Friday, 23 February 2007
సిగ్గు! సిగ్గు!!
సమస్త దేశాన్నీ ఆశీర్వదించే నెపంతో జాతీయపతాకాన్ని సదరు మాతాజీ తన పాదాల కిందేసి తొక్కిందా లేక కేవలం తన పాదాల మీద పరిపించుకుందా అనేది కాదు ప్రశ్న. ఎట్టి పరిస్థితుల్లోనూ నేలను తాకకూడని జాతీయపతాకాన్ని నేల మీద పరిచారా లేదా...అదీ ఒకరి పాదాలను తాకేలా అన్నదే. అదీ పదహారేళ్ళపాటు ఐక్యరాజ్యసమితిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన ఒక మాజీ అయ్యేయెస్ అధికారి సమక్షంలో! ఈ ఫోటోలే దిగ్భ్రాంతికరం కాగా "అమ్మగారి" పాదపద్మాల మీద పతాకాన్ని ఉంచి దేశం సుభిక్షమైపోవాలని కోరుకునే మూర్ఖశిఖామణులను సమర్థిస్తూ వచ్చిన వ్యాఖ్యలను చూసి ఏమనుకోవాలో అర్థం కాలేదు. ఈ పేజీలో నాలుగో వ్యాఖ్య రాసిన అజ్ఞాత పాఠకుడు అంటున్న "పరమసత్యం (Ultimate Truth)" ఏంటో నాకైతే బోధపడలేదు.
Saturday, 17 February 2007
నేను-తను
-సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి
ఒక అభిప్రాయం మా మధ్య పెఠిల్లున విరిగినప్పుడు-
మేమిద్దరం చెరో ధ్రువం వైపు విసిరేయబడతాము
ఆమె మొహం నాకేదో నిషిద్ధ వర్ణచిత్రంలా గోచరిస్తుంది
చేయి చాచితే అందే ఆమె దూరం
మనస్సులో యోజనాలై విస్తరించుకొంటుంది
ఉల్లిపొరై మామధ్య లేచిన భేదభావానికి
నా అహం ఉక్కుపూత పూసేందుకు నడుం బిగిస్తుంది
మౌనంగా మా మధ్య చెలియలికట్టలా పడుకుని ఉన్న పాపకు ఇటువైపు
నా గుండె కల్లోలసాగరమై ఎగిసిపడుతుంటుంది
నా మనస్సు విరిగిన అభిప్రాయశకలాల్ని కూర్చుకుంటూ
ఆమె కత్తివాదర వెనుక గయ్యాళితనాన్ని కొలుస్తుంటుంది
టైం కి డ్యూటీ కొచ్చి తట్టి సైగచేసే నిద్రను
మెలకువ కసరుకొంటుంది
ఎంతకూ నిద్రలేవని ఆమెలోని దాసిత్వాన్ని
నాలోని పురుషత్వం శంకిస్తుంటుంది
అప్పుడు-అభిప్రాయం కాదు సమస్య-
అది విరిగిన క్షణాలు మెదడులో వేరుపురుగులవ్వడం
అంతకంతకూ ఆమె నిశ్చల మౌనతటాకమౌతోంటే
నేననుకొంటున్న ఆమెలోని అహం కరిగి
నా పాదాలకేసి ప్రవహించనదుకు
నాలోని మరో నేను అసహనాన్ని పిచ్చిగా కౌగిలించుకుంటుంటాను
ఇప్పుడు-భేదభావం కాదు ప్రశ్న-
ఆమె అబలత్వం తీవై సాగి సాగి
చివురుల అరచేతుల్తో నా అహాన్ని స'మర్ది'స్తూ
నాపైకి ఎగబాకలేదనే!
