మనది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం. ఇంతమంది ఓటర్లు మరే ప్రజాస్వామ్య దేశంలోనూ లేరు కాబట్టి మనదేశానికి ఆ గుర్తింపు వచ్చింది. మన పొరుగునే ఉన్న పాకిస్తాను, బంగ్లాదేశ్, మ్యాన్మార్ (బర్మా) లాంటి దేశాల్లో సైన్యాధిపతులు, జుంటాలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నేతలను చీటికి మాటికి పదవీచ్యుతులనో, బందీలుగానో చేసి అధికారం హస్తగతం చేసుకుంటూండగా మనదేశంలో అలాంటి పరిస్థితి కలలో కూడా ఎప్పటికీ ఎదురుకాదనీ, ఇక్కడ ప్రజాస్వామ్య పునాదులు చాలా గట్టివనీ గర్విస్తాం. ఐతే మనది నిజంగా గర్వించదగిన ప్రజాస్వామ్యమేనా? అసలు ప్రజాస్వామ్యం విజయవంతం కావడానికి ఎలాంటి పరిస్థితులు అనుకూలిస్తాయి?
ప్రజాస్వామ్యంలో వయోజనులందరికీ సమాన ప్రాతిపదికన ఓటుహక్కుంటుంది. అంటే తెలివున్నవాళ్ళు - తెలివిలేనివాళ్ళు; ఆలోచనాపరులు - ఆలోచించడానికి ఇష్టపడని/బద్ధకించేవాళ్ళు, తమకు ఏది మంచో ఏది చెడో బాగా తెలిసినవాళ్ళు, తెలిసినా పట్టించుకోనివాళ్ళు, అసలు తెలుసుకోలేనివాళ్ళు వీళ్ళందరి అభిప్రాయాలకూ సమాన విలువుంటుంది. మరి అలాంటప్పుడు ప్రజాస్వామ్యం అర్థవంతం కావాలంటే ఓటర్లందరికీ సరైన సామాజిక పరిజ్ఞానం; ఓటర్లుగా, పౌరులుగా తమ హక్కులు మరియు బాధ్యతల పట్ల అవగాహన కలిగించడం అవసరం. ముందుగా ఆ పని చెయ్యకుండా ప్రజాస్వామ్యాన్ని అమలు చేసేసి మనది ప్రపంచంలోనే అతిగొప్ప ప్రజాస్వామ్యమని గర్వించడం సమంజసమా? కనీసం ఇప్పుడైనా ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయా?
బ్రిటిష్ వారి కాలంలో "male, propertied citizens" కే, అంటే ఆస్థిపరులైన పురుషులకే (అంటే భూస్వాములకు మాత్రమే - అది కూడా కుటుంబానికి ఒకరికి చొప్పున) ఓటుహక్కుండేది. మనకు స్వాతంత్ర్యం వచ్చి, మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన వెంటనే వయోజనులందరికీ ఓటుహక్కు ఇచ్చేశారు. అప్పుడు దేశంలో నిరక్షరాస్యత 86%గా ఉండేది (అక్షరాస్యులు 14% మందే). ఇప్పుడది 35%(అక్షరాస్యులు 65% మంది). ఇప్పటికీ చదువుకున్నవారిలో సైతం చాలా మందికి ఓటు విలువ తెలియదు. వాళ్ళు వోటు వెయ్యరు. వేసినా ఆ పని అభ్యర్థుల గురించి, పార్టీల గురించి, ప్రభుత్వపాలన సాగే విధానం గురించి పూర్తి అవగాహనతో చెయ్యరు. ఇక తమ ఓటును గుప్పెడు మెతుకులకో, గుక్కెడు సారాకో అమ్ముకునేవారి సంగతి సరేసరి. ఇది చాలనట్లు ఓటు వేసేటప్పుడు మన ఓటర్లు తాత్కాలిక ఉద్వేగాలకు లోనుకావడం, ఏదో ఒక పార్టీని గుడ్డిగా నమ్మి ఓటెయ్యడం చేస్తూ ఉంటారు. ఒక పార్టీ నేత మరణించినప్పుడో, వంచనకు గురైనప్పుడో ఆ పార్టీని/నేతను/సదరు నేత కుటుంబీకులను ఓదార్చడానికి (!?) ఓటును వెచ్చించేవాళ్ళూ తక్కువేం లేరు. ఇంకోవైపు కుల, వర్గ రాజకీయాలు ఆందోళన కలిగించే విధంగా బలపడుతున్నాయి.
