Thursday, 2 March 2006

భాష-సంస్కృతి

కె.ఆర్.నారాయణన్ గారు రాష్ట్రపతిగా ఉన్న రోజుల్లో ఒకసారి చైనా కు వెళ్ళినప్పుడు వాళ్ళు విందులో వడ్డించిన పాయసం తినడానికి ఆయనకు చాప్ స్టిక్స్(chop sticks) అనే పుల్లలు ఇచ్చారట. ఆయన వాళ్ళ మర్యాదలకు ఓ దండం పెట్టి, "బాబూ, నేను ఇంటి దగ్గర వేళ్ళతో తినడానికే అలవాటు పడ్డవాణ్ణి. మీరివేవో పుల్లలిచ్చారు. వీటితో తినడం నా వల్ల కాదు." అని చెప్పేశారట. ఈ విషయం కొన్నేండ్ల క్రిందట నేను ఫ్రంట్ లైన్ లో చదివాను.

ఇక ఇది చదవండి:

చిన్న పిల్లలకు ఆంగ్లంలో ఉన్నన్ని వైవిధ్య భరితమైన, ఆకర్షణీయమైన పుస్తకాలు తెలుగులో లేవు. ఈ మధ్య మా అన్న వేలు పోసి పిల్లల కోసం ఒక ఆంగ్ల పుస్తకాల సెట్టు కొన్నాడు. వాటిలో వైజ్ఞానిక విషయాలు నాకు చాలా బాగా నచ్చాయి. ముందుగా ఆ సెