫర్వాలేదు.
వాచికం: అధ్వాన్నం.

శకుని పాత్రకు ఏవీఎస్ అతికినట్లు సరిపోయాడు.

ఉత్తరకుమారుడిగా బ్రహ్మానందం: బ్రహ్మానందం పర్ఫార్మెన్స్ ఇంత పేలవంగా ఉండగలదని ఊహించనేలేదు. రేలంగిలో శతాంశమైనా లేదు.
***

స్టేజి క్రింద అలనాటి సదాజపుడు పద్మనాభం ఈ వయసులో కూడా ఎక్కడా తడుముకోకుండా, తడబడకుండా "ప్రేమకోసమై..." పాటను పూర్తిగా ఆలపించి ప్రేక్షకులను ముగ్ధులను చేశారు.

ప్రదర్శనలో ఎన్టీయార్ వాడిన గదలు, కిరీటాలు వగైరాలతోబాటు మార్కస్ బార్ట్లే వాడిన కెమెరాను కూడా ప్రదర్శించడం విశేషం.


ఇక వినోద కార్యక్రమాల్లో వార్తలకు సునీల్ చేసిన అభినయం హైలైట్. అది చూసి నవ్వలేక చచ్చాం.

Friday, 29 December 2006

మహారచయితకు నివాళి

ఆ కలం సృష్టించిన మాటలు, పాటలు కోట్లాది మంది సినీ ప్రేక్షకుల మీద మత్తు మందు చల్లి తమ వశం చేసుకున్నాయి. పుట్టబోయేవారిని కూడా చేసుకుంటాయి.
ఏదైనా మ్యాజిక్కో, మంత్రమో చేసినట్లు అభినయించాలంటే చిన్న పిల్లలు సైతం అసంకల్పితంగా అనే మాట "హాం ఫట్". ఆ మాటను మనకు పరిచయం చేసింది పాతాళభైరవిలో మాంతికుడు (ఎస్వీరంగారావు). మరి పుట్టించిన అపరబ్రహ్మ ఎవరు?
"డింగరీ", "గురూ", "ఘాటుప్రేమ", "ధైర్యే సాహసే లక్ష్మీ", "నరుడా ఏమి నీ కోరిక?"
అసమదీయులు - తసమదీయులు
వీరతాళ్ళు (ఈనాటి పతకాల లాంటివి)

"ఇవేం మాటలు? ఇంతకు ముందెక్కడా లేవే?" అన్నవారిని "ఎవరూ పుట్టించకుండా మాటలెలా పుడతాయి?" అని ఎదురు ప్రశ్నించిన మాటల మరాఠీ ఎవరు?
"జనం కోరేది మనం సేయడమా? మనం సేసేది జనం సూడడమా?" ఈ మాటలు పలికింది నేపాళమాంత్రికుడు. ఈ సందిగ్ధం మాత్రం సినిమాలు తీసేవారందరిదీ.
"సాహసం శాయరా డింభకా! రాకుమారి లభించును రా!"
"మహాజనానికి మరదలు పిల్లా! గలగలలాడవే గజ్జెలకోడీ"
"రసపట్టులో తర్కం కూడదు"
"మాకు తల్పం వద్దు గిల్పం కావాలి....కంబళి వద్దు గింబళి కావాలి"
"శాకాంభరీదేవి వరప్రసాదం - ఆంధ్రుల అభిమాన శాకం.....గోంగూర!"

ఈ జాబితాలో వందలు వందల మాటలున్నాయి. చెప్పుకుంటే తనివితీరదు. ఆ మాటలు నెమరేసుకున్నా చాలు. ఐనా ఆ మహనీయుడిని గురించి "మాటల్లో" చెప్పడానికి మనమెంతవారం? 75 యేళ్ళ తెలుగుసినీచరిత్రలో ఎవరెస్టు శిఖరం లాంటి మాటల-పాటల రచయిత పింగళి నాగేంద్రరావు గారి నూట ఆరవ జయంతి ఈరోజు (29 డిసెంబరు).