సాధారణ పరిస్థితుల్లో కూడా వోటేసేటప్పుడు ఎంతమంది బరిలో ఉన్న పార్టీల గురించి, అభ్యర్థుల గురించి సవ్యంగా ఆలోచించి వోటు వేస్తున్నారు? మనవాళ్ళు ఎక్కువగా పట్టించుకునేది ప్రస్తుత ప్రభుత్వం మీద తమకు కలిగిన అభిప్రాయాన్ని. ఐదేళ్ళ చివర ఆ ప్రభుత్వం మీద తమక్కలిగిన అభిమానాన్నో, కసినో ఓట్ల రూపంలో చూపించడమే తప్ప ఆ నిర్ణయం తమందరి తలరాతల్ని ఐదేళ్ళపాటు ప్రభావితం చేస్తుందని గుర్తించేవాళ్ళు తక్కువ మంది (ఈ అభిమానం లేదా కోపం తాత్కాలికావేశం కాకుండా ఐదేళ్ళ పొడవునా పేరుకున్నదైతే మంచిదే).
వోటు వేసే ముందు ఈ క్రింది విషయాలు ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది:
1. పార్టీ గురించి: ప్రతి పార్టీకి కొన్ని సిద్ధాంతాలుంటాయి. ప్రతి పార్టీ కొన్ని వాగ్దానాలతో ప్రజల ముందుకు వస్తుంది. ఆశయాలకు, ఆచరణకు మధ్యనుండే అంతరం అందరికీ తెలిసిందే ఐనా ఒక పార్టీ వల్లించే ఈ ఆశయాలు, చేసే వాగ్దానాలు ఆ పార్టీ ప్రాథమ్యాలను, ప్రజాసంక్షేమం పట్ల ఆ పార్టీ దృక్పథాన్ని తెలుపుతాయి. ఇవి తమకు మేలు చేస్తాయని నమ్మిన ఓటర్లు ఆ పార్టీకి ఓటు వేయాలనుకుంటారు.
2. అభ్యర్థి గురించి: అసలు మనం మన ప్రతినిధిగా ఎలాంటి అభ్యర్థిని ఎన్నుకోవాలి? ఎవరైతే తమ నియోజకవర్గ అభివృద్ధికి నిబద్ధతతో కృషి చెయ్యగలడో, ఎవరికైతే ప్రజాసంక్షేమం పట్ల సరైన అవగాహన ఉందో అలాంటి అభ్యర్థికి ఓటు వెయ్యాలి. కానీ ఆచరణలో జరిగేదేమిటి? కుల, మత, వర్గ ప్రాతిపదికనో, వ్యక్తిగత రాగద్వేషాల ఆధారంగానో, ఇతరత్రా స్వార్థప్రయోజనాలు ఆశించో (తమ "పనులు" జరిపించగలరనే నమ్మకమున్నవారినో) ఓటు వేసేవారే ఎక్కువ మంది. ఇలా ఎన్నికైన ప్రజాప్రతినిధులు చట్టసభల సమావేశాల్లో తమ ప్రాంత ప్రజల అవసరాల గురించి కానీ, విధానపరమైన అంశాల గురించి గానీ ఎప్పుడూ నోరెత్తిన పాపాన పోరు. ఐతే మనకు నచ్చిన పార్టీని, నచ్చిన అభ్యర్థిని వేరువేరుగా ఎన్నుకునే అవకాశం లేదు. ఇక్కడ మనం వేసే ఒకే ఓటు అటు పార్టీకి, ఇటు అభ్యర్థికి చెందుతుంది. అంటే ఒక పార్టీ ప్రకటిత ప్రాథమ్యాలు ఎంత బాగా నచ్చినా, తమ నియోజకవర్గంలో ఆ పార్టీ నిలిపిన అభ్యర్థి సరైనవాడు కానప్పుడు ఓటరు తనకు నచ్చని అభ్యర్థికో, పార్టీకో వోటు వెయ్యక తప్పదన్నమాట.
