మనం భూమి మీదనుంచి చూసినప్పుడు సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రాలు భూమి చుట్టూ దాదాపు వృత్తాకార కక్ష్యలో తిరుగుతున్నట్లు కనిపిస్తాయి. ఈ ఊహాజనిత కక్ష్య వెంబడి పన్నెండు నక్షత్రాల గుంపులను గుర్తించారు. ఈ నక్షత్రాల గుంపులు ఒక్కొక్కటి ఒక్కో ప్రత్యేకమైన ఆకారంలో కనిపిస్తాయి. ఆ ఆకారాలను బట్టి వాటికి మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం అని పేర్లు పెట్టారు. సూర్యుడు ఈ రాశి చక్రాన్ని చుట్టి రావడానికి ఒక సంవత్సర కాలం పడుతుంది. (నిజానికి ఇది భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలం.) అంటే సూర్యుడు ఒక సంవత్సరకాలంలో పన్నెండు రాశుల్ని దాటి మొదటికి వస్తాడన్నమాట. అంటే ఒక్కో నక్షత్ర రాశిలోనూ దాదాపు ఒక్కో నెల ఉంటాడు. ఇది సౌర మానం.
ఇక చంద్రుడు నెల రోజుల్లోపే (ఇంకా చెప్పాలంటే 27-28 రోజుల్లోనే) రాశి చక్రాన్ని చుట్టి వస్తాడు. అంటే భూమి చుట్టూ తిరిగేసి వస్తాడు. ఈ 27 రోజుల స్వల్ప కాలంలో చంద్రుడు ఎప్పుడు ఏ రాశిలో ఉన్నదీ గుర్తించేదెలా? అనేదొక సమస్య. ఈ సమస్యను తీర్చడానికన్నట్లు రాశి చక్రం చుట్టూ తిరిగేటప్పుడు చంద్రుడు ఒక్కో రోజు ఒక్కో నక్షత్రానికి దగ్గరగా వస్తాడు. ఇలాంటి నక్షత్రాలను ఇరవై ఏడింటిని గుర్తించారు. అవి:
అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆర్ద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మఘ పుబ్బ(పూర్వ ఫల్గుణి) ఉత్తర(ఉత్తర ఫల్గుణి) హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ఠ శతభిషం పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర రేవతి
చంద్రుడు రాశి చక్రం వెంబడి గల ఈ 27 నక్షత్రాలను ఒక్కసారి చుట్టి వచ్చాడంటే 12 రాశుల రాశి చక్రాన్ని చుట్టి వచ్చినట్లే. ఈ 27 నక్షత్రాల పరిధి 12 రాశులలో పరుచుకుని ఉంటుందన్నమాట. ఒక్కో నక్షత్ర పరిధిని నాలుగు భాగాలు (పాదాలు)గా విభజిస్తే మొత్తం 108 పాదాలవుతాయి. ఈ 108 నక్షత్ర పాదాలు 12 రాశులలో ఉన్నాయని గుర్తుంచుకుంటే ఒక్కో రాశిలో 108/12 = 9 నక్షత్ర పాదాలున్నట్లు సుళువుగా ఊహించవచ్చు. ఆ విభజన ఇలా ఉంటుంది (మొత్తం అంటే '4 పాదాలు' అని అర్థం చేసుకోవాలి):
మేషం: అశ్విని మొత్తం, భరణి మొత్తం, కృత్తిక 1వ పాదం
వృషభం: కృత్తిక 2వ, 3వ, 4వ పాదాలు, రోహిణి మొత్తం, మృగశిర 1వ, 2వ పాదాలు
మిథునం: మృగశిర 3వ , 4వ పాదాలు, ఆర్ద్ర మొత్తం, పునర్వసు 1వ, 2వ ,3వ పాదాలు
కర్కాటకం: పునర్వసు4వ పాదం, పుష్యమి మొత్తం, ఆశ్లేష మొత్తం
సింహం: మఘ మొత్తం, పుబ్బ(పూర్వ ఫల్గుణి)మొత్తం, ఉత్తర(ఉత్తర ఫల్గుణి)1వ పాదం
కన్య: ఉత్తర(ఉత్తర ఫల్గుణి) 2వ,3వ,4వ పాదాలు, హస్త మొత్తం, చిత్త 1వ,2వ పాదాలు
తుల: చిత్త 3వ,4వ పాదాలు, స్వాతి మొత్తం, విశాఖ 1వ, 2వ, 3వ పాదాలు
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ మొత్తం, జ్యేష్ఠ మొత్తం
ధనుస్సు: మూల మొత్తం, పూర్వాషాఢ మొత్తం, ఉత్తరాషాఢ 1వ పాదం
మకరం: ఉత్తరాషాఢ 2వ,3వ,4వ పాదాలు, శ్రవణం మొత్తం, ధనిష్ఠ 1వ,2వ పాదాలు
కుంభం: ధనిష్ఠ 3వ,4వ పాదాలు, శతభిషం మొత్తం, పూర్వాభాద్ర 1వ, 2వ, 3వ పాదాలు
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర మొత్తం, రేవతి మొత్తం.
ఇది చాంద్ర మానం.
bhale bhale...entha chakka ga chepparu...inni rojulugaa veeti gurinchi aalochisthunna intha chakka ga vishadeekarinchindi meere...dhanyavaadhalatho...
ReplyDeleteభలె భలె ఎంత చక్కగా చెప్పారు
ReplyDeletemottam anni post lu chadivanu.chala info icharu.really great andi.
ReplyDelete