Sunday, 8 October 2006

తెలుగు పౌరాణికాలు

భారతదేశంలో చిత్రపరిశ్రమ పౌరాణికాలతో మొదలై సాంఘిక, చారిత్రక, జానపద, అభ్యుదయ, వినోదప్రధాన చిత్రాలతో బహుముఖాలుగా విస్తరిల్లింది. భాషల పరంగా చూస్తే కలకత్తాలో బెంగాలీ చిత్రాలు , ముంబై (బొంబాయి)లో హిందీ చిత్రాలు , చెన్నై (మద్రాసు)లో తెలుగు/తమిళ చిత్రాలు ...ఇలా ఒక్కోచోట ఒక్కోభాషాచిత్రాలు అభివృద్ధి చెందాయి.

సత్యజిత్ రే, తదితర దిగ్గజాలు తీసిన బెంగాలీ సాంఘిక చిత్రాలు ప్రపంచప్రఖ్యాతి పొందినవి.

ఇక చారిత్రకాలు అన్ని భాషల్లోనూ మంచివి వచ్చాయి.

కానీ...తెలుగు పౌరాణికాలతో సాటిరాగల చిత్రాలు మరే భాషలోనూ లేవు, లేవు, లేవు.

Monday, 28 August 2006

అపహాస్యం పాలౌతున్న సెన్సార్ సర్టిఫికెట్లు

ఈ మధ్య మన సెన్సారు బోర్డు వారు ఎడాపెడా A సర్టిఫికేట్లు, U/A సర్టిఫికేట్లు ఇచ్చి పారేస్తున్నారు. మన ఎగ్జిబిటర్లు, దర్శకనిర్మాతలు, టీవీ ఛానెళ్ళవారు ఆచరణలో ఆ సర్టిఫికెట్లను అంతే ఉత్సాహంగా "పారేస్తున్నారని" నాకు ఈ మధ్యే తెలిసివచ్చింది. అసలు విషయం చెప్పబోయే ముందు ఈ సెన్సార్ సర్టిఫికేట్ల గురించి కొన్ని వివరాలు:

ఎవరైనా నిరభ్యంతరంగా చూడదగ్గ సినిమాలకు U సర్టిఫికెటు,
మితిమీరిన శృంగారం, అశ్లీలత, అసభ్యత, బూతులు, లేదా హింసాత్మక సన్నివేశాలు ఉండడం వల్ల పిల్లలు చూడకూడని సినిమాలకు A సర్టిఫికెటు,
పెద్దవారి తోడు లేకుండా చూస్తున్నప్పుడు పిల్లలు భయపడే అవకాశముందనిపించిన హార్రర్ సినిమాలకు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళతో కలిసి మాత్రమే చూడదగ్గ సినిమాలకు U/A సర్టిఫికెటు ఇస్తారు.

హాస్యం పేరుతో పచ్చిబూతుమాటల్ని విరివిగా వాడిన ఒక సినిమా U/A సర్టిఫికెటుతో విడుదలైంది కొన్ని నెలల కిందట. అంటే చిన్న పిల్లలు ఆ బూతు మాటల్ని పెద్దల పర్యవేక్షణలో మాత్రమే నేర్చుకోవాలని అ సర్టిఫికెటు ఇచ్చినవారి ఘనమైన అభిప్రాయమనుకోవాలా? సెన్సారైన సినిమాలకు కూడా ప్రచారం చేసుకోవడానికి వాడుకునే స్టిల్స్, క్లిప్పింగులకు ఫిల్మ్ ఛాంబర్ నుంచి అనుమతి పొందాలి. కానీ సదరు సినిమావారిచ్చిన టీవీ ప్రకటనల్లో కూడా బూతు మాటలే ఉన్నాయి. :(

దీని తలదన్నే సంఘటనొకటి రెండు మూడు వారాల కిందట జరిగింది. (దీని గురించి అప్పుడే బ్లాగకపోవడానికి కారణం "విక్రమార్కుడు" సినిమాకు U/A సర్టిఫికెటు వచ్చిందని ఇన్నిరోజులూ నేను అపోహ పడ్డమే.)
వాస్తవమేమిటంటే "విక్రమార్కుడు" సినిమాకు వచ్చింది A సర్టిఫికెటు. అంటే అది పిల్లలెవరూ చూడగూడని సినిమా. A సర్టిఫికెటు ఎందుకొచ్చిందో నాకు తెలియదు. నేనా సినిమా చూడలేదు. ఐతే రెండు మూడు వారాల కిందట ఆ సినిమా "చూసి వచ్చిన" చిన్నపిల్లలతో ఆ సినిమా హీరో రవితేజ, దర్శకుడు ? చాలా సేపు ఆ సినిమా గురించే మాట్లాడారు. ఒక ఆదివారం మధ్యాహ్నం ఆ సన్నివేశం మొత్తం ఒక టీవీ ఛానెల్ వారు (మా టీవీ?) చక్కగా ప్రసారం చేశారు. చాలా మంది చూసే ఉంటారు. కానీ ఎవరూ అభ్యంతరపెట్టినట్లు దాఖలాల్లేవు.

