Thursday, 16 October 2008

జ్ఞాన పీఠం

"జ్ఞాన పీఠ అవార్డు ఇవ్వడానికి తెలుగు భాషను పరిశీలించే సమయం వచ్చింది" అన్నారు 'చంద్రిమ' బ్లాగులో రాసిన జ్ఞాన పీఠము తెచ్చినారము జ్ఞానులెవ్వరొ తెలుపుడీ! టపాలో చంద్రమోహన్ గారు.

నాకు తెలిసి అలాంటిదేమీ లేదు, ఒకసారి ఒక భాషవారికి ఇచ్చాక మూడు సంవత్సరాల పాటు ఆ భాషను పరిశీలించరు. అంటే గత మూడేళ్లలో అవకాశం రాని భాషలన్నిటికీ "సమయం" వచ్చినట్లే. నిన్న మొన్నటి దాకా భారతదేశంలో ఇతర భాషల్లో అసలు మంచి సాహిత్యమే రానట్లు దాదాపు ప్రతి మూడేళ్లకొకసారీ జ్ఞానపీఠాన్ని ఆనవాయితీగా ఎగరేసుకుపోతూ వచ్చిన కన్నడిగుల మీద నా ఉక్రోషాన్ని నమ్మ బెంగళూరు టపాలో చూపించాను. అది హాస్యానికనుకున్నారేమో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. (ఇప్పటి వరకూ కన్నడానికి ఏడు పీఠాలు వస్తే హిందీకి మాత్రం ఆరుసార్లు పీట వేశారు.) నాకు తెలిసిన కన్నడిగులను ఈ సప్తపీఠాల గురించి అడిగితే వాటిలో సాహిత్యేతర కారణాల వల్ల వచ్చినవి కూడా కొన్ని ఉన్నాయని అంగీకరించారు. కానీ కన్నడంలో ఆ పీఠమెక్కవలసినవారు ఇంకా చాలామంది ఉన్నారని కూడా వాక్రుచ్చారు!

విశ్వనాథ సత్యనారాయణ కోసం ఆ పీటనెత్తుకొచ్చింది అప్పటి జ్ఞానపీఠ అవార్డుల కమిటీ అధ్యక్షుడుగా ఉన్న బెజవాడ గోపాలరెడ్డి. ఒక ఇంటర్వ్యూలో ఆయనే చెప్పారు - ఆ పీటను తీసుకు రావడానికి తాను గట్టి కృషే చేశానని (ఆయన విశ్వనాథకు వీరాభిమాని లెండి).సినారెకు వచ్చినప్పుడు ఆ కమిటీ అధ్యక్షుడుగా ఉన్నది పి.వి. నరసింహారావు అనుకుంటా. అంటే కేవలం సాహిత్యానికే పరిమితం కాకుండా రాజకీయాల్లో ఆరితేరిన వారు ఆ కమిటీ అధ్యక్షులుగా ఉండి సామ, దాన, భేదోపాయాలను ప్రదర్శిస్తే తప్ప ఆ పీఠం తెలుగు నేలకు రాలేదన్నమాట. జ్ఞానపీఠాన్ని మళ్ళీ తెలుగునేలకు రప్పించే రహస్యం ఇదేనా? ఏమో!

విషయానికి వస్తే చంద్రిమ బ్లాగులో అడిగిన ప్రశ్నకు నేను సమాధానం అక్కడే రాసినా అది ఎందుకనో కనబడలేదు. అందుకే అక్కడ అడిగిన ప్రశ్నకు నా సమాధానం ఇక్కడ రాస్తున్నాను: కాళీపట్నం రామారావు.

5 comments:

  1. వడ్డించే వాడు మనవాడు కావాలంటారు! ఇక ఆ అవార్డుకు విలువ ఉంటుందంటారా...(ఆ రచనకు వుండొచ్చు గానీ)

    ReplyDelete
  2. మన తెలుగుకు జరిగిన చరిత్ర మీరు కన్నడ జ్ఞానపీఠలకు చెప్పగలరా? అదే,‘వారికి జ్ఞానపీఠవచ్చినప్పుడు కమిటీలలో ఎవరెవరు కన్నడిగులున్నారు’ అనేది.

    ఈ తతంగమంతా "ఆడలేక మద్దెలవాడిమీద పడేడ్చినట్లుంది"

    ReplyDelete
  3. @ మహేష్:

    ఆ అవార్డు కన్నడిగులకు వచ్చిన సంవత్సరాల్లో ఆ కమిటీలో ఏయే స్థానాల్లో కన్నడిగులు ఉన్నారనేది ఇక్కడ అప్రస్తుతం. ఉత్తమ సాహిత్యాన్ని సృజించడాన్ని ఆటతోనూ, దానికి జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చే ప్రయత్నాలను మద్దెలతోనూ పోల్చినట్లైతే లోపం మన ఆటది కాదనీ, ఓటిది మన మద్దెలే అనీ ఒప్పుకోక తప్పదు.

    ReplyDelete
  4. కాళీపట్నం రామారావు గారు అన్నివిధాలా అర్హులు జ్ఞానపీట్ అవార్డు పొందడానికి.

    ReplyDelete
  5. ఇప్పుడే చూస్తున్నా..సినీకవి జాలాది 75వసంతాల విశేషసంచికను,అందులోఆర్.యస్.ప్రసాదరావు,ఉపాధ్యాయుడు,అన్నాయన
    ఇలా అన్నారు,"కన్నడ రాష్త్రంలొ కవులు వరుసగా ఏడుసార్లు జ్ఞానపీఠ్ ఆవార్డులు గెలుచుకుంటే,తెలుగుసాహిత్యానికి కేవలం రెండుసార్లు రావడం,దానికి కారణం జాలాది గారి"విశ్వమోహిని"కావ్యం చదవలేదా?లేదా తెలుగు సాహిత్యం పట్ల చిన్న చూపా?పరమాత్మకే తెలియాలి.అని,
    కాబట్టి జాలాది ని కూడా అర్హులైన వారి జాబితాలో నేను చేర్చుతున్నాను(విశ్వమోహిని ఇప్పుడు చదవటం మొదలుపెట్టా)నా జాబితాలొని ఇతరపేర్లు(చందమామ తో సహా)చంద్రిమ,కొత్తపాళీ బ్లాగుల్లో రాసాను కాబట్టి మరలా ఇక్కడ పేర్కొనటం లేదు.

    ReplyDelete