భక్తి అనేది మనం చెడ్డ పనులు చెయ్యకుండా మనలో పాపభీతి కలగడానికి, ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనైనా దేవుడి మీద భారం వేసి ధైర్యంగా నిలవడానికి తోడ్పడితే బాగుంటుంది. అవసరంలో ఉన్నవారిని యథాశక్తి ఆదుకొమ్మని ప్రేరేపిస్తే మరీ బాగుంటుంది.
అలా కాకుండా అది వెర్రి తలలు వేస్తే అసలుకే మోసం వస్తుంది. గొప్ప భక్తుల కథలుగా చాలా కాలంగా ప్రచారంలో ఉన్న ఈ కథల్ని చదివితే నవ్వాలో ఏడవాలో అర్థం కాదు:
1. గుణనిధి కథ: ఈ గుణనిధి అనేవాడు అనేవాడొక దుర్గుణాల నిధి. జీవితమంతా జూదం, దోపిడీలు, వ్యభిచారం తదితర పాపకార్యాలన్నీ చేసి ఒక రాత్రి పొద్దుపోయాక ఒకరిని హత్య చేసి పారిపోతూ ఒక శివాలయంలో దాక్కుంటాడు. ఆ రోజు శివరాత్రట. ఏ క్షణానైనా రక్షక భటులు వస్తారేమోననే భయంతో ఆ రాత్రంతా మేలుకునే ఉంటాడు. ఆరిపోబోతున్న దీపం వత్తిని వెలుతురు కోసం ఎగదోస్తాడు. తర్వాత తనకు తెలియకుండానే అతడు చేసిన పనుల వల్ల శివలింగానికి అభిషేకమో ఇంకొకటో జరుగుతుంది. ఏతావాతా అతడు ఆ ఒక్క రాత్రి తనకు తెలియకుండానే చేసిన పనుల (జాగారము, దీపారాధన, మొ.) వల్ల బోలెడంత పుణ్యం వచ్చి అతడు నేరుగా కైలాసానికే వెళ్ళిపోతాడు.
2. ఇంకొకడి పేరు అజామిళుడని గుర్తు. వాడు కూడా జీవితమంతా పాపాలే చేసి చివరి క్షణాల్లో తన కొడుకును "నారాయణా!" అని పిలుస్తాడు. ఆ పిలుపు విని విష్ణుభటులు వచ్చి వాణ్ణి వైకుంఠానికి తీసుకుపోతారు!
చేసిన తప్పులు తెలుసుకుని పశ్చాత్తాప పడి మంచి మార్గంలోకి మళ్ళితే ప్రయోజనముంటుంది గానీ ఇలా తమ ప్రమేయం లేకుండా జరిగిన పనుల ఫలితాన్ని వాళ్ళకు ఆపాదించి అదే గొప్ప భక్తిగా ప్రచారం చేసేవాళ్ళ గురించి ఏమనుకోవాలో అర్థం కాదు. "చిత్తశుద్ధి లేని శివపూజలేల?" అన్నా వినిపించుకునే వారెవరు?
ఇంకోవైపు ఈ మధ్య కాలంలో భక్తి అనేది పెద్ద ఫాషనైపోయింది. తెలిసి తెలిసీ తాము చేసే తప్పుడు పనులు, తొక్కే అడ్డదారులు ఎక్కువవుతున్న కొద్దీ వ్రతాలు, పూజలు కూడా ఎక్కువవుతాయి. వాటిలో ఏ ఒక్కటైనా ఫలించి తామూ గుణనిధిలాగో, అజామిళుడిలాగో ముక్తిని పొందుదామనే "దురాశ" కూడా ఏ మూలో ఉంటుంది. అందుకే చాలా మందికి దేవుడి మీద కంటే తమ భక్తిని "ప్రదర్శించడం" మీదే శ్రద్ధ ఎక్కువ. పబ్లిసిటీకి వీళ్ళు దాసులు. వ్రతాలు, ఉపవాసాలు ఎక్కువగా చేసేవాళ్ళు (అందరూ కాదు లెండి!), ఉపవాసం పేరు చెప్పి అన్నం ఒక్కటీ మానేసి ఇతర పదార్థాలతో కడుపు నిండా భోంచేసేవాళ్ళు ఈ కోవకు చెందిన వాళ్ళే.