ఇంతకూ సెన్సార్ బోర్డ్ వారి బాధ్యత తమకు తోచిన సర్టిఫికెట్ ఇవ్వడంతో తీరిపోతుందా? U/A, A సర్టిఫైడ్ సినిమాలు ప్రదర్శించే థియేటర్ల వాళ్ళు టికెట్లిచ్చేతప్పుడు, హాల్లోనూ చిన్న పిల్లలను గమనించి తగిన చర్య తీసుకోవలసిన బాధ్యత ఆ థియేటర్ల యాజమాన్యానికి లేదా? ఇంత బాధ్యతారహితంగా, ఇంత బహిరంగంగా చట్టాన్ని ఉల్లంఘించి తాము చూడగూడని ఆ సినిమాను చూసిన పిల్లలతో కలిసి ఇద్దరు బాధ్యత గల పెద్దమనుషులు నిర్లజ్జగా పాల్గొన్న ఆ కార్యక్రమాన్ని టీవీ ఛానెళ్ళ వాళ్ళు ఇంత బాహాటంగా ప్రదర్శించినా పట్టించుకున్నవాళ్ళే లేరు!
ఇంతకూ సెన్సార్ బోర్డ్ ఎందుకున్నట్లు? ఆ సర్టిఫికెట్లు ఎందుకిస్తున్నట్లు?

Monday, 17 July 2006

ఆమె ఎవరు?

ఆమె ఒక శాస్త్రవేత్త.
ఆమె వెండితెర వేలుపు.
ఆమె ఒక సాహసి.
ఆమె ఒక సౌందర్యరాశి.


శాస్త్రవేత్తగా ఆమె ఘనత: frequency hopping: మొదట ఆమె మరొక శాస్త్రవేత్తతో కలిసి రహస్య కమ్యూనికేషన్ వ్యవస్థ (Secret Communication System)ను కనిపెట్టారు. తర్వాత అదే వ్యవస్థను మరొక అడుగు ముందుకు తీసుకెళ్ళి వాళ్ళు కనిపెట్టిన ఫ్రీక్వెన్సీ-హాపింగ్ ప్రస్తుతం మనం విరివిగా వాడుతున్న ఉపకరణాలు -వైర్లతో పనిలేని ఫోన్లు, విఫి ఇంటర్నెట్ కనెక్షన్ లాంటివాటికి ఆధారభూతమైంది. (frequency hopping రేడియో సంకేతాలు జామ్ అయ్యే అవకాశాన్ని కనిష్ట స్థాయికి తగ్గిస్తుంది.)
వెండితెర మీద: ఆమె 33 ఐరోపా మరియు హాలీవుడ్ సినిమాలలో నటించి ప్రేక్షకుల మతులు పోగొట్టింది.
ఆమె సాహసం: హాలీవుడ్ చరిత్రలో పూర్తి నగ్నంగా వెండితెర మీద కనిపించిన మొట్టమొదటి నటి ఆమే! చిత్రం: ఎక్స్టసీ (1933)
ఆమె అందం: The Heavenly Body (1944)చిత్రంలో