క్షణక్షణానికి ఆమె మౌనం మీద వేయిచబడుతోన్న నా అహం
బేలగా మారి బీటలు వారేందుకు సిద్ధమౌతుంది
ఆమె చలిగాలి అలై నా ఒంటరితనాన్ని స్పర్శిస్తే
జలదరించి వర్షించాలని ఉంటుంది
మనోగవాక్షలలోంచి దూకివచ్చిన చంద్రబింబం
కన్నీటిబిందువై మా మధ్య కేర్ మన్నప్పుడు
ఆమెలోని మాతృత్వం పాపకేసి నదిలా కదిలి
అసంకల్పితంగా నన్ను ఆడతనమై తాకుతుందా-
నేను నీటిబుడగనై పేలిపోతాను
ఎర్రనీటి ఏటినై ఉరకలెత్తుతాను
ఆమెను నా గుండెల సుడిగుండాల్లో పసిపాపలా తిప్పుతాను
నేనే ఆమెనై అబలనై పసిపాపనై గారాలు పోతాను
Tuesday, 13 February 2007
దుస్సంధి-దుష్టసమాసం
రెండు వేర్వేరు భాషలకు చెందిన పదాలు కలిస్తే భాషాసంకరం అవుతుంది. అలాంటి పదాల కలయికతో ఏర్పడిన సమాసాల మాటెలా ఉన్నా సంధులకు మాత్రం సూత్రాలంటూ లేవు. ఉదాహరణకు:
అ+అ కలిస్తే తెలుగులో అ (అకారసంధి) ఐతే సంస్కృతపదాల్లో ఆ (సవర్ణదీర్ఘసంధి) అవుతుంది.
అలాగే అ+ఇ తెలుగులో ఇ (ఇకారసంధి) ఐతే సంస్కృతపదాల్లో ఏ (గుణసంధి) అవుతుంది. ఇలా ఒక్కో భాషలోని పదాల కలయికకు విడివిడిగా సూత్రాలున్నాయి. ఇలాంటి సంధి సూత్రాలు వర్తించని విధంగా రెండు వేర్వేరు భాషల్లోని పదాల మధ్య సంధి కలిపితే దాన్ని దుస్సంధి అని, ఆ సమాసాన్ని దుష్టసమాసం అని అంటారు.
ఒక ఉదాహరణ: నల్ల అనేది అచ్చతెలుగుపదం. ఇంద్రుడనేది ఇంద్ర: అనే సంస్కృతపదం నుంచొచ్చింది. ఇప్పుడు నల్ల+ఇంద్రుడు తెలుగుసంధిసూత్రాల ప్రకారమైతే నల్లింద్రుడు, సంస్కృతసంధి ప్రకారమైతే నల్లేంద్రుడు అవుతాడు. "ఏదైనా తప్పే. అసలలా వేర్వేరు భాషలకు చెందిన పదాలను కలపాలనుకోవడమే తప్పు" అంటారు వ్యాకరణవేత్తలు. వాళ్ళ ఉద్దేశ్యంలో రెండు వేర్వేరు భాషలకు చెందిన పదాలను కలపనే కూడదు. ఎందుకంటే రెండు పదాలు కలిసిపోయినప్పుడు ఏర్పడే కొత్తరూపం శబ్దాన్ని బట్టి కాక భాషను బట్టి మారుతుంది. ఉదాహరణకు రెండు హ్రస్వ అకారాలు కలిసినప్పుడు తెలుగులో "అ" ఏర్పడితే సంస్కృతంలో అవే శబ్దాలు కలిసినప్పుడు "ఆ" ఏర్పడుతుంది. అందుకే తెలుగులో రామ+అయ్య=రామయ్య (అకార సంధి) అయితే సంస్కృతంలో రామ+అవతారం=రామావతారం (సవర్ణదీర్ఘసంధి) అవుతుంది.
