Sunday, 9 July 2006

రాశుల పేర్లు

ఆకాశంలో రాత్రి పూట మీకెప్పుడైనా చుక్కల దారుల్లో మేక, ఎద్దు లాంటి ఆకారాలేమైనా కనబడ్డాయా? నేనెప్పుడు చూసినా సరళరేఖలు, కోణాలు, త్రిభుజాలు, బహుభుజాల్లాంటి రేఖాగణిత ఆకారాలే తప్ప తేళ్ళూ ఎండ్రకాయలూ నాకెప్పుడూ కనబడలేదు. అసలు విషయమేమిటంటే అక్కడ మనం ఏయే ఆకారాలు ఊహించుకుంటే ఆయా ఆకారాలు కనబడతాయి. రాశులకు ఆ పేర్లు రావడానికి వెనుక ఒక రహస్యముంది. ఆ రహస్యం తెలుసుకోవాలంటే మనం చరిత్రలో కాస్త వెనక్కెళ్ళాలి.
నక్షత్రాలను 12 రాశులుగా విడగొట్టింది, రాశులకు ఆ పేర్లు పెట్టింది బాబిలోనియన్లు. ఆయా రాశులకు, వాటికి పెట్టిన పేర్లకూ భూమి మీద తాము చేసే పనులతో చక్కగా లంకె పెట్టారు. ఎట్లాగంటే సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు మేకలు ఈనేవట. (కుక్కలకు ఉన్నట్లే మేకలకూ ఒక ఋతువుందా? నాకు తెలియదు. ఒకవేళ గతంలో ఉన్నా మేకలు మనిషితో సావాసం చేసి చెడిపోలేదు కద? ;) ).
సూర్యుడు వృషభరాశిలో ఉన్నప్పుడు వాళ్ళు ఎద్దులను నాగలికి కట్టి నేల దున్నే వాళ్ళు. వృషభం తర్వాతిది మిథునం. నెలరోజుల పాటు వ్యవసాయప్పనులతో అలసిపోయినవారికి ఆటవిడుపు. కర్కాటక రాశిలో ఉన్నప్పుడు సూర్యుడు పీతలాగ వెనక్కి వెనక్కి నడుస్తాడు. అంటే అప్పటి వరకూ రోజురోజుకూ కాస్త కాస్త ఉత్తరానికి నడుస్తున్న సూర్యుడు దక్షిణానికి తిరుగుతాడు - అదే దక్షిణాయనం. (అప్రస్తుత ప్రసంగం: విశ్వనాథవారు వెనక్కి నడవగా నడవగా వేదకాలం ఇంకా వెనక్కెనక్కి పోయిందట - నన్ను తాకొద్దంటూ: తిలక్ కవిత్వానికి నా వ్యాఖ్యానం.) తులారాశిలో ఉన్నప్పుడు శరద్విషువత్తు Autumnal equinox: రోజులో పగలు, రాత్రి సరిగ్గా సమాన కాలం (పన్నెండేసి గంటలు) ఉంటాయనడానికి గుర్తు తక్కెడ. ధనూరాశి విల్లంబులు, ఇతర ఆయుధాలు ధరించి వేటకు వెళ్ళడానికి అనువైన సమయం. కుంభ రాశిలో ఉన్నప్పుడు కుండపోతగా వానలు కురుస్తాయి. తర్వాతి నెల మీనరాశి: చేపలవేటకు అనువైన సమయం.
ఆ కాలంలో వాళ్ళు పెట్టుకున్న పేర్లనే తర్జుమా చేసి యావత్ప్రపంచమూ వాడుకుంటోంది ఈనాటికీ.

(డా|| మహీధర నళినీమోహన్ రాసిన "కేలండర్ కథ" ఆధారంగా)

No comments:

Post a Comment