భక్తి పేరుతో మూగజీవుల ప్రాణాలు తీస్తే సంతోషించే దేవతలు మనకి ఉన్నందుకు మనం నిజంగా సిగ్గు పడాలి. ఎందుకంటే సృష్టిలోని సకల చరాచర జీవుల్లో దైవత్వాన్ని చూడగలం మనం. ప్రతి చెట్టు-పుట్టను, రాయి-రప్పను పూజిస్తాం. చేపలు, పందులు సైతం భగవదవతారాలు (దశావతారాల్లో). ఎద్దు, ఎలుక తదితరాలు మన దేవుళ్ళ వాహనాలు. జీవహింస మహాపాపమని వల్లిస్తాం. కానీ అదే దేవుని పేరు చెప్పి ఆ జంతువులనే పాశవికంగా హతమారుస్తాం.
మానవసేవే మాధవసేవని వల్లిస్తాం. అవసరంలో ఉన్న వాళ్ళను ఆదుకోవడం గురించి ఆలోచించం. ఇవన్నీ చూస్తూ కూడా పలకవేమని దేవుణ్ణి అడిగితే వింటూ కూడా ఆయన పలకడు. ఐనా పలకవలసింది దేవుడు కాదండీ మనుషుల్లోని ఇంగితజ్ఞానం మేల్కొనాలి. ఒకసారి పలికితే ఏమవుతుందో ఆయనకు తెలుసు. కొంపదీసి ఆ దేవుడే గనక ఎవరికైనా పలికితే ఈ భక్తులు ఆయన్ని బతకనిస్తారా? సృష్టినే తలక్రిందులు చేసే తమ విపరీతమైన కోరికలతో ఆయనకు పిచ్చెక్కేలా చేయరూ? అందుకే దేవుడెప్పటికీ అలా passive గా ఉండడమే మంచిది.
(పూజలు, వ్రతాలు ఇళ్ళలోనే కాదు గుళ్ళలో కూడా కొందరు పూజారుల వల్ల ఎంత హాస్యాస్పదంగా తయారవుతున్నాయో నా మరో బ్లాగులో చదవండి.)
భక్తిని గురించి ఈ పోస్టులు కూడా చూడండి:
1. భక్తి
2. భక్తి బేసిక్స్
వ్యాసం చాల చక్కగా, సతార్కికంగాను రాసారండి.
ReplyDeleteవివేకానందులవారు అన్నట్లు, మనం దేవుడిని, ప్రాణం లేని రాళ్ళల్లోనూ రప్పల్లోను చూడగలినప్పుదు, అదే దేవుడిని ప్రాణమున్న జీవుల్లో చూడలేమా?
మనుషులను ప్రేమించాలి, వస్తువులను వాడుకోవాలి.అదీ ధర్మం.కాని ఇవ్వాళ రేపు దానికి భిన్నంగా వస్తువుల్ని ప్రేమించడము, మనుషులను ఉపయొగించుకోవడము జరుగుతున్నది.
ఈనాటి భక్తులను, వారి భక్తి తత్పరతలను చూస్తుంటే, భాగవతంలో గజేంద్రుడికి వచ్చిన సంశయమే నాకు వస్తూంది-
‘కలడందురు దీనుల ఎడ
కలడందురు పరమయోగి గుణముల పాలం
గలడందురన్ని దిశలను
గలడు గలండనెడువాడు గలడో లేడో!’ అని.
ఈ టపాలో ప్రస్తావించిన కథల గురించి కౌముది వెబ్ పత్రికలో భక్తిగిరి శీర్షిక నిర్వాహకులైన ప్రముఖ రచయిత వసుంధర ఈనెల (మే 2007) రచన సాహితీవైద్యం శీర్షికలో ఇచ్చిన సమాధానం:
ReplyDelete"లౌకిక దృష్ట్యా చూస్తే మీ కలవరం సబబే. ఐతే శ్రీకృష్ణుడి ప్రేమతత్వమంతటి లోతైన కథలవి. వాటిని నిరసించక గూఢార్థం గ్రహించే ప్రయత్నం చేస్తే నెగిటివ్ దృక్పథం మరుగున పడి పాజిటివ్ దృక్పథం ముందుకొస్తుంది. ఏప్రిల్ 2007 కౌముదిలో ఆ కథలను వివరంగా చర్చించడం జరిగింది. భక్తి తత్వంలోని పాజిటివ్ దృక్పథాన్ని వెలికితీయడమే భక్తిగిరి శీర్షిక ఉద్దేశ్యం. ఎందుకంటే విమర్శకు అతీతంగా అశేష జనావళిని ప్రభావితం చేసిన పురాణకథలవి."
(ఇప్పటికి సరిగ్గా సంవత్సరం కిందట నేను నా బ్లాగులో ప్రస్తావించిన ఈ రెండు కథలనే మార్చి నెల భక్తిగిరిలో ప్రస్తావించడం చూసి ఆశ్చర్యపోయి కాలమిస్టుకు నా సందేహాన్ని ఈమెయిల్ చేశాను. దానికి సమాధానమే పై వివరణ. అందుకు వారికి నా కృతజ్ఞతలు. -3vkrm)
నిజమే,
ReplyDeleteఅన్వయించుకునే మనను బట్టే వుంటే నీతి వుంటే ఇక నీతికోసమే కథ ఎందుకు? సంస్కారి సంస్కారే, నీచుడు నీచుడే అయితే ఇక ఎవర్ని మార్చాలని ఈ కథల ప్రయత్నం? నిగమ శర్మ కథ పామరునికి ఏమి నీతి భోధిస్తుందో అదే కదా ఆ కథనుంచి ఆశించాల్సింది? అలాగాక గూడార్థం చూడుడీ అనడం ప్రకటన పక్కన చుక్క(*)ను చూడమని చెబుతున్నట్లుంది. ప్రకటనదారుకి అలా చుక్క బెట్టి అసలు విశయం రాయడం అవసరం గానీ నీతి బోధకులకెందుకు?
(కౌముదిలో ఆ కథనం చదువుతూ వుంటే శ్రీ రాం గారి "ఓం శాతిః శాతిః" గుర్తొచ్చింది. రెండింటి శైలి ఒకేలా వుంది.)
--ప్రసాద్
http://blog.charasala.com
ఇలాంటి వాటి నుండి పుట్టిందే ఇంకో కథ. దీన్ని చూడండి.
ReplyDeletehttp://vihaari.blogspot.com/2006/10/blog-post_243.html
-- విహారి
ఈ కథల గురించి ఇలాంటి సందేహాలు, ఇంకేవో సమాధానాలు తోస్తూ ఉంటాయి, తొలుస్తూ ఉంటాయి మనసులో.
ReplyDeleteఅయితే, చిన్నప్పుడు ఈ రెండు కథలూ చెప్పేటప్పుడు గుళ్ళో పండితులు గారు ఈ మాట కూడా చెప్పే వారు.
"చనిపోయే ముందు దేవుడి పేరు తలుచుకుంటే పాపాలన్నీ హరించుకు పోతాయి. కానీ, అలా చెయ్య గలిగే అవకాశం వస్తుందో రాదో తెలియదు కదా. అందువల్ల బ్రతికి ఉండగా పాపపు పనులు చెయ్య కూడదు, భగవన్నామం మరవ కూడదు" అని. నా విషయంలో మటుకు ఆ warning బాగా ముద్ర వేసుకుంది.
ఇది సమర్థనా కాదా అని నన్ను అడగొద్దు. ఇలాంటి విషయాలలో నేనిప్పుడు సందిగ్ధావస్థలో ఉన్నాను. గుర్తుకు వచ్చిన విషయం రాశాను అంతే.