ఈ లెక్క ప్రకారం బ్లాగ్ అనేది ఆంగ్లపదం కాబట్టి బ్లాగోత్సాహం దుస్సంధి, దుష్టసమాసం అవుతుందా? (బ్లాగరులు తరచుగా తమది బ్లాగోత్సాహం అనే అంటున్నారు.) భాషలో ఎక్కువమంది వాడే పదమే వాడుకలో నిలుస్తుంది - వ్యాకరణసూత్రాలతో సంబంధం లేకుండా. ఇలాంటి వ్యాకరణవిరుద్ధమైన పదబంధాలు ఇప్పటికే కొన్ని బహుళవ్యాప్తిలో ఉన్నాయి.
సముదాయ పందిరి, వీక్షణజాబితాలు దుష్టసమాసాలా?
సముదాయ: సంస్కృతపదం
పందిరి: అచ్చతెలుగు
వీక్షణ: సంస్కృతపదం
జాబితా: విదేశీపదం (మనది కాదని తెలుసుగానీ ఏ దేశానిదో నాకు తెలియదు)
వికీపీడియాలో వాడుతున్న సముదాయ పందిరి దుష్టసమాసమని చెబితే తప్ప తట్టలేదు. ఐనా ప్రస్తుత పరిస్థితుల్లో దుష్టసమాసాలను ప్రయోగించకుండా మడి కట్టుకుని కూర్చోలేం.

Monday, 12 February 2007
ఆ ఐదుగురు
మహాభారతంలో ఐదుగురిని మహావీరులుగా పేర్కొన్నారు. వాళ్లైదుగురూ వాళ్ళలోవాళ్ళు కొట్టుకుచావల్సిందే తప్ప వేరెవ్వరూ వాళ్ళనేమీ చెయ్యలేరట. వాళ్లైదుగురు: భీముడు, దుర్యోధనుడు, జరాసంధుడు, కీచకుడు, బకాసురుడు. వీళ్లు నిజంగా అంత మొనగాళ్ళా?
ముందుగా బకాసురుడి సంగతి చూద్దాం. వీడు వీరోచితకృత్యాలు చేసినట్లు ఎక్కడాలేదు. వాడు చేసిందల్లా ఏకచక్రపురమనే అగ్రహారంలోని వాళ్ళను బెదిరించి పొట్టపోసుకోవడం. వాడి తిండి, ఆకారం చూసి ఆ అగ్రహారంలోని బ్రాహ్మలు వాడినెదిరించడానికి భయపడినట్లు అనిపిస్తుంది. వాణ్ణెదిరించేవాడెవరూ లేనంతవరకు మాత్రమే వాడి ఆటలు చెల్లాయి. బకాసురుడి జీవితకాలంలో వాడి వీరత్వానికి ఒకే ఒక సవాలు ఎదురైంది - భీముడి రూపంలో. ఆ ఒక్కసారీ వాడు దారుణంగా ఓడిపోయాడు. భీముడు బండెడు కూడు తిని భుక్తాయాసమైనా తీర్చుకోకుండానే వాడితో తలపడి చంపేశాడంటేనే వాడి వీరత్వమేమిటో స్పష్టమైపోతుంది.
భీముడికి చిన్నప్పట్నుంచి ఏ విషయంలోనైనా తన Id impulses ను అదుపులో పెట్టుకునే అలవాటులేదు. అందుకే తానున్నది అజ్ఞాతవాసంలోనైనా కీచకుడు తన భార్యను అవమానించాడనే కోపావేశంతో ఉన్న భీముడు వాడి శవాన్ని ఆనవాలైనా పట్టడానికి వీల్లేకుండా ఒక మాంసపుముద్దగా చేసిపారేశాడు. బేసిగ్గా బకాసురుడు, కీచకుడు ఒకలాంటివాళ్ళే. రెండే తేడాలు:
1. మొదటివాడికి కడుపే కైలాసం. రెండోవాడి ఆకలి వేరు.
2. మొదటివాడికి ఎటువంటి అధికారహోదా లేదు. రెండోవాడికి అధికారమదం, బలగర్వం ఉన్నాయి.
