వెన్నెలరేలలో స్త్రీలు మండలాకారంలో నిలబడి ఉభయపార్శ్వాలలో ఉద్దికత్తెలతో ఒద్దికలు చెడకుండా ఒకసారి కుడితట్టునకు, ఇంకొకసారి ఎడమతట్టునకు తిరిగి ఆయా వైపులనుండే వారి అరచేతులను తమ అరచేతులతో తట్టుతూ గుండ్రంగా అడుగులు వేసి తిరుగుతూ పాడుతూ ఆడే ఆటనే "జట్టిజాము" అంటారు. జానపద స్త్రీలు వెన్నెలరాత్రుల్లో ఆడే ఆట కాబట్టి జట్టిజాముగా మారిందని నా ఊహ (జట్టి అనే మాట యక్ష శబ్దభవమైన జక్కిణి రూపాంతరం కావచ్చు). ఈ క్రీడకు ఎలాంటి వాయిద్యాలుండవు. చేతి చరుపులు, కరకంకణ నిక్వాణాలే వారి పాటలకు వాయిద్యాలు. పెన్నుద్దికత్తె పాట పాడగా మిగతా ఉద్దులు ఆ పాట అందుకుని పాడతారు. యుగళగీతాలు ఉద్దులు ఉద్దులుగా పాడుకుంటారు. జట్టిజాంలో భక్తిరసప్రధానమైన గేయాలే కాక హాస్య, శృంగార, పురాణ వీరరస గేయాలు కూడా చోటు చేసుకున్నాయి.
"జట్టిజాం" రూప నిష్పత్తిని గురించి ఆచార్య తూమాటి దోణప్పగారు కూడా ఒక వివరణ ఇచ్చియున్నారు. "సంస్కృతంలో చేతికోల అనే అర్థమిచ్చే యష్టి శబ్దం ప్రాకృతంలో జట్టిగా మారింది. అట్లే ప్రహారమనే అర్థం గల యమ శబ్దం ప్రాకృతంలో జామ అయింది. రెంటిని జోడింపగా జట్టిజామ, దాన్నుంచి తెలుగులో జట్టిజాం - మొదట కోలాటంలో వలె చేతికోలలతో ఆడే ఆట కాలక్రమంలో ఉత్తచేతులతో ఆడడం మిగిలిందేమో? వెన్నెలవెలుగులో మండలాకారంలో నిలబడి ఇరువైపులా ఉండే ఉద్దికత్తెలతో ఒద్దికలు చెడకుండా ఒకసారి కుడివైపుకు, ఇంకొకసారి ఎడమవైపుకు పార్శ్వం నాలుగు భంగిమల్లో ఓరగా తిరిగి ఆయా వైపులనుండే వారి అరచేతులను తన అరచేతులతో తట్టుతూ పాటలు పాడుట ఇది."
కడప జిల్లా ప్రాంతాల్లో వలయాకారంగా అడుగులు వేసి తిరుగుతూ తరుణులు జట్టిజాము వేయడం కూడా వాడుకలో ఉంది.
ఒక జట్టిజాం పాట:
కొత్తగా పెళ్ళైన పడుచు జంట. కొత్తపెళ్ళాం పరువంలోని ఒంపుసొంపులకు, ఒయ్యారాలకు, నయగారాలకు మురిసిపోయినాడు ఆ మగడు. వళ్ళు మరచిపోయినాడు. తన సంతోషాన్ని మనసులో దాచుకోలేకపోయినాడు. అందుకే తన ముద్దులభార్య అందాన్ని హద్దు తెలియనంతగా అందంగా, మధురంగా తన మాటల్లో వర్ణించినాడు. తన అందానికి వివశుడై, తన వశమై పోయినాడని తెలుసుకున్న ఆ వగలాడి వాడిని ఎలాంటి కోరికలు కోరిందో, వాడిని చెవులు పట్టి ఎలా ఆడిస్తుందో సున్నితమైన ప్రణయ భావాల హాస్యపు విరిజల్లులు కురిపించే ఈ పాట చూడండి:
*****************************
బృందగేయం - జట్టిజాం పాట - ప్రణయప్రధానం
దాంపత్యప్రణయం
ఖరహరప్రియ స్వరాలు - ఆదితాళం
*****************************
అతడు: తుమ్మేదలున్నాయేమిరా - దాని కురులు
కుంచెరగులపైన - సామంచాలాడేవేమిరా
ఆమె: ఏటికిపోరా - శాపల్ తేరా
బాయికి పోరా - నీల్లూ తేరా
బండకేసి తోమర మగడా
సట్టీ*కేసి వండర మగడా
శాపల్ నాకూ - శారూ నీకూ రా
ఒల్లోరే మగడా! బల్లారం మగడా
బంగారం మగడా... అహ
శాపల్ నాకూ - శారూ నీకూ రా
అహ తుమ్మేద...
ఆమె: కూలికిపోరా - కుంచెడు తేరా
నాలికి పోరా - నల్దుం** తేరా
వత్తా పోతా - కట్టెల్ తేరా
కట్టం నీకు కమ్మల్ నాకూ రా
ఒల్లోరే మగడా! బల్లారం మగడా
బంగారం మగడా...
కట్టం నీకు కమ్మల్ నాకూ రా
తుమ్మేద...
ఆమె: రోలూ తేరా - రోకలి తేరా
రోటి కాడికి నన్నెత్తుకపోరా
కులికి కులికిదంచర మగడా
శాటలకేసి సెరగర మగడా
శాటలకేసి సెరగర మగడా
బియ్యం నాకు - తవుడు నీకూ రా
ఒల్లోరే మగడా! బల్లారం మగడా
బంగారం మగడా...
బియ్యం నాకు - తవుడు నీకూ రా
తుమ్మేద...
ఆమె: రెడ్డీయేమో దున్నను పాయ
రెడ్డీసాని ఇత్తను పాయ
నాల్గుకాల్ల కుందేల్ పిల్లా
నగతా నగతా సంగటి తెచ్చె
సంగటి నాకు - సూపుల్ నీకూ రా
ఒల్లోరే మగడా! బల్లారం మగడా
బంగారం మగడా...
సంగటి నాకు - సూపుల్ నీకూ రా
తుమ్మేద...
*సట్టి(చట్టి) = కుండ
**నల్దుం = నాలుగు తూములు (8 శేర్లు)
మా వూర్లో దీన్ని "జక్కీక" అంటారు.
ReplyDeleteనా బాల్యంలో మా వూర్లో ఓ వైపు మగాళ్ళందరూ చెక్కబజన (చెక్కలు చేతిలో వాయిస్తూ, కళ్ళతో వివిధ రకాలైన అడుగులు వేస్తూ, వలయాకారంగా తిరుగుతూ చేసే భజన) చేస్తే, ఆడాళ్ళందరూ ఈ జక్కీక ఆడేవారు (వలయాకారంగానూ, వాళ్ళచుట్టు వాళ్ళూ మరియు ఇద్దరిద్దరు కలిపి తిరుగుతు వుంటారు). వెన్నెల రాత్రుల్లో దుప్పటి ముసుగేసుకొని అవి ఎంతసేపైనా చూడాలనిపించేది. ఇప్పుడివేవి వూర్లో లేవు, అవి తెలిసిన వాళ్ళు కూడా ఒక్కరొక్కరే జారిపోతున్నారు.
-- ప్రసాద్
http://charasala.wordpress.com
నా చిన్నప్పుడు మా ఊళ్ళో ఇలాంటి ఆటపాటలు ఉండేవి. వెన్నెల రాత్రుల్లో ఆడవాళ్ళు సిర్రాట ఆడేవాళ్ళు. అది ఖోఖో లాంటి ఆట. ఖో అనడానికి బదులు సిర్రి అనేవాళ్ళు. ఇప్పుడు అలాంటి ఆటలు - పాటలు పూర్తిగా కనుమరుగైపోయినాయి. పదేళ్ళ కిందటివరకు మా ఊళ్ళో కనుమ పండుగ ఘనంగా జరిగేది. ఉద్యోగ వ్యాపారాల నిమిత్తం దూరప్రాంతాల్లో ఉంటున్నవాళ్ళు కూడా పండక్కు తప్పనిసరిగా వచ్చేవాళ్ళు. ప్రతి ఇంట్లోనూ బంధుమిత్రుల సందడి ఉండేది. ఇప్పుడు ఆ పండగ కూడా మొక్కుబడిగా సాగుతోంది. గొబ్బిపాటలు పాడడానికి పట్టుమని పదిమంది ఆడవాళ్ళు ముందుకు రావడం లేదు.నాగరికత పెరిగేకొద్దీ సంస్కృతికి ప్రాధాన్యత తగ్గిపోతుందా? నగరాల్లో భవంతులు లేస్తున్నాయి ఒకపక్క. పల్లెటూళ్ళలో సాంస్కృతిక సౌధాలు నేలకూలుతున్నాయింకొకపక్క....మన కళ్ళ ముందే. మనం పురోగమిస్తున్నామా? తిరోగమిస్తున్నామా?
ReplyDeleteA very nice Janapada geyam! Can we have more such?
ReplyDelete