కాపురం చేసే కళ కాలుతొక్కేటప్పుడే తెలిసినట్లు ఒక్కో రాజకీయపార్టీ పాలన ఎలా ఉండబోతోందో ఆ పార్టీ అభ్యర్థుల ఎంపికలోనే తెలిసిపోతుంది. ఎంత గొప్ప ఆదర్శాలు వల్లించినా ఆ ఆదర్శాలను అమలు చేసే బాధ్యత ఎలాంటి అభ్యర్థుల చేతుల్లో పెడుతున్నారో చూస్తే ఆయా పార్టీల చిత్తశుద్ధి ఏపాటిదో తేటతెల్లమవుతుంది. అక్రమార్కులు, అవినీతిపరులు, నేరచరితులను అభ్యర్థులుగా నిలిపే పార్టీలు అధికారంలోకి రావడం దేశ పురోభివృద్ధికి ఆటంకమే కలిగిస్తుంది. అందుకే ఓటర్లు తమకు నచ్చని అభ్యర్థిని పోటీలో నిలిపిన పార్టీకి వ్యతిరేకంగా ఓటువేయడమే దేశానికి మంచిది - అది ఎంత గొప్ప పార్టీ అయినాసరే. గతంలో మనదేశంలో ఒకే నియోజకవర్గం నుంచి ఒకరికంటే ఎక్కువమంది సభ్యులు ఎన్నికయ్యే అవకాశముండేది. ఇప్పుడు పోటీ చేస్తున్న అభ్యర్థులను చూస్తే అందరు అభ్యర్థులనూ తిరస్కరించే (None of the above)అవకాశం లేకపోవడం అతిపెద్ద లోపంగా అనిపిస్తోంది.
ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేసేవాళ్ళు, పార్లమెంటులోగానీ, శాసనసభలోగానీ సభ్యులుగా ఉంటూ మళ్ళీ పోటీ చేసే వాళ్ళు (పార్లమెంటు సభ్యుడొకరు ముఖ్యమంత్రి పదవినో, మరో ప్రయోజనాన్నో ఆశించి శాసనసభ్యుడొకరిచేత రాజీనామా చేయించి ఆ స్థానంలో శాసనసభ్యుడయ్యాడనుకోండి, అక్కడ పార్లమెంటుకు మళ్ళీ ఉప ఎన్నిక జరపాల్సొస్తుంది. ఒక్కరి స్వార్థప్రయోజనాల కోసం శాసనసభకొకటి, పార్లమెంటుకొకటి - రెండు ఉప ఎన్నికలు!), సరైన కారణం లేకుండానో, లేక కేవలం వ్యక్తిగత కారణాలవల్లో చట్టసభల సభ్యత్వాలకు రాజీనామా చేసేవాళ్ళు ప్రజాస్వామ్యస్ఫూర్తిని అవహేళన చేసినట్లుగా పరిగణించి వాళ్ళు మళ్ళీ ఎన్నికల్లో పాల్గొనే అవకాశం లేకుండా చెయ్యాలి (మొదటిసారైతే ఆరేళ్ళు, రెండవసారి అదేపనిచేస్తే శాశ్వతంగా). ఈ కారణాలవల్ల జరపవలసి వచ్చే ఉప ఎన్నికలకయ్యే ఖర్చును సదరు అభ్యర్థులనుంచే రాబట్టాలి. వాళ్ళ నామినేషను/రాజీనామా పత్రాలతోబాటే సదరు సొమ్మును సమర్పించేలా నిబంధనలను సవరించాలి. ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేసేవాళ్ళ డిపాజిట్టును కూడా తిరిగివ్వకూడదు.