కీచకుడు వీరుడే. కొన్ని యుద్ధాలు గెలిచాడు. కానీ మహావీరుడంటే మాత్రం ఆలోచించాల్సిందే! నిజంగా కీచకుడు గొప్ప వీరుడే ఐతే విరాటరాజ్యం "దోమకుత్తుకంతే" ఎందుకుంటుంది? వీళ్ళిద్దరి గురించీ రాసినవాటిలో అతిశయోక్తులే ఎక్కువ.
దుర్యోధనుడు: వీడిది వజ్రకాయం. ధర్మబద్ధంగా ఐతే భీముడైనా, వాడి తాతైనా వీడిని గెలవలేకపోయేవాళ్ళు.(ఈ తాత గురించి ఇంకోసారి చెప్పుకుందాం.) పైగా వీడు గదాయుద్ధంలో మెళకువలు నేర్చుకున్నది(అడ్వాన్సుడు కోర్సు చేసింది) బలరాముడి దగ్గర. ఈ బలరాముడికి సరిజోడీ ఐనవాడు జరాసంధుడు.
జరాసంధుడు: చర్వితచర్వణం కాకుండా జరాసంధుడి గురించి ముందుగా నేను రాసింది ఇక్కడ చదవండి. అక్కడ "నమ్మశక్యంగా లేదు" అని ఎందుకు రాశానో మాత్రం ఇక్కడ వివరిస్తాను:
కృష్ణుడు భీమార్జునులను వెంటబెట్టుకుని గిరివ్రజానికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో గమనిస్తే చాలు - జరాసంధుడెలాంటివాడో తెలిసిపోతుంది:
వాళ్లు రావడమే దొడ్డిదారిన వచ్చారు. రావడంతోటే భేరీలను పగలగొట్టి విధ్వంసానికి పాల్పడ్డారు. వేరే ఎవరైనా ఐతే ఆ పని చేసినందుకు వాళ్ళను తన్నితగలేసేవాళ్ళు. ఐనా జరాసంధుడు వాళ్ళను ఆదరంగానే చూశాడు. తప్పుచేసి తన చేతికి చిక్కిన శతృవులనే ఏమీ చెయ్యకుండా వదిలినవాడుగా కనిపిస్తాడు జరాసంధుడు ఇక్కడ. ఆ ఆదరాన్ని కూడా తృణీకరించి వాళ్ళు అతణ్ణి అవమానించారు. మీరెవరని అడిగినప్పుడు వాళ్ళు తాము బ్రాహ్మణులమని చెప్పుకున్నారు. అప్పుడు వాళ్ళను చూసి జరాసంధుడు ఇలా అంటాడు: "మీ చేతులు ఆయుధాలు ప్రయోగించడానికి అలవాటుపడినవాళ్ళలా కాయలుకాచి ఉన్నాయి గానీ బ్రాహ్మణుల చేతుల్లా లేవు. ఐనా మీరెవరన్నది నాకనవసరం..." అని వాళ్ళకు అతిథులకు చేయదగిన మర్యాదలన్నీ చేస్తాడు.
