Sunday, 16 April 2006

కృష్ణ లీలలు

కృష్ణతత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం ఎవరి వల్లా అయే పని కాదు. ఒక్కొక్కరికి ఒక్కో సందర్భంలో ఒక్కో విధం గా గోచరిస్తూ ఉంటుంది. "యదా యదాహి ధర్మస్య..." అన్న నోటితోనే చివరాఖరి మాటగా "సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజః..." (18 వ అధ్యాయం 66 వ శ్లోకం) అనడం మామూలుగా చూస్తే ధర్మగ్లానికి దన్నుగా నిలిచినట్లే అనిపిస్తుంది. కానీ ఇక్కడ సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే విధి నిర్వహణలో పుత్ర ధర్మం, భ్రాతృ ధర్మం, స్నేహ ధర్మం, శిష్య ధర్మం, మొ. వాటిని వదిలేసి నడచుకోమని కదా అర్థం?

అలాగే గోపిక లను జీవాత్మలుగానూ, వారి కుటుంబాలతో వారికి గల అనుబంధాలను ఆత్మకు జీవుడితో గల బంధాలు గానూ, వారికి కృష్ణుడి పై గల ప్రేమను జీవాత్మ (భవబంధాలను వదిలించుకుని) పరమాత్మలో లీనం కావడానికి చేసే ప్రయత్నంగానూ అనుకుంటే అబ్బురమనిపిస్తుంది. కృష్ణుడు గీతాబోధ చేసినప్పుడు గురువులకే గురువై, జ్ఞాన బోధ చేసిన బ్రాహ్మణుడైనాడు. బాణాసురుడి లాంటి వాళ్ళతో యుద్ధం చేసినప్పుడు క్షాత్ర తేజంతో వెలిగాడు. వైశ్యులు చేయదగిన రాయబారం తాను వహించి వైశ్యుడైనాడు. చివరికి బావ బండి (రథం) తోలి పెట్టి శూద్ర ధర్మమూ పాటించాడు. ఎందుకు? ఏ ధర్మమూ (విధి నిర్వహణ) తక్కువది కాదు. అని చెప్పడానికి... కాదు కాదు చేసి చూపడానికి.

లీలామానుష విగ్రహుడైన ఆయన "ఎంతవారలైనా అనువుగాని చోట అధికులమనరాదు" అని మనకు చెప్పడానికే కొన్ని కొన్ని సందర్భాలలో పైకి అమాయకంగానూ, పిరికిగానూ కనిపించినట్లనిపిస్తుంది. తాను పుట్టిన కొన్ని నిమిషాల్లోపే యమునా నదిని చీల్చి దారి చేసుకున్న వాడు అంతకు కాసేపటి క్రితమే చిద్విలాసంగా చూస్తూ తన సమక్షంలోనే వసుదేవుడి చేత గాడిద కాళ్ళెందుకుపట్టించాడు? వసుదేవుడి ఉదంతమూ, జరాసంధుడి ఉదంతమూ అనువుగాని చోట అధికులమనరాదు అని మనకు చెప్పడానికే తప్ప ఆయన వల్ల కాక కాదు - అని నా అభిప్రాయం. ఇక ఈ బ్లాగులో మొదటి పోస్టెందుకలా వ్రాశానంటారా?

తన భక్తుల చేత అప్పుడప్పుడూ నిందలు పడడం కూడా ఆయనకు వినోదమే అనిపిస్తుంది. "ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు?" అని తిట్టినప్పుడు రాముడి రూపంలో ముసి ముసి నవ్వులు ఒలకబోసిందీ ఆయనే. ఇక ఆయన చేసిన పనుల్లో మామూలుగా అర్థం కానివి, అయోమయంగా అనిపించేవి అక్కడ వ్రాశాను. పాండవుల చేత అధర్మ యుద్ధం చేయించడము, కర్ణుడి విషయంలో అన్యాయంగా ప్రవర్తించడము ఇప్పటికీ నాకు అర్థం కాని విషయాలే.

P.S.: And the best thing about our epics is that they are open to a thousand interpretations.

No comments:

Post a Comment