3. స్థానిక ప్రాథమ్యాల గురించి: అభివృద్ధి ఫలాలు దేశంలోని అన్ని ప్రాంతాలకూ సమానంగా అందలేదు. దీనికి కారణాలు అనేకం. ప్రకృతిసహజమైన కారణాలు కొన్ని (భూసారం, వర్షపాతం, జలవనరులు, ఖనిజసంపద, మొదలైనవి) కాగా ఉన్న పరిమిత వనరులను ఎక్కడ వినియోగిస్తే ఎక్కువమంది లబ్ది పొందుతారో, ఉత్పాదకత గణనీయంగా మెరుగుపడుతుందో అక్కడే వినియోగించడం,అదే కారణం వల్ల ప్రభుత్వం మొదట సారవంతమైన భూములు, ఆధారపడదగ్గ జలవనరులు ఉన్నచోట నీటిపారుదల సౌకర్యాలు ఏర్పాటుచేయడం సబబైనదే. ఐతే అదే పరిస్థితి దీర్ఘకాలం కొనసాగినప్పుడు, ఒకే ప్రాంతం అన్నిరంగాల్లోనూ అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు ఇతర ప్రాంతాలవారికి అసంతృప్తి కలుగుతుంది. ఈ వివక్ష దీర్ఘకాలం కొనసాగినప్పుడు ప్రాంతీయ అసమానతలు ప్రాంతీయ విభేదాలకు, విద్వేషాలకు దారి తీస్తాయి. పరిస్థితి అంతవరకు రాకుండా తమ ప్రాంతంలో అభివృద్ధికి గల అవకాశాలేమిటో, ప్రతిబంధకాలేమిటో పరిశీలించి తెలుసుకుని, తదనుగుణంగా ఆ ప్రాంత అభివృద్ధికి కృషిచేయవలసిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులది. ఆ బాధ్యతను మన రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులెంతమంది పట్టించుకుంటున్నారు?
తమను ఎన్నుకున్న ప్రజల వాణిని చట్టసభల్లో వినిపించడం , ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం ప్రజాప్రతినిధుల బాధ్యత. ఈ బాధ్యతను సరిగా నిర్వర్తించని ప్రజాప్రతినిధుల ఎన్నికను ఎప్పుడైనా సరే రద్దుచేసే అవకాశం ప్రజలకుండాలి.
ఐతే ఒక ఎమ్మెల్యే లేదా ఎంపీ తన నియోజకవర్గస్థాయి అవసరాలను, సమస్యలను మాత్రమే గుర్తించగలరు. అంతకంటే కింది స్థాయి అవసరాలు - అంటే మండల/గ్రామస్థాయిలోని అవసరాలు - ఇంకొకవిధంగా ఉంటాయి. వాటికి పరిష్కారం కూడా స్థానికంగానే కనుగొనవలసి ఉంటుంది. ఇందుకోసమే మన రాజ్యాంగంలో స్థానికసంస్థలకు విశేష అధికారాలను ఇచ్చారు. ఇప్పుడు గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ ఈ పనులన్నీ చేయడం స్థానిక సంస్థలైన పంచాయతీలు, మునిసిపాలిటీల బాధ్యత. ఇది ఆచరణసాధ్యం కావాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీల ప్రమేయం ఉండరాదు. ఇది సమర్థవంతంగా అమలు జరగడానికి వీలుకలిగిస్తూ స్థానికసంస్థలకు అధికారాల బదలాయింపు పూర్తిస్థాయిలో జరిగితేనే ప్రజాస్వామ్యం అర్థవంతమూ, సమర్థవంతమూ అవుతుంది. దీన్నే Democracy at the grassroots level అని పేర్కొంటారు.
గ్రామపంచాయతీలకు అప్పగించవలసిన అధికారాలు/బాధ్యతలుగా మన రాజ్యాంగం లో వీటిని పేర్కొన్నారు:
1. వ్యవసాయం, వ్యవసాయ విస్తరణ.
2. భూసంస్కరణల అమలు, భూసారసంరక్షణ, తదితరాలు.
3. చిన్ననీటిపారుదల, నీటియాజమాన్యం, వాటర్షెడ్ ల అభివృద్ధి.
