మహాభారతంలో ఐదుగురిని మహావీరులుగా పేర్కొన్నారు. వాళ్లైదుగురూ వాళ్ళలోవాళ్ళు కొట్టుకుచావల్సిందే తప్ప వేరెవ్వరూ వాళ్ళనేమీ చెయ్యలేరట. వాళ్లైదుగురు: భీముడు, దుర్యోధనుడు, జరాసంధుడు, కీచకుడు, బకాసురుడు. వీళ్లు నిజంగా అంత మొనగాళ్ళా?
ముందుగా బకాసురుడి సంగతి చూద్దాం. వీడు వీరోచితకృత్యాలు చేసినట్లు ఎక్కడాలేదు. వాడు చేసిందల్లా ఏకచక్రపురమనే అగ్రహారంలోని వాళ్ళను బెదిరించి పొట్టపోసుకోవడం. వాడి తిండి, ఆకారం చూసి ఆ అగ్రహారంలోని బ్రాహ్మలు వాడినెదిరించడానికి భయపడినట్లు అనిపిస్తుంది. వాణ్ణెదిరించేవాడెవరూ లేనంతవరకు మాత్రమే వాడి ఆటలు చెల్లాయి. బకాసురుడి జీవితకాలంలో వాడి వీరత్వానికి ఒకే ఒక సవాలు ఎదురైంది - భీముడి రూపంలో. ఆ ఒక్కసారీ వాడు దారుణంగా ఓడిపోయాడు. భీముడు బండెడు కూడు తిని భుక్తాయాసమైనా తీర్చుకోకుండానే వాడితో తలపడి చంపేశాడంటేనే వాడి వీరత్వమేమిటో స్పష్టమైపోతుంది.
భీముడికి చిన్నప్పట్నుంచి ఏ విషయంలోనైనా తన Id impulses ను అదుపులో పెట్టుకునే అలవాటులేదు. అందుకే తానున్నది అజ్ఞాతవాసంలోనైనా కీచకుడు తన భార్యను అవమానించాడనే కోపావేశంతో ఉన్న భీముడు వాడి శవాన్ని ఆనవాలైనా పట్టడానికి వీల్లేకుండా ఒక మాంసపుముద్దగా చేసిపారేశాడు. బేసిగ్గా బకాసురుడు, కీచకుడు ఒకలాంటివాళ్ళే. రెండే తేడాలు:
1. మొదటివాడికి కడుపే కైలాసం. రెండోవాడి ఆకలి వేరు.
2. మొదటివాడికి ఎటువంటి అధికారహోదా లేదు. రెండోవాడికి అధికారమదం, బలగర్వం ఉన్నాయి.
కీచకుడు వీరుడే. కొన్ని యుద్ధాలు గెలిచాడు. కానీ మహావీరుడంటే మాత్రం ఆలోచించాల్సిందే! నిజంగా కీచకుడు గొప్ప వీరుడే ఐతే విరాటరాజ్యం "దోమకుత్తుకంతే" ఎందుకుంటుంది? వీళ్ళిద్దరి గురించీ రాసినవాటిలో అతిశయోక్తులే ఎక్కువ.
దుర్యోధనుడు: వీడిది వజ్రకాయం. ధర్మబద్ధంగా ఐతే భీముడైనా, వాడి తాతైనా వీడిని గెలవలేకపోయేవాళ్ళు.(ఈ తాత గురించి ఇంకోసారి చెప్పుకుందాం.) పైగా వీడు గదాయుద్ధంలో మెళకువలు నేర్చుకున్నది(అడ్వాన్సుడు కోర్సు చేసింది) బలరాముడి దగ్గర. ఈ బలరాముడికి సరిజోడీ ఐనవాడు జరాసంధుడు.
జరాసంధుడు: చర్వితచర్వణం కాకుండా జరాసంధుడి గురించి ముందుగా నేను రాసింది ఇక్కడ చదవండి. అక్కడ "నమ్మశక్యంగా లేదు" అని ఎందుకు రాశానో మాత్రం ఇక్కడ వివరిస్తాను:
కృష్ణుడు భీమార్జునులను వెంటబెట్టుకుని గిరివ్రజానికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో గమనిస్తే చాలు - జరాసంధుడెలాంటివాడో తెలిసిపోతుంది:
వాళ్లు రావడమే దొడ్డిదారిన వచ్చారు. రావడంతోటే భేరీలను పగలగొట్టి విధ్వంసానికి పాల్పడ్డారు. వేరే ఎవరైనా ఐతే ఆ పని చేసినందుకు వాళ్ళను తన్నితగలేసేవాళ్ళు. ఐనా జరాసంధుడు వాళ్ళను ఆదరంగానే చూశాడు. తప్పుచేసి తన చేతికి చిక్కిన శతృవులనే ఏమీ చెయ్యకుండా వదిలినవాడుగా కనిపిస్తాడు జరాసంధుడు ఇక్కడ. ఆ ఆదరాన్ని కూడా తృణీకరించి వాళ్ళు అతణ్ణి అవమానించారు. మీరెవరని అడిగినప్పుడు వాళ్ళు తాము బ్రాహ్మణులమని చెప్పుకున్నారు. అప్పుడు వాళ్ళను చూసి జరాసంధుడు ఇలా అంటాడు: "మీ చేతులు ఆయుధాలు ప్రయోగించడానికి అలవాటుపడినవాళ్ళలా కాయలుకాచి ఉన్నాయి గానీ బ్రాహ్మణుల చేతుల్లా లేవు. ఐనా మీరెవరన్నది నాకనవసరం..." అని వాళ్ళకు అతిథులకు చేయదగిన మర్యాదలన్నీ చేస్తాడు.
