-సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి
ఒక అభిప్రాయం మా మధ్య పెఠిల్లున విరిగినప్పుడు-
మేమిద్దరం చెరో ధ్రువం వైపు విసిరేయబడతాము
ఆమె మొహం నాకేదో నిషిద్ధ వర్ణచిత్రంలా గోచరిస్తుంది
చేయి చాచితే అందే ఆమె దూరం
మనస్సులో యోజనాలై విస్తరించుకొంటుంది
ఉల్లిపొరై మామధ్య లేచిన భేదభావానికి
నా అహం ఉక్కుపూత పూసేందుకు నడుం బిగిస్తుంది
మౌనంగా మా మధ్య చెలియలికట్టలా పడుకుని ఉన్న పాపకు ఇటువైపు
నా గుండె కల్లోలసాగరమై ఎగిసిపడుతుంటుంది
నా మనస్సు విరిగిన అభిప్రాయశకలాల్ని కూర్చుకుంటూ
ఆమె కత్తివాదర వెనుక గయ్యాళితనాన్ని కొలుస్తుంటుంది
టైం కి డ్యూటీ కొచ్చి తట్టి సైగచేసే నిద్రను
మెలకువ కసరుకొంటుంది
ఎంతకూ నిద్రలేవని ఆమెలోని దాసిత్వాన్ని
నాలోని పురుషత్వం శంకిస్తుంటుంది
అప్పుడు-అభిప్రాయం కాదు సమస్య-
అది విరిగిన క్షణాలు మెదడులో వేరుపురుగులవ్వడం
అంతకంతకూ ఆమె నిశ్చల మౌనతటాకమౌతోంటే
నేననుకొంటున్న ఆమెలోని అహం కరిగి
నా పాదాలకేసి ప్రవహించనదుకు
నాలోని మరో నేను అసహనాన్ని పిచ్చిగా కౌగిలించుకుంటుంటాను
ఇప్పుడు-భేదభావం కాదు ప్రశ్న-
ఆమె అబలత్వం తీవై సాగి సాగి
చివురుల అరచేతుల్తో నా అహాన్ని స'మర్ది'స్తూ
నాపైకి ఎగబాకలేదనే!
క్షణక్షణానికి ఆమె మౌనం మీద వేయిచబడుతోన్న నా అహం
బేలగా మారి బీటలు వారేందుకు సిద్ధమౌతుంది
ఆమె చలిగాలి అలై నా ఒంటరితనాన్ని స్పర్శిస్తే
జలదరించి వర్షించాలని ఉంటుంది
మనోగవాక్షలలోంచి దూకివచ్చిన చంద్రబింబం
కన్నీటిబిందువై మా మధ్య కేర్ మన్నప్పుడు
ఆమెలోని మాతృత్వం పాపకేసి నదిలా కదిలి
అసంకల్పితంగా నన్ను ఆడతనమై తాకుతుందా-
నేను నీటిబుడగనై పేలిపోతాను
ఎర్రనీటి ఏటినై ఉరకలెత్తుతాను
ఆమెను నా గుండెల సుడిగుండాల్లో పసిపాపలా తిప్పుతాను
నేనే ఆమెనై అబలనై పసిపాపనై గారాలు పోతాను
మన వెనకటితరం మగపిల్లలలో తల్లిదండ్రులూ సమాజమూ నేర్పే ఆ అహం ఎంతలా కాలుస్తుందో, ఆత్మావలోకనం చేసుకునే మనిషిగా, నిజాయితీగా చెప్పారీ కవితలో. 'అభిప్రాయ భేదం కాదు సమస్య' అనే ఎరుక కలిగాక అహం కరిగిపోవాల్సిందే. సన్నపురెడ్డి జిందాబాద్.
ReplyDeleteకవిత అంటే విరహం, నిరీక్షణ, అయోమయం లాంటివి తప్పితే ఇలాంటి ప్రాక్టికల్ వ్యవహారాలు కవితా వస్తువుగా కనబడటం అరుదుగా చూస్తున్నాను. జీవితాన్ని "జీవించిన" వారినుండి పుడతాయివి. నిస్తేజంగా బ్రతుకీడుస్తున్న వారినుండికాదు.
రానారె గారు చెప్పినదే నేనూ చెపుతాను.ఇలాంటి కవితలు రావాలంటే ఎంతో సంఘర్షణ,జీవితం లో లోతు తెలిసివుండాలి.
ReplyDeleteఆమె అబలత్వం తీవై సాగి సాగి
ReplyDeleteచివురుల అరచేతుల్తో నా అహాన్ని స'మర్ది'స్తూ...
మనోగవాక్షలలోంచి దూకివచ్చిన చంద్రబింబం
కన్నీటిబిందువై...
ఆహా ఎంత మంచి కవిత్వం! అద్భుతంగా ఉంది.మంచి కవిత/జీవితసత్యాన్ని పరిచయం చేసిన మీకు నా కృతజ్ఞతలు! రానారె అన్నట్టు మరోసారి 'సన్నపురెడ్డి జిందాబాద్!'
సన్నపురెడ్డి మంచి కథల రచయితగా చిరపరిచితుడు. కవిత్వం కూడా ఇంత కమ్మగా పండిస్తున్నాడని తెలీదు.
ReplyDeleteఇంచుమించు ఇదే ఇతివృత్తం మీద నా అభిమాన రచయితల్లో ఒకరైన చంద్ర కన్నెగంటి రాసిన కవిత ఇక్కడ.
ఆంగ్లంలో నాసి రాసిన కవితలాంటి కథ ఇక్కడ.
ఇక్కడికొచ్చే బ్లాగహోదరులు - దరీమణులు వీటిల్ని కూడా ఆస్వాదిస్తారని ..
పంచుకున్నందుకు త్రివిక్రం కి బోలెడు థాంకులు.
కవిత్వం ఇంత వాస్తవికం ఉంటుందా అనిపిస్తుంది ఇలాంటివి చదివినప్పుడు.
ReplyDeleteఎక్కువగా భావేశాల్నే ఎంచుకునే నా లాంటివాళ్ళు చదవవలసిన కవిత.
thanks
sannapureddy garu
ReplyDeleteippatidaaka mee kathale chadive anandinchanu
intha goppaga magavaalla manasullo maata ento sunnithamga post mortem chese chepparu
hats off reddy garu
Dr. Bhimani
కొత్తపాళీ గారూ!
ReplyDeleteసన్నపురెడ్డి గురించి పరిచయం లాంటిది ఇక్కడ రాశాను. ఆయన 1980 లలోనే కవితలు రాయడం మొదలుపెట్టాడు. ఈ కవిత 1990లో రాసింది. చంద్ర కన్నెగంటి, నాని ల రచనలు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.
నాకో మంచి రచయితను పరిచయం చేసారు. ధన్యవాదాలు.
ReplyDelete