4. పశుపోషణ, పాడిపరిశ్రమ, కోళ్ళపెంపకం.
5. చేపలు/జలచరాల పెంపకం.
6. సామాజిక అడవులు, క్షేత్ర అడవులు.
7. అటవీ ఉత్పత్తులు.
8. ఫుడ్ ప్రాసెసింగ్ తో సహా అన్ని చిన్నతరహా పరిశ్రమలు
9. ఖాదీ, గ్రామీణ, కుటీర పరిశ్రమలు.
10. గ్రామంలో ఇళ్ళనిర్మాణం.
11. మంచినీటి సౌకర్యం.
12. ఇంధనం, పశుగ్రాసం.
13. రహదారులు, కల్వర్టులు, వంతెనలు, పడవలు, జలమార్గాలు, మొ.
14. గ్రామంలో విద్యుదీకరణ, విద్యుత్తు సరఫరా.
15. సంప్రదాయేతర ఇంధనవనరులు.
16. పేదరిక నిర్మూలనాకార్యక్రమాలు.
17. పాఠశాల స్థాయి విద్య.
18. సాంకేతిక, వృత్తివిద్య.
19. వయోజన, నాన్-ఫార్మల్ విద్య.
20. గ్రంథాలయాలు.
21. సాంస్కృతిక కార్యక్రమాలు.
22. సంతలు, తిరునాళ్ళు.
23. ఆరోగ్యం-పారిశుద్ధ్యం, ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, డిస్పెన్సరీలు.
24. కుటుంబసంక్షేమం.
25. స్త్రీ-శిశుసంక్షేమం.
26. వికలాంగులు, మానసికంగా ఎదగనివారితో సహా సాంఘికసంక్షేమం.
27. బలహీన వర్గాలవారి సంక్షేమం.
28. ప్రజాపంపిణీవ్యవస్థ.
29. ఊరుమ్మడి ఆస్థులను పరిరక్షించడం.
ఇలాగే పట్టణస్వపరిపాలనసంస్థలకు అప్పగించవలసిన అధికారాలు 18 ఉన్నాయి. ఈ పనుల్లో వేటిని చేయవలసి వచ్చినా నిర్ణయాలు గ్రామ/పట్టణ స్థాయిలోనే తీసుకోవడం సబబు. అనుమతి/నిధుల మంజూరు కోసం రాష్ట్ర/కేంద్ర ప్రభుత్వాలకేసి చూడవలసిరావడం అర్థరహితం. ఐతే స్థానికస్వపరిపాలనసంస్థలకు అధికారాలిస్తే సరిపోదు. వాటిని అమలుచేయడానికవసరమైన నిధులు కూడా ఇవ్వాలి. స్థానికసంస్థలకు అధికారాలు/నిధులను బదలాయించే విషయంలో ఏలినవారి దయ ఎంతవరకు ఉందో చూస్తూనేవున్నాం. ఇకమీదటైనా పరిస్థితి మారుతుందేమో చూడాలి.
ఒక్క ఓటు అభ్యర్థిని, ప్రభుత్వాన్ని రెండిట్నీ నిర్ణయించడం అన్యాయమైతే గెలిచిన పార్టీలు ఆ ఒక్క ఓటును తమ మేనిఫెస్టోలోని అసంఖ్యాక అంశాలమీదా ప్రజలు వేసిన ఆమోదముద్రగానూ, తాము అధికారంలోకొచ్చాక ఏకపక్షంగా తీసుకునే నిర్ణయాలన్నిటికీ ప్రజల అంగీకారంగానూ భాష్యాలు చెప్పడం మరీ అన్యాయం. ఒక్కో పార్టీ చేసిన ఎన్నికల వాగ్దానాల్లోని ఒక్కో అంశం మీదా ఓటర్లు విడివిడిగా తమ అభిప్రాయాలను తెలియజేసే అవకాశం లేకపోవడం దీనికి ఆస్కారమిస్తోంది.