చివరకు తామెవరో చెప్పి యుద్ధం చేస్తామన్నప్పుడు కూడా "18 సార్లు నా దెబ్బకు తట్టుకోలేక పారిపోయినవాడివి నువ్వు నాతో ఏం పోరాడుతావ్?" అని కృష్ణుణ్ణీ, మరీ అర్భకుడుగా ఉన్నాడని అర్జునుణ్ణీ వదిలేసి బుద్ధిపూర్వకంగానే భీముణ్ణి ఎంచుకుంటాడు. ఛాయిస్ తనకే ఇచ్చారు కదాని ముందుగా కృష్ణార్జునులను ఒకరి తర్వాతొకరిని రమ్మని చావచితక్కొట్టినా, లేక చంపిపారేసినా అడిగే దిక్కులేదు. ఐనా వాళ్ళు అంతదూరం వచ్చారంటే అది అతడి ధర్మనిరతి మీద వాళ్ళకున్న నమ్మకమే. ఇంతటి ధర్మపరుడు నరబలులిస్తాడంటే నమ్మడమెలా? అందునా సాటి రాజులను? పైగా అతడు నిజంగా నరబలులే ఇస్తున్నట్లైతే వీళ్ళు తన చిరకాల శతృవులని, ఇప్పుడు ఒంటరిగా చిక్కినారని తెలిసీ ముగ్గురినీ బంధించి అదే వరసలో బలి ఇవ్వకుండా ఎందుకు వదిలేసినట్లు? ప్రతీకారం తీర్చుకుంటారేమోనని భయమా? భీమార్జునులే చచ్చినాక పాండవుల వైపు కసిదీర్చుకునే వీరుడెవడున్నాడని? మహా ఐతే కృష్ణుణ్ణి కోల్పోయిన బలరాముడు దండెత్తివచ్చేవాడు. జరాసంధుడికి బలరాముడి వీరత్వం మీద ఏ కాస్త గౌరవమున్నా మథుర మీద అన్నిసార్లు దండెత్తేవాడే కాదుగద? ఐనా ఆ బలరాముడే జరాసంధుణ్ణి జయించగలిగితే వీళ్ళకీ తిప్పలెందుకు? జరాసంధుణ్ణి చంపడానికి చీకట్లో వెళ్ళడమే ఒక సూచన - అధర్మమార్గంలో చంపారనడానికి.

Sunday, 11 February 2007
సర్దార్జీలు-బహద్దూర్లు
సర్దార్జీలు:
గతంలో తాగుబోతుల మీదా, డాక్టర్ల మీదా ఎక్కువ జోకులు వచ్చేవి. కానీ ఇప్పుడు ఇంటర్నెట్లో సర్దార్జీల మీదొచ్చిన/వస్తున్న జోకులముందు అవెంత? మానవమాత్రులెవరి మీదైనా వెయ్యగలిగే జోకులను, ఎవరిమీదా వెయ్యలేని జోకులను కూడా సర్దార్జీల మీదే వేసి వినోదిస్తారు కొందరు. సర్దార్జీలంటే ఎందుకింత చులకనో నాకు తెలియదుగానీ ఇటీవల నాకొచ్చిన ఒక మెయిల్ గనక నిజమే అయితే అలా జోకులేసుకుని నవ్వుకున్నందుకు మనమే సిగ్గుతో తలదించుకోవలసి వస్తుంది. ఆ మెయిల్ ప్రకారం మన దేశం బ్రిటిష్ వారి పాలనలో ఉన్నప్పుడు సిక్కు వీరులు 1930 ప్రాంతంలో బ్రిటిష్ వారి దురాక్రమణకు వ్యతిరేకంగా అసమాన ధైర్యసాహసాలతో పోరాడారు. వాళ్ళ ధాటికి తట్టుకోలేకపోయిన బ్రిటిష్ పాలకులు వాళ్ళమీద ఇలాంటి జోకులెయ్యడం ద్వారా తమ కడుపుమంట చల్లార్చుకునేవాళ్ళట. అది తెలియక సర్దార్జీల మీద జోకులేసి నవ్వుకోవడం మనకు అలవాటైపోయింది.
