Thursday, 5 July 2007

చందమామ రావే...జాబిల్లి రావే...

నేను నెల కిందట రాసిన ఆ వచ్చే నెల వచ్చేసింది. కానీ అందుకు సంబంధించిన తదుపరి విశేషాల గురించి తెలియకపోవడంతో రానారె "ఏదీ!!? చందమామరావే అని పాడితే వస్తుందా? :)" అని చమత్కరించాడు. వివరాలు తెలుసుకుందామని అందరిదీ ఒకటే ఆతృతన్నమాట! అసలిది ఎవరూ అడక్కముందే రాయవలసింది. కానీ రానారె అడిగినాక రెండురోజులు గడిచేదాకా రాయడానికి వీలు కుదరలేదు. అనివార్య కారణాల వల్ల ఈ విషయం గురించి బ్లాగడం నాలుగురోజులు ఆలస్యమైనందుకు చింతిస్తున్నాను. :)

ఆ టపా శీర్షికలో వచ్చే నెలలో డిజిటల్ చందమామ తర్వాత వేసిన ప్రశ్న గుర్తు, లోపల ఉన్న "వివరాలు జూలై 2007 సంచికలో ప్రచురిస్తామని ప్రచురణకర్తలు పేర్కొన్నారు." అనే వాక్యం కాస్త పెద్దక్షరాల్లో చదువుకోవాలి. ఇక ఈ నెల ప్రచురించిన వివరాలు:
"చందమామ 61వ సంవత్సరంలోకి అడుగుపెడుతూన్న శుభసందర్భంలో పాఠకులను అలరించనున్న వినూత్న పథకాలు" గా ప్రకటించినవి:
సిడిలు - డివిడిలు:
  • పాత సంచికల నుంచి ఉత్తమమైన కథలు, వింతలు విశేషాలు.

కథల సంకలనాలు:

  • జానపద కథలు
  • బేతాళ కథలు
  • సీరియల్ కథలు
  • కామిక్స్ రూపంలో సుప్రసిద్ధ కథలు.

కాబట్టి వీటన్నిటినీ విడివిడిగా గానీ, కలిపి గానీ కొనుక్కోవచ్చన్నమాట. :) కాకపోతే ఇవి ఎప్పటి నుంచి లభ్యమౌతాయో చెప్పనేలేదు.

డిజిటల్ రంగ ప్రవేశం:

  • ఆసక్తికరమైన ఇంటరాక్టివ్ పేజెస్ తో వెబ్‍సైట్. ఇందులో మీ సృజనాత్మక సామర్థ్యాలను ప్రదర్శించడానికి మీరూ పాల్గొనవచ్చు.
  • కంప్యూటర్ ప్రియులకు ఈ-మేగజైన్

ప్రత్యేక సంచికలు:
  • ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకుని మరిన్ని శీర్షికలతో, ఎక్కువ పేజీలతో ప్రత్యేక సంచికలు వెలువరిస్తారట.


(వీట్లో మొదటిది ఈ నెల సంచికే! చందమామ షష్టి పూర్తిని మించిన సందర్భమేముంటుంది? :) ఈ సంచికలో డా. వై.యస్.రాజశేఖర్ రెడ్డి సందేశం ఉంది. ’మరి అబ్దుల్ కలామ్ సందేశం లేదా?’...అని మీరూ నాలాగే అనుకుంటున్నారా? అది కూడా ఉంది, కాస్త విభిన్నంగా.. ఇక అరవయ్యేళ్ళ చందమామ ప్రస్థానం గురించి ఆసక్తికరమైన ప్రత్యేక కథనం కూడా ఉంది.)
ఈ సంచికలో "నాకు నచ్చిన కథ" అని ఒక కొత్త శీర్షిక మొదలుపెట్టారు. దాంట్లో మొదటగా తనకు బాగా నచ్చిన కథ చెప్పింది అబ్దుల్ కలామ్! ఆయనకు నచ్చిన కథ పేరు "ప్రాణాన్ని కాపాడిన నిజం".

పర్యావరణ పరిరక్షణ - ఆవశ్యకత, సంబంధిత అంశాల గురించి హిందూ, హిందూ వార్షిక పర్యావరణ నివేదిక (Hindu Survey of the Environment), ది హిందూ - బిజినెస్ లైన్, ఫ్రంట్‍లైన్, పయనీర్, హిందూస్థాన్ టైమ్స్, దక్కన్ హెరాల్డ్, చందమామ, www.indiatogether.org తదితర పత్రికలు, వెబ్ సైట్లలో విస్తృతంగా రాసే కల్పవృక్ష సభ్యురాలు కాంచీ కోహ్లీ "ఆ రోజు జ్ఞాపకాలు" అంటూ ఒక కథ లాంటి తన అనుభవాన్ని గురించి చెప్తూ, పల్లెటూళ్ళలో ఉండే ప్రజలు నీళ్ళకోసం పడే కష్టాలను వివరించి, చెట్లు కనుమరుగైపోవడమే వర్షపునీరు వృథాగా వెళ్ళిపోవడానికి, భూగర్భజలాలు అడుగంటిపోవడానికి, తద్వారా వచ్చే నీళ్ళ కరువుకు కారణమని చెప్పారు.

ముఖ్యమంత్రి సందేశంలో నుంచి:

"బాలసాహిత్యం అరుదుగా వస్తున్న సమయంలో ఆ కొరతను తీరుస్తూ నెలనెలా సరికొత్త జానపద కథలతో, రంగుల బొమ్మలతో 13 భాషల్లో బాల బాలికలకు వినోదాన్ని, మనోవికాసాన్ని కలిగించే "చందమామ" తన పేరును సార్థకం చేసుకుంది.

"నాకు చిన్నప్పటి నుంచి "చందమామ" అంటే వల్లమాలిన ఇష్టం. పిల్లలందరికీ ఈ పత్రిక అంటే ప్రత్యేక అభిమానం వుంటుందని నా నిశ్చితాభిప్రాయం. ముఖ్యంగా విక్రమార్కుడి సాహసాన్ని, వివేకాన్ని ఆకర్షణీయంగా వర్ణించి, పిల్లల మేథస్సుకు పదును పెట్టే బేతాళ కథలంటే నాకు బాల్యంలో చాలా ఆసక్తి వుండేది.

"సత్యం, ధర్మం, నీతి, నిజాయితీ వంటి సామాజిక విలువలకు అద్దం పట్టే కథలను ప్రచురిస్తూ, బాల బాలికల మనస్సుపై చెరగని ముద్ర వేయడంలో "చందమామ" కృతకృత్యమైందనడంలో ఎలాంటి సందేహం లేదు.

"చిన్న పిల్లలతో బాటుగా, అన్ని వయస్సులవారికీ ఆనందాన్ని కలిగించే చందమామ మరెన్నో తరాల వారిని అలరించగలదని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను."

1 comment:

  1. అదన్నమాట సంగతి. ఐతే చందమామ ఇంకా అంతర్జాలంలో చిక్కుబడలేదు. చూద్దాం ఎన్నాళ్లకొస్తాడో. వచ్చినవెంటనే తెలిసికూడా చెప్పకపోయావో నీ తల వేయివ్రక్కలవుతుంది. :)

    ReplyDelete