ఆమె పేరు: హెడీ లమర్

Saturday, 6 May 2006

రాయలసీమ ఫాక్షనిజం-1

తిమ్మిని బమ్మిని చేయడంలో మీడియాను మించిన వాళ్ళెవరూ లేరు. అందునా తెలుగులో సినిమా అనేది అన్నిటికంటే బలమైన మీడియాగా అవతరించింది. గత పది, పదహైదేళ్ళుగా రాయలసీమ ఫాక్షనిజాన్ని సినిమాల్లో వికృతంగా చూపుతున్న తీరు చూసి రాయలసీమ వాసులకు ఆవేదన కలుగుతోంది. రాయల సీమలో జీవితమెలా ఉంటుందో తెలియని, రాయలసీమ ఫాక్షనిజం స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయో తెలియని కొందరు సినిమా రచయితలు పైత్యం ప్రకోపించి, రాయలసీమలో ఉండేది కూడా మనుషులేననే సంగతి విస్మరించి మానవత్వానికే మచ్చ తెచ్చే సన్నివేశాలను సృష్టించి దానిని రాయలసీమ ఫాక్షనిజానికి ఆపాదించడం హేయం, ఘోరం. ఈ సందర్భంలో రాయలసీమ నడిబొడ్డైన కడప గడ్డ మీద రెండు ఫాక్షన్ వర్గాల మధ్య జరిగిన ఒక యథార్థ సంఘటనను మీ ముందుంచుతున్నాను:

కొంత కాలం క్రిందట ఒకాయనకు ఒక ప్రమాదంలో తీవ్ర గాయాలై ఆసుపత్రిలో ప్రాణాపాయంలో ఉన్నాడు. ఆయనకు వెంటనే అత్యవసరంగా రక్తం ఎక్కించాల్సి వచ్చింది. ఆయన కుటుంబసభ్యుల్లో గానీ, ఆయన వెంట ఉన్నవాళ్ళలో గానీ ఎవరి రక్తమూ ఆయనకు సరిపోయే గ్రూపు కాదు. బ్లడ్ బాంకు లో కూడా ఆ గ్రూపు రక్తం లేదు. వాళ్ళు అందుబాటులో ఉన్న వాళ్ళందరినీ ఫలానా గ్రూపు రక్తం అత్యవసరంగా కావాలని, రక్తదాతలెవరైనా ఉంటే తెలుపమని కోరారు.

ఇంతలో ఆ ఆసుపత్రికే వచ్చిన ఇంకొకాయన ఈ విషయం తెలుసుకుని, తన గ్రూపు సరిపోతుందని తెలిపి, రక్తదానం చేయడానికి ముందుకు వచ్చాడు. ఎవరో ఒకాయన రక్తదానం చేయడానికి ముందుకు వచ్చాడని తెలిసి మొదటాయన బంధువులు సంతోషించారు. రక్తం అవసరమైనదెవరికో రక్తం ఇస్తున్నాయనకు తెలియదు, రక్తం ఇస్తున్నదెవరో అవతలి వాళ్లకుతెలియదు. గండం గట్టెక్కాక, రక్తదానం చేసి ప్రాణం కాపాడినాయనకు కృతజ్ఞతలు తెలుపడానికి వెళ్ళిన వాళ్ళు అవాక్కయారు!

రక్తదాత, గ్రహీత ఫాక్షన్ గొడవల్లో ప్రధాన ప్రత్యర్థులు!
ఇక్కడ ఇంద్ర సినిమా లో ఒక సన్నివేశాన్ని గుర్తుకు తెచ్చుకోండి:

ఆ సినిమాలో విలన్ కొడుకు ప్రాణాలను హీరో కాపాడితే, ఆ విలన్ తన కొడుకును తనే చంపేస్తాడు తన శతృవు దయ వల్ల దక్కినదేదీ తన కక్కరలేదని. కానీ నిజజీవితంలో ఏం జరిగింది? వీళ్ళు తమ పగను పక్కనపెట్టి కృతజ్ఞతలు చెప్పుకోవడమూ, ఆయన కూడా పాత విషయాలు పక్కనపెట్టి స్నేహంగా మాట్లాడడమూ, తర్వాత రెండు వర్గాల వారూ పగను పాతిపెట్టి కలిసిపోవడమూ జరిగాయి.

(ఇటీవల కడప జిల్లాలో ఫాక్షనిస్టుల లెక్కల గురించి ఏర్పడిన గందరగోళం, తర్వాత ఈనాడు లో వచ్చిన శ్రీధర్ కార్టూను చూసి ఇదంతా గుర్తొచ్చి వ్రాయాలనిపించింది. ఆధారం: 'కడపోత్సవాలు' సావనీర్లు)