Sunday, 9 July 2006

చక్కని చుక్క రోహిణి:

(ఇది ఇన్ని రాశుల యునికి... అనే పోస్టుకు కొనసాగింపు)
సూర్యోదయమప్పుడు ఏ చుక్క (నక్షత్రం) చంద్రుడికి దగ్గరగా ఉందనే దాన్ని బట్టి ఆ రోజు నక్షత్రం నిర్ణయమవుతుంది. పున్నమి రోజు చంద్రుడు ఏ చుక్కతో ఉంటే ఆ నెల పేరును ఆ చుక్క పేరు మీదుగా పెట్టేశారు మనవాళ్ళు: చిత్రా నక్షత్రమైతే చైత్రం, విశాఖ ఐతే వైశాఖం, ఇలా వరసగా. (పున్నమి నుంచి పున్నమికి దాదాపు 30 రోజులు. చైత్రమాసంలో పున్నమి రోజు చిత్రా నక్షత్రం వస్తే 27 రోజుల తర్వాత 28వ రోజు మళ్ళీ చిత్రా నక్షత్రం వస్తుంది. 29 వ రోజు స్వాతి, 30 వ రోజు విశాఖ. అదే వైశాఖ పున్నమి. ప్రతి సంవత్సరం ఇదే వరస!) ఈ చుక్కలన్నిట్లోకీ రోహిణీ మరింత చక్కని చుక్క. ఆ రోహిణీ నక్షత్రానికి పున్నమి చంద్రుడితో గడిపే అవకాశం కార్తీక మాసంలో గానీ రాదు. ఆ నెలలో పున్నమి పూర్తవకుండానే కృత్తికా నక్షత్రం వెళ్ళిపోయి రోహిణి వచ్చేస్తుంది. అప్పుడు చంద్రుడెంతగా వెలిగిపోతాడంటే అంత ప్రకాశవంతమైన వెన్నెల సంవత్సరం మొత్తం మీద మరే నాడూ ఉండదు. అసలు కార్తీక మాసానికే వెన్నెల మాసమని పేరు.
ఇక సూర్యుడి విషయానికి వస్తే సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉన్నాడనేదాన్ని బట్టి కార్తె నిర్ణయమవుతుంది. సంవత్సరానికి మొత్తం 27 కార్తెలు. ఎప్పుడు ఏ కార్తె వచ్చేదీ కాలెండర్ లో చూసి తెలుసుకోవచ్చు. (ఈ సంవత్సరం రోహిణీ కార్తె మే 25 నుంచి జూన్ 8 వరకు ఉండింది.) రోహిణీ కార్తెలో సూర్యుడెంతగా వెలిగిపోతాడో చెప్పనవసరం లేదు: "రోహిణీ ఎండలకు రోళ్ళు పగులుతాయి" అనే సామెతే ఉంది.
(అయ్యవారొచ్చేదాకా అమావాస్య ఆగనట్లే మా రాయలసీమలో ఎండలు అమ్మగారొచ్చేదాకా ఆగవనుకోండి...అది వేరే విషయం.)

No comments:

Post a Comment