స్వాతంత్ర్యం వచ్చి అరవయ్యేళ్ళైనా మన దేశంలో పేదరికం, అవిద్య, అనారోగ్యం, నిరుద్యోగాలు తాండవిస్తూనే ఉన్నాయి. దీనికి కారకులెవరు? అని ప్రశ్నించుకుంటే ఇన్నేళ్ళూ దేశాన్ని పాలించిన ప్రభుత్వాలే అని సమాధనమొస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రాథమికావసరాలే తీరకపోతే మరి మన ప్రజాస్వామ్యం విజయమైనట్లా?
జుడిషియల్ ఆక్టివిజం: ప్రస్తుతం మనమెన్నుకుంటున్న ప్రజాప్రభుత్వాల మీద మనకున్న నమ్మకమెలాంటిదంటే ప్రజారోగ్యం నుంచి ట్రాఫిక్ నిబంధనల వరకు ఏ విషయంలోనైనా కోర్టు కలగజేసుకుని ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించేంతవరకూ ప్రభుత్వం ఆ సమస్యల్ని పట్టించుకుంటుందనే (పట్టించుకున్నా సరైన రీతిలో స్పందిస్తుందనే) ఆశలు కూడా వదిలేసుకుంటున్నాం. అప్పుడప్పుడూ కోర్టులు అత్యుత్సాహంతో హద్దుమీరి మనమెన్నుకున్న చట్టసభల కార్యకలాపాలను నిర్దేశించే ప్రయత్నం చేస్తున్నా దాన్ని అనుచితజోక్యంగా భావించడం లేదు. వీటినిబట్టిచూస్తే అసలు మనది ప్రజాస్వామ్యమేనా అనే అనుమానం రాకమానదు.
chalaa vipulam gaa cepparu.miiru ceppina prati maata nijame.
ReplyDeleteఇది మీలాంటి, నాలాంటి సామాన్యుల, మాన్యులందరి ఆక్రందన, ఆవేదన. దీనిని పట్టించుకునే నాధుడెవరు. పిల్లి మెడలొ గంట కట్టేదెవరు? సమాజం పట్ల నిబద్ఢత కరవైన అరాజకీయుల చెతుల్లొ మనం కీలుబొమ్మలం. ఏం చేయగలం చెప్పండి. కుల, మత ప్రాతిపదికగ సాగె ఓటు బ్యాంకు రాజకీయాలను సమూలంగా ప్రక్షాళన చెయాల్సిన తరుణం వచ్చేసింది. కాదంటారా?
ReplyDeleteచాలా శ్రమకోర్చి, ఆలోచించి వ్రాసిన, ప్రతి వాళ్ళూ ఆలోచించదగ్గ విషయం. ఇంత ఛండాలంగా మన ప్రజాస్వామ్యం తయరైంది కనకనే ఈమధ్యన తయారు చేసిన ప్రజస్వామ్య సూచికలో మన దేశం ఎక్కడో వెనకాల ఉంది.
ReplyDeleteఇది చదివారా?
ReplyDeletehttp://sudhakar.wordpress.com/2006/11/24/indian-democrasy-now-impersonated/
ప్రజాస్వామ్యం గుడ్డిలో మెల్ల మాత్రమే. అంతకంటే దాన్నుండి ఎక్కువ ఆశించలేము. అందరికీ సమాన హక్కులు అంటే ఇలానే ఉంటది. సమస్య అక్షరాస్యతది అని అనుకుంటారు కానీ.. కాదు. అలా అయితే 98% అక్షరాస్యులు ఉన్న అమెరికాలో ఎంత మంది భాధ్యతాయుతంగా ఓటేస్తున్నారు? 50% శాతం మంది ఓటేస్తే అది గొప్ప. అందులో ఈమె అందంగా ఉంది, వాడి పేరు నాకు నచ్చింది, నేనీ పార్టీకే ఓటేస్తా అని ఓటేసేవారు 90%. పన్నులు కట్టనివాళ్లకు ఓటు హక్కు తీసేస్తే సగం దురద తీరుతుంది. ఓటు వళ్ల తమ ప్రయోజనాలు బలిపీఠం మీద ఉన్న వాళ్లయితేనే సక్రమంగా ఆలోచించి ఓటేస్తారు. లేకుంటే ప్రజాస్వామ్యం ఖరీదు ఒక సారా పాకెట్టే మరి.
