Thursday, 7 June 2007

ద్రౌపది ప్రేమ

స్వాతి కుమారి రాసిన కవిత గురించి సాహిత్యం గుంపులో రాస్తూ రానారె "మహాభారతంలో ద్రౌపది ఒకసారి కృష్ణుని అడుగుతుందిట - (బహుశా కర్ణునికూడా భర్తగా పొందాలనే తన కోరికను వెల్లడించే సన్నివేశంలో)" అన్నారు. ద్రౌపది కర్ణుణ్ణి కూడా భర్తగా పొందాలనుకోవడమేమిటి? నేనిది ఎక్కడా చదవలేదు, వినలేదు - ఒక్క దానవీరశూరకర్ణ సినిమాలో తప్ప. సినిమాలు వ్యాపారదృక్పథంతో తీసేవి (అన్నీ కాకపోయినా చాలా మట్టుకు). వాస్తవఘటనలను ఆధారంగా చేసుకుని తీసినవాటిలో కూడా వాస్తవాలకంటే అతిశయోక్తులు, వక్రీకరణలే ఎక్కువ. ద్రౌపది విషయానికి వస్తే ఆమెకు కర్ణుడి మీద ఆ దృష్టి ఎంతమాత్రమూ లేదనేందుకు తిరుగులేని ఆధారం స్వర్గారోహణపర్వంలో ఉంది. పాండవులు రాజ్యం వారసులకు అప్పగించి ద్రౌపదీసమేతంగా హిమాలయాల్లో పడి పోతున్నప్పుడు ముందుగా ద్రౌపది నేలకూలుతుంది. అయినా అర్జునుడితో సహా నలుగురు పాండవులు తిరిగైనా చూడకుండా స్వర్గం వైపు వెళ్తుంటే భీముడు ఆమె చనిపోయినందుకు విలపిస్తూ 'ఎందుకిలా జరిగింది?' అని అడిగితే యుధిష్టిరుడు ఇలా అంటాడు: "ఆమెకు మిగిలిన తన భర్తలకంటే అర్జునుడి మీదే ప్రేమ ఎక్కువ. (అదే ఆమె చేసిన పాపం. అందుకే ఆమె చచ్చిపోయింది)". అసలు ద్రౌపది ప్రేమించిందీ, పెళ్ళాడాలనుకున్నదీ అర్జునుడొక్కణ్ణే. అప్పటివరకూ బ్రతికాడో చచ్చాడో తెలియని అర్జునుడు కట్టెదుట కనిపించేసరికి ఆనందపరవశురాలైన అయిన ఆమె 'అతణ్ణి పెళ్ళాడాలంటే మమ్మల్నందరినీ కూడా పెళ్ళాడకతప్పదు' అని యుధిష్టిరుడు పెట్టిన నిబంధనకు తలొగ్గింది. 'ఇదెక్కడి అన్యాయం?' అని అప్పుడే నిలదీయకుండా పరిస్థితులతో రాజీపడింది. అలాంటామె తన ప్రేమను జీవితాంతం ఐదుగురు భర్తలకు "సమానంగా" పంచి ఇవ్వడం ఎలా సాధ్యమౌతుంది? అలా ఉండాలనుకోవడం ఘోరమైన అన్యాయం కాదా?
ఆమె కర్ణుణ్ణి కోరుకున్నమాటే నిజమైతే ఇక్కడ యుధిష్టిరుడి సమాధానమెలా ఉండేదో మీరే ఊహించవచ్చు. ఒక పరపురుషుణ్ని కోరుకున్న పాపానికి అసలు ఆమెను స్వర్గలోక ఛాయలకైనా రానిచ్చి ఉండేవారు కాదు.

ఇంతకూ అక్కడ రానారె అడిగిన ప్రశ్నకు సమాధానం నాకు తెలియదు. మీకేమైనా తెలిస్తే చెప్పండి.