అసలు 16వ శతాబ్దంలో సిక్కు మతం పుట్టినప్పటి నుంచి ఆ మతం మనుగడ వాళ్ళు మొఘలు పాలకులతో జరిపిన పోరాటాల్లో ప్రదర్శించిన గుండెధైర్యం, సాహసాల మీదే ఆధారపడింది. వాళ్ళ పవిత్రగ్రంథమైన ఆదిగ్రంథ్ ను రాయడంతో బాటు అమృత్సర్లో స్వర్ణదేవాలయం కట్టించిన గురు అర్జున్ దేవ్ ను చిత్రహింసలు పెట్టి చంపించాడు జహంగీర్. దాంతో తర్వాతి సిక్కు గురువైన హర్గోవింద్ సుశిక్షితులైన సిక్కులతో ఒక సాయుధదళాన్నే ఏర్పాటు చేశాడు. తొమ్మిదో గురువైన తేఘ్ బహదూర్ ను ఔరంగజేబు చంపించడంతో తొమ్మిదేళ్ళ వయసులో సిక్కు గురువైన గోవింద్ సింగ్ తర్వాతి కాలంలో పూర్తిస్థాయి సిక్కు సైన్యాన్నే (ఖల్సా) నడపవలసి వచ్చింది. తర్వాతికాలంలో ఔరంగజేబు అతడి నలుగురు కొడుకులను కూడా చంపించాడు. ఈ పోరాటాలు ఔరంగజేబుతో అంతమవలేదు. గురు గోవింద్ తర్వాత సిక్కు నాయకుడైన బందా బహదూర్ ను జహందర్ షా అనే మొఘల్ చక్రవర్తే చంపించాడు.
తర్వాతి కాలంలో పంజాబ్ లో సామ్రాజ్యాన్ని నిర్మించిన మహరాజా రంజిత్ సింగ్ కూడా సిక్కే. ఆఫ్ఘాన్లను పశ్చిమ పంజాబు నుంచి తరిమేసి పెషావర్ తో బాటే పష్టూన్ ను స్వాధీనం చేసుకున్నాడు. పష్టూన్ ప్రాంతాన్ని పాలించిన మొట్టమొదటి ముస్లిమితర పాలకుడు రంజిత్ సింగ్ - ఒక సర్దార్జీ! అంతకు ముందు వెయ్యేళ్ళ పైబడిన కాలంలో ఎప్పుడూ బయటి నుంచి కైబరు కనుమల గుండా విదేశీయులు మనదేశం మీదికి దండెత్తి ఆక్రమించుకోవడమే తప్ప ఇక్కడి నుంచి సైన్యాన్ని అటువైపు దాటించిన పాలకులెవరూ లేరు రంజిత్ తప్ప. రంజిత్ పాటించిన లౌకికవిధానాల వల్ల ముస్లిములు కూడా అతణ్ణి అభిమానించేవారు. అత్యంత సారవంతమైన పంజాబు భూమి మీద కన్నేసిన బ్రిటీష్ పాలకులు దాన్ని చేజిక్కించుకోవడానికి ఎన్ని కుట్రలు పన్నినా సిక్కుల పోరాటపటిమ వల్ల, రంజిత్ నాయకత్వలక్షణాల వల్ల అతడి జీవితకాలంలో అది సాధ్యపడలేదు.
దయచేసి సర్దార్జీల మీద జోకులేయడం ఆపండి. మీకు ఎవరైనా సర్దార్జీ జోకులు పంపినా, లేక చెప్పినా అలా చెయ్యొద్దని చెప్పండి.
బహద్దూర్లు:
పాత సినిమాలు చూసేవారికి కొన్ని ముసలిపాత్రలను రావు బహద్దూర్ అని గొప్ప అట్టహాసంగా చూపించడం తెలిసేవుంటుంది. ఈ బహద్దూర్లెవరో తెలుసా? ఇది కూడా బ్రిటిష్ వాళ్ళు మొదలుపెట్టిందే! తమ ప్రభుత్వానికి విధేయులుగా ఉన్న ఉన్నత కుటుంబాలవారికి వాళ్ళిచ్చిన బిరుదులే ఈ
రావు(రాయ్) బహద్దూర్ - హిందువులకు,
ఖాన్ బహద్దూర్ - ముస్లిములకు.
ఇప్పుడు ఆ "బహద్దూర్"ల భేషజం చూస్తే నవ్వొస్తుంది.