చివరకు తామెవరో చెప్పి యుద్ధం చేస్తామన్నప్పుడు కూడా "18 సార్లు నా దెబ్బకు తట్టుకోలేక పారిపోయినవాడివి నువ్వు నాతో ఏం పోరాడుతావ్?" అని కృష్ణుణ్ణీ, మరీ అర్భకుడుగా ఉన్నాడని అర్జునుణ్ణీ వదిలేసి బుద్ధిపూర్వకంగానే భీముణ్ణి ఎంచుకుంటాడు. ఛాయిస్ తనకే ఇచ్చారు కదాని ముందుగా కృష్ణార్జునులను ఒకరి తర్వాతొకరిని రమ్మని చావచితక్కొట్టినా, లేక చంపిపారేసినా అడిగే దిక్కులేదు. ఐనా వాళ్ళు అంతదూరం వచ్చారంటే అది అతడి ధర్మనిరతి మీద వాళ్ళకున్న నమ్మకమే. ఇంతటి ధర్మపరుడు నరబలులిస్తాడంటే నమ్మడమెలా? అందునా సాటి రాజులను? పైగా అతడు నిజంగా నరబలులే ఇస్తున్నట్లైతే వీళ్ళు తన చిరకాల శతృవులని, ఇప్పుడు ఒంటరిగా చిక్కినారని తెలిసీ ముగ్గురినీ బంధించి అదే వరసలో బలి ఇవ్వకుండా ఎందుకు వదిలేసినట్లు? ప్రతీకారం తీర్చుకుంటారేమోనని భయమా? భీమార్జునులే చచ్చినాక పాండవుల వైపు కసిదీర్చుకునే వీరుడెవడున్నాడని? మహా ఐతే కృష్ణుణ్ణి కోల్పోయిన బలరాముడు దండెత్తివచ్చేవాడు. జరాసంధుడికి బలరాముడి వీరత్వం మీద ఏ కాస్త గౌరవమున్నా మథుర మీద అన్నిసార్లు దండెత్తేవాడే కాదుగద? ఐనా ఆ బలరాముడే జరాసంధుణ్ణి జయించగలిగితే వీళ్ళకీ తిప్పలెందుకు? జరాసంధుణ్ణి చంపడానికి చీకట్లో వెళ్ళడమే ఒక సూచన - అధర్మమార్గంలో చంపారనడానికి.
మీరు చేసే విశ్లేషణ బాగుంది...
ReplyDeleteఒక సూచన - మీరు వీడు వాడు అనే పద ప్రయోగం మారిస్తే బావుంటుంది.
చరిత్రలో గెలిచినవాళ్ళదే ధర్మ మార్గం. గెలుపుకున్న పవరది.
ReplyDeleteమీరు ఎన్.టి.ఆర్. "దాన వీర శూర కర్ణ", "సీతరామ కళ్యణం", "భుకైలాస్" ల పంధలో వెళుతున్నారనిపిస్తుంది. (గమనిక: ఈ సినిమాలన్ని పురాణలలోని ప్రతినాయకులని 'హీరో'లుగా చేసిచుపినవే.)
ReplyDeleteమహా భారతమైనా, రామాయణమైనా చెప్పేదొక్కటే!
ReplyDeleteఎంత నీతిమంతుడైనా, సత్య సంధుడైనా అతని లక్ష్యం అధర్మాన్ని ప్రోత్సహించడమైతే అక్రమంగానైనా అతన్ని శిక్షించవచ్చు. (రాముడు వాలిని, అర్జునుడు కర్ణున్ని, భీముడు దుర్యోధనున్ని, జర సందున్ని, వామనుడు బలి చక్రవర్తిని మొ.)
కాకపోతే ఏది అధర్మం ఏది ధర్మం అనేది నిర్ణయం ఎలా జరగాలనేది అసలు విషయం. సమకాలీన చరిత్రలో అమెరికా చేస్తోంది అధర్మ యుఇద్దమే అయినా ప్రజాస్వామ్యమనే ధర్మాన్ని కాపాడటానికి అది అవసరమే అని వాదిస్తోంది. మరి వీళ్ళు మన గీత ఎప్పుడు చదివారో!
--ఫ్రసాద్
http://blog.charasala.com