ReplyDeleteరాధిక, కామేశ్ గార్ల స్పందనకు ధన్యవాదాలు. సత్యసాయి, సుధాకర్! మీరు పేర్కొన్న వార్త వాస్తవాలను తేటతెల్లం చేస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యదేశానికిది సిగ్గుచేటైన విషయం. వైఙాసత్యా! మీతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. పౌరసత్వంతో బాటే ఓటుహక్కు ఆటోమేటిగ్గా ఇచ్చెయ్యకుండా పన్నులు సక్రమంగా చెల్లించడం లాంటి విధులు సక్రమంగా నిర్వర్తించేవారికే పరిమితం చేస్తే మన ప్రజాస్వామ్యం కొంతైనా బాగుపడుతుంది.
ReplyDeleteత్రివిక్రమ్,
ReplyDeleteమంచి విషయపుష్టితో రాసిన వ్యాసం చాలా బాగుంది.
మనిషి మనిషికీ ప్రాధామ్యాలు వేరు వేరుగా వుంటాయి. దరిద్రుడికి ఆకలి తీరడమే సమస్య అయితే నిరుద్యోగికి ఉద్యోగం లేకపోవడం సమస్య. ఉద్యోగికి చాలీచాలని జీతం సమస్య. ఇలా మనుషులెన్ని రకాలో సమస్యలన్ని రకాలు. మరి ఓటు హక్కు అందరికీ ఇవ్వకుంటే దరిద్రుడి ఆకలి సంగతి గురించి నిరుద్యోగి ఆలోచిస్తాడా? నిరుద్యోగి సమస్య గురించి ఉద్యోగి ఆలోచిస్తాడా? అక్షరాస్యులకో, పన్నుకట్టే వాడికో మాత్రమే ఓటుహక్కు ఇస్తే కనీసం ఎలక్షన్ల ముందైనా మురికివాడలకు వస్తున్న ఈ నాయకులు అప్పుడు వీరిని ఊరి బయటకు తరిమివేయరా? అమెరికాలో కూడా ఇలా సంపన్న రాష్ట్రాన్నో, అధిక ఓటర్లున్న రాష్ట్రాన్నో పట్టించుకుని చిన్న రాష్ట్రాలని పట్టించుకోరేమొనన్న బెంగతో చిన్న పెద్దా తేడా లేకుండా ప్రతి రాష్ట్రానికీ రెండు సెనేట్ సీట్లు ఇచ్చారు.
అంతెందుకు సామూహికంగా యూనియన్‌లు పెట్టి, సమ్మెలు చేసి హక్కులు సాధించుకొనే ఉద్యోగులకు అడగందే పే కమీషన్లు వేసి జీతాలను పెంచేస్తున్నారే, కరువు కాటకాల పేరుతో కరువు భృతి ఇస్తున్నారే, మరి ప్రభుత్వాన్ని ఏ యూనియన్ పెట్టీ, బందులు చేసీ నిలదీయలేని రైతుల గోడు ఎవ్వరు వినిపించుకుంటున్నారు? కరువు వచ్చినప్పుడల్లా ఎవ్వరు వారికి భృతి ఇస్తున్నారు? ఉద్యోగుల జీవన ప్రమాణాన్ని పెంచినట్టుగా ఎవరు వారి జీవనాన్ని గురించి ఆలోచిస్తున్నారు?
చివరికి వారు నిరక్షరాస్యులనో, రాజకీయాలంటే అవగాహన లేదనో ఆ వున్న ఓటు హక్కూ లేకుంటే వారి గోడు ఎవ్వరింటారు?
