Tuesday, 12 December 2006

నువ్వసలు...

(చిట్టికథ)
అయ్యేయెస్ ఆఫీసర్ అభయాకర్ కు తానో జీనియస్ నని ప్రగాఢవిశ్వాసం. అతడి నమ్మకం అతడికుంటే ఏ నష్టమూ లేకపోయేది. కానీ తన సంతానాన్ని కూడా మేథాశక్తిలో తనంతవాళ్ళను చేయాలనీ, తన వంశాన్ని మేథావుల వంశంగా తీర్చిదిద్దిన ఘనత తనకే దక్కాలనీ ఆరాటపడ్డాడు. చాలాకాలం సంతానం లేకపోవడం వల్ల ఆ అవకాశం కూడా అతడికి ఆలస్యంగానే చిక్కింది. అందుకే కొడుకు పుట్టినప్పటి నుంచే వాడి మేథస్సుకు మెరుగుపెట్టేవిధంగా ట్రెయినింగ్ మొదలుపెట్టాడు.

తన కొడుకుకు మూడేళ్ళు వచ్చేవరకూ ఆగి మొదటిసారిగా వాడి తెలివితేటలకో చిన్న పరీక్ష పెట్టాడు.

రెండు పరీక్షనాళికలు - ఒకటి సన్నది, ఇంకొకటి వెడల్పుది - తీసుకుని రెండింటిలోనూ అతిజాగ్రత్తగా రెండేసి స్పూన్ల నీళ్ళు పోసి దేంట్లో ఎక్కువ నీళ్ళున్నదీ చెప్పమన్నాడు. ఆ పిల్లవాడు అమాయకంగా సన్నటి నాళిక చూపెట్టాడు - దాంట్లో నీళ్ళు ఎక్కువ లోతుగా ఉండడం చూసి.

దాంతో ఆ మేథావి హతాశుడయ్యాడు. "నాలాంటి జీనియస్ కు ఇలాంటి మందబుద్ధా కొడుకుగా పుట్టడం? వాటే షేమ్? వీడసలు నా కొడుకేనా? ఎందుకైనా మంచిది. డి.ఎన్.ఏ. టెస్ట్ చేయిస్తే అసలు విషయం తేలిపోతుంది కదా?" అనుకున్నాడు.

డి.ఎన్.ఏ. టెస్టు చేయించడమా, మానడమా అన్న డైలమాతోనే ఏడేళ్ళు గడిచిపోయాయి. ఆ ఏడేళ్ళూ ఆ కొడుకు ఆలనా పాలనా వాళ్ళమ్మే చూసుకుంది. ఆ తండ్రి ఆ డైలమాలోనే మునకలేస్తూ వుండిపోయాడు.

"ఏమైనా సరే, చివరిసారిగా ఇంకోసారి ప్రయత్నిస్తాను. ఫలితం అలాగే వస్తే డి.ఎన్.ఏ. టెస్టు తప్పనిసరి" అని దృఢంగా నిశ్చయించుకుని ఆ అయ్యేయెస్ ఆఫీసర్ కొడుకును పిలిచి మళ్ళీ అవే పరీక్షనాళికలతో అదే ప్రశ్న మళ్ళీ అడిగాడు.

ఆ పిల్లాడు "నాలాంటి ప్రాడిజీని ఇంత పిచ్చి ప్రశ్న అడుగుతున్నాడు. ఈయనసలు నా తండ్రేనా? వాటేషేమ్?" అనుకున్నాడు.

(స్వీయరచన: ఫిబ్రవరి 2004 చతురకతల్లో ప్రచురితం)

5 comments: