"ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు?" అని అందరికీ తెలిసినా తమ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆరాటం చాలా మందికి ఉంటుంది. అలాంటి వారు భవిష్యదర్శనం కోసం జ్యోతిశ్శాస్త్రానో(రాశిఫలాలు), సంఖ్యాశాస్త్రాన్నో, హస్తసాముద్రికాన్నో, ప్రశ్న చెప్పేవారినో, సోది చెప్పేవారినో, చిలక జోస్యాన్నో నమ్ముతూ ఉంటారు.
చివరి మూడింటినీ వదిలేస్తే మొదటి మూడింటి మీద మార్కెట్లో బోలెడన్ని పుస్తకాలున్నాయి. అంటే వీటిని నమ్మేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారన్నమాట. వీటిలో ఖగోళశాస్త్రం మీద ఆధారపడింది జ్యోతిశ్శాస్త్రం. మనిషి మీద గ్రహాలు, నక్షత్రాల ప్రభావాన్ని అంచనా వేసి చెబుతుంది. మనిషి మీద గ్రహాల ప్రభావం ఉందన్నది సుస్పష్టం. అయితే ఇది మనిషికీ, మనిషికీ మారుతూ ఉంటుంది. ప్రతి అమావాస్య, పున్నమి రోజుల్లో 'వాయి ' (వాయువు) సోకేవాళ్ళు అంటే 'ఫిట్స్ ' వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు - గతంలోనూ, ఇప్పుడూ కూడా! మిగతా రోజుల్లో వాళ్ళు ఆరోగ్యంగానే ఉంటారు. అంటే వాళ్ళ ఆరోగ్యం మీద సూర్యచంద్రుల -కనీసం చంద్రకళల- ప్రభావం ఉన్నట్లే కదా?
ఇంకో ఆసక్తికరమైన విశేషమేమిటంటే రష్యా రాజధాని మాస్కోలోని ఒక ప్రాంతంలో భూమి ప్రతి పౌర్ణమి, అమావాస్య రోజుల్లో ఉబ్బి, కొన్ని గంటల తర్వాత మామూలైపోతుందట. ఇది తెలుగుతో బాటు అనేక భాషల్లోకి అనువదించబడిన "ఖగోళశాస్త్రం-విజ్ఞానం-వినోదం" అనే రష్యన్ పుస్తకంలో ఉంది. రాసింది జ్యోతిష్కులు కాదు. రష్యన్ శాస్త్రవేత్తలు. గ్రహస్థితుల ప్రభావం గట్టినేల మీదే అంత బలంగా కనబడుతున్నప్పుడు సుతి మెత్తని మనిషి మెదడు మీద ఎందుకుండకూడదు?
ఈ గ్రహచారం అప్పుడే పుట్టిన శిశువు మెదడు మీద కలిగించే ప్రభావం ఆ శిశువు భవిష్యజ్జీవితాన్ని శాసిస్తుందని ఒక నమ్మకం. కాదనడమెందుకు? కానీ...
ఆ ప్రభావం ఎలా ఉంటుంది?
ఉన్నా అది పన్నెండు రకాలుగానే ఉంటుందా?
అట్లైతే ప్రపంచంలో పన్నెండు రకాల మనుషులే ఉండాలి కదా?
సాధారణంగా ఎవరి జాతకమైనా సౌరమానంలో ఒకరకంగాను, చాంద్రమానంలో ఇంకొక రకంగాను ఎందుకుంటుంది?
ఇవి సమాధానం లేని ప్రశ్నలు.
ఇంకో చమత్కారమేమిటంటే జాతకాల మీద ఉన్న ఏ పుస్తకమైనా తీసుకోండి. దాంట్లో మీకు తోచిన రాశి (మీ స్వంత రాశే కానక్ఖర్లేదు, ఏ రాశైనా ఫర్వాలేదు)ని ఎంచుకుని ఏముందో పూర్తిగా చదవండి. దాంట్లో కనీసం ఒకటి రెండు అంశాలైనా అచ్చం మీ గురిచే చెబుతున్నట్లనిపిస్తాయి. మీ రాశిలో మీకు వర్తించని అంశాలు కూడా చాలానే ఉంటాయి. ఈ రాశిఫలాలన్నీ తొలితరం జ్యోతిష్కులు తమ కంటికి కనిపించే వాస్తవాలకు, కనబడని గ్రహగతులకు తర్కరహితంగా ముడిపెట్టి రాసినవి. పై పెదవి చీలి ఉండే జన్యుపరమైన లోపాన్ని గ్రహణ దర్శనంతో ముడిపెట్టి గ్రహణం మొర్రి అనడం లాంటివే ఇవి కూడా. అందుకే ఆధారపడదగ్గవి కాదు. (జాతకాల మీదున్న మంచి పుస్తకాల్లో ఒక్కో రాశి కిందా ఒకటి రెండైనా "వ్యక్తిత్వ వికాస" సలహాలుంటాయి. అదొక ప్రయోజనం.)
పూర్వకాలం నుంచి మనవాళ్ళకో నమ్మకముంది. ఉత్తరం వైపు తలపెట్టి ఎప్పుడూ పడుకోవద్దని. దాని వెనకుండే వినాయకుడి కథ ఎలా ఉన్నా ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఆ నమ్మకాన్నే సమర్థిస్తుంది: భూమికి ఉత్తరధృవం, దక్షిణధృవం ఉన్నాయి కదా? ఆ రెండు దిక్కుల్లోనే భూగోళం యొక్క విద్యుదయస్కాంత ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దాని మూలంగా మనం ఉత్తరం వైపు గానీ, దక్షిణం వైపు గానీ తలపెట్టుకుని ఎక్కువసేపు పడుకుంటే భూ-అయస్కాంతక్షేత్ర ప్రభావం వల్ల మనకు నిద్ర లేచిన తర్వాత నీరసంగా, తలదిమ్ముగా ఉండడం, ఉత్సాహం లేకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయట. ఈ విషయం ఒకసారి నేను THE HINDU Science & Technology విభాగంలో చదివాను.
ఇక ఇతర శాస్త్రాలకొస్తే సంఖ్యాశాస్త్రం బొత్తిగా ఆధారపడదగ్గది కాదు. మనం దశాంశమానం కాకుండా అష్టాంశమానాన్ని పాటిస్తే ఏడురకాల మనుషులే ఉండేవాళ్ళు-సంఖ్యాశాస్త్రాన్ని బట్టి చూస్తే. అలాగే షోడశమానాన్ని పాటిస్తే పదహైదు రకాల మనుషులుండేవాళ్ళు. ఇలాంటి శాస్త్రాన్నెలా నమ్మడం? పైన పేర్కొన్న మిగతా పద్ధతులూ అంతే!
మంచి విషయం త్రివ్క్రం గారూ! నా బ్లాగులో రాద్దామనుకున్న ఒక విషయం రాస్తానిక్కడ.
ReplyDeleteసంఖ్యాశాస్త్రం సాయంతో జాతకాలు చెప్పే కార్యక్రమం ఒకటి జీటీవీలో చూసానీమధ్య! మనపేరును ఇంగ్లీషు లిపిలో రాసి, అక్షరానికో అంకె చొప్పున లెక్కలేవో కట్టి, మీపేరులో స్పెల్లింగు బాలేదు.., దాన్ని ఇలాక్కాదు ఇలా అనండి, అంటూ ఉచిత సలహలు పారేస్తూ ఉంటారా జ్యోతిష్యుడు! ఆయన సలహాలు ఇలా ఉంటాయి.. పేరులో ఒకటో రెండో కొత్త అక్షరాలను చేర్చుకోవాలి, కొత్త పేరును ఓ 43 సార్లో 58 సార్లో రాయాలి, అందరిచేతా ఆ పేరుతోటే పిలిపించుకోవాలి... ఇలా ఉంటాయి. మరదే పేరును మన లిపిలో రాసి ఆ ప్రకారం లెక్కవెస్తే కూడా ఇదే ఫలితం వస్తుందా!!?? అసలాయన ఇంగ్లీషులో ఎందుకు లెక్కవేస్తున్నాడు!? అవున్లే, మన 56 అక్షరాలతో కూడికలు తీసివేతలు చెయ్యడం మామూలు విషయం కాదుగదా.. అందుకయ్యుంటుంది!!
జోకేంటంటే.. ఈ వ్యవహారం మొత్తాన్ని నడిపించే లంగరమ్మాయి.. ఇదంతా అయ్యాక ఓ నవ్వు నవ్వుతుంది. ఏమండీ "సుబ్బాపోవు" గారూ మీపేరులో 'రావు'ను 'పోవు' గా మార్చుకుంటే బోలెడన్ని సిరిసంపదలు వచ్చిపడుతున్నాయి గదా.. మరి మీరీ చి..న్న పని చేస్తారు కదూ.. అని ఓ నవ్వు నవ్వుతుంది. నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరిస్తోందేమోనని నా అనుమానం!!
త్రివిక్రమ్, చదువరి ఇద్దరూ మంచి అంశాల్ని స్పృశించారు.
ReplyDeleteఆ ఆరింటినీ నేను నమ్మను. కాని రాశి ఫలితాల్ని చదువుతా. పనిగట్టుకొనికాదు, ఎప్పుడైనా. ఫన్నీగా ఉంటాయి. ఎవరినా స్నేహితులకు చేయి చూస్తానంటే చూపించుకుంటా. అదో కాలక్షేపం.
సంఖ్యా శాస్త్రమైతే నేనెప్పుడు పట్టించుకోను. అయితే, కష్టాల్లో ఉన్నవారికి అదో మంచి diversion (ఉన్న బాధలనే తలచుకొని మరింత కుంగిపోకుండా).
[ఏ రాశి ఫలితాల్లో అయినా] కనీసం ఒకటి రెండు అంశాలైనా అచ్చం మీ గురిచే చెబుతున్నట్లనిపిస్తాయి.
అవును, అది మన (ఇంకా స్పష్టంగా మన మెదడు యొక్క) self-conciousness వల్ల. మనం మనకి సంబంధించిన విషయలనే పట్టించుకుంటాం.
ఈ టపాలోని 'సమాధానాలు లేని ప్రశ్న'లకు కొడవటిగంటి రోహిణీప్రసాద్‌గారిలాంటి విజ్ఞానవేత్తలేమైనా సమాధానం చెప్పగలరేమో అడగొచ్చును.
ReplyDelete