--ప్రసాద్
http://blog.charasala.com
"..ఆ ఒక్క ఓటును తమ మేనిఫెస్టోలోని అసంఖ్యాక అంశాలమీదా ప్రజలు వేసిన ఆమోదముద్రగానూ, తాము అధికారంలోకొచ్చాక ఏకపక్షంగా తీసుకునే నిర్ణయాలన్నిటికీ ప్రజల అంగీకారంగానూ భాష్యాలు చెప్పడం మరీ అన్యాయం." ఔను! మనం వాళ్ళను ఎన్నుకున్నదొకదానికైతే వాళ్ళు చేసేదింకోటి. రాష్ట్ర విభజన లాంటి అంశాల్లో ప్రత్యేకంగా వోటింగు జరగాలి. ఖర్చనుకుంటే ఒక్కసారే ఎన్నికలప్పుడే దాని కోసం విడిగా మరో బాలెటు పత్రాన్నిచ్చి వోటెయ్యమనాలి.
ReplyDeleteఅలాగే ప్రజాప్రతినిధులపై సమీక్షా వ్యవస్థ ఒకటి ప్రజల చేతుల్లో ఉండాలి. ఎన్నికలే సమీక్షంటే కుదరదు. మీరన్నట్లు ఎన్నికలలో సవాలక్ష అంశాలు చూసి వోటేస్తారు.. అలా కాక ఫలానా ఎమ్మెల్యే లేదా ఎంపీ తరువాతి ఎన్నికల్లో పోటీకి అర్హుడా కాదా అనే సమీక్ష జరగాలి. అందులో నెగ్గితేనే ఆ వ్యక్తిని పోటీ చెయ్యనివ్వాలి.
హక్కును అందరకీఇవ్వడంవల్ల వచ్చిన సమస్య కాదిది. పోటీ చేయడానికి ఎవరికైనా అర్హత - చివరికి జైలులో ఉన్న తీవ్రవాడికి కూడా ఇవ్వడం. డిగ్రీ లేకుండా వైద్యం చేస్తే ఎవరినీ చట్టం క్షమించదు సరియైన అర్హత లేకుండా ఎవరినీ లాయారుగా గుర్తించదు చదువులేకుండా ఎవరికీ శాస్త్రవేత్తగానో, ఆచార్యుడిగానో, సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగానో చివరికి ప్యూను గా కూడా ఉద్యోగం చేయడానికి అర్హత లేదు. కానీ 100 కోట్ల జనాల తల రాతలు మార్చే అధికారాలున్న, దేశవ్యవహారాలు చక్కబెట్టవలసిన క్లిష్టమైన బాధ్యత గల మన ఎన్నదగిన రాజకీయులకి వేలుముద్ర వేయడం వస్తే అవసరానికి మించిన అర్హత ఆది . ఈ విషయాన్ని ఎప్పుడో చెప్పాడు Plato. మనం ఇప్పటికి కూడా నేర్చుకొనే దృక్పధం లేదు. మనల్ని దేవుడైనా రక్షించగలడా?
ReplyDeleteఅలాంటి అర్హతలు ఎందుకు పెట్టలేమో తెలుసా? ఒక దళిత అభ్యర్ధి వచ్చి అయ్యా నేను దళితున్ని నాకు ఈ బలిసిన వాళ్ల ప్రపంచములో (అంటే ఏంటో?? అమెరికాలో మాత్రం పేదవాళ్లే బలుస్తుంటారు) చదువుకొనే అవకాశము రాలేదు. మరి ఈవిధముగా నన్నిప్పుడు ఎన్నికలలో కూడా పోటీచెయ్యనివ్వట్లేదు. ఇది వివక్షత, అన్యాయము అని గగ్గోలు పెడతారు. అప్పుడు రాజకీయ నాయకుల అర్హతలకు కూడా సడలింపులు, రిజర్వేషన్లు, మినాహాయింపులు వగైరా వగైరా (అప్పుడు ఇది ప్రజాస్వామ్యమా?)
ReplyDeleteరాజకీయ నాయకులు మితిమీరిన ఉత్సాహంతో రిజర్వేషన్ శాతం 70 కి పెంచితే దాన్ని నియత్రించవలసిన బాధ్యత కోర్టులు తీసుకుంటున్నాయి. ఎన్నికలలో నిలబడేవారికి కనీస విద్యార్హతల నిబంధన ఉంటే బాగుంటుంది.
ReplyDelete