6 comments:

  1. త్రివిక్రంగారూ, నేను మీతో ఏకీభవిస్తున్నాను. ఇవన్నీ ఈమధ్య కాలపు పుట్టగింపులు. అసలు రానారె ఉటంకించిన శ్లోకం భారతంలోదేనా అని నాకొక సందేహం. అది భారతంలోదే ఐతే దానికి కృష్ణుడిచ్చిన సమాధానం ఏమిటో తెలుసుకోడం ఏమంత కష్టంకాదు.

    ReplyDelete
  2. ఇదే విషయం మీద మా నాన్న గారు నాకు చెప్పింది ఇది.
    "ద్రౌపది కర్ణుణ్ణి కోరుకుంది అనటం మధ్య లో వచ్చిన కల్పన. ఆవిడ అన్నది కర్ణుడు కూడా తన భర్తలతో కలసి పోతే తనకి సంతోషం అని.ఒక విధం గా సోదరులంతా కలవాలని, మరో ఉద్దేశం లో కర్ణుడు పాండవ పక్షం లో ఉండటం సమంజసం అనీ ఆవిడ ఉద్దేశం."
    నేనూ ఇదే సరైనది అనుకున్నా!
    ఇదే స్వర్గారోహణ పర్వం లో కృష్ణుడు ద్రౌపది ని విదుషీమణి గా సంబోధిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ రచనలో రచయిత పాత్రకి ఆపాదించిన ఔచిత్యాన్ని దృష్టి లో ఉంచుకున్నా ఈ కోరిక అసంబద్ధం గా ఉంది.

    ReplyDelete
  3. ద్రౌపది అస్సలు కర్ణుడిని భర్తగా అనుకోలేదు. అంతా సినిమావాళ్ళ సృష్టి. ఆవిడ ప్రేమించింది అర్జునుడినే. కాని అతని తల్లి ఆజ్ఞ ప్రకారం మిగతావాళ్ళని భర్తలుగా స్వీకరించింది. విరాటపర్వంలో భీముడు ఆమెను రక్షించాడు. చనిపోయినప్పుడు విలపించాడు. కాని ధర్మరాజు ఆమెను తన ఒక్కడి సొత్తుగా అనుకొని తమ్ముళ్ళ కూడా భార్య అని వారిని అడగకుండానే జూదంలో ఓడాడు. ఆమెను అవమానిస్తుంటే తల వంచి కూర్చున్నాడు.చనిపోయినప్పుడు కూడా చలించలేదు. ఇదేనా పతి ధర్మం.ధర్మమా...

    ReplyDelete
  4. ధర్మజుడి దగ్గర ఇన్ని అధర్మాలున్నా ఆయన సశరీరుడుగా పైలోకానికెళ్ళారు!

    --ప్రసాద్
    http://blog.charasala.com

    ReplyDelete
  5. వ్యాసభారతాన్ని నేను చదవలేదు. భారతం అనగానే నలుగురూ నాలుగురకాలుగా నమ్ముతారు, మాట్లాడతారు కదాని "..ట, బహుశా" అన్నాను. అయితే, ఆ శ్లోకం మాత్రం నేను విన్నాను. అందులోని విషయంపై విజ్ఞులెవరైనా వ్యాఖ్యానిస్తే తెలుసుకుందామని సాహిత్యం గుంపులో ప్రస్తావించాను - అది భారతంలోనిది అయినా సరే కాకపోయినా సరే.

    ReplyDelete
  6. హాయ్ త్రివిక్రమ్, మీకు వున్న తెలుగు భాషాభిమానానికి జోహార్లు. ఇంటెర్నెట్ లో ఇంత స్వచ్ఛంగా తెలుగును చూస్తుంటే ఆనందంగా వుంది మీ లాంటి తెలుగు భాషాబిమానులకు ఒక చిన్న ఐడియా ను నేను ప్రారంభించాను. అదే http://www.atuitu.com మిమ్మల్ని ఇక్కడకు ఆహ్వానిస్తున్నాను.

    This site is exclusively for Telugu People to help them stay connected and express their voice with some innovative tools. I Look forward to meet you on atuitu and your contribution in terms of active participation.

    Cheers

    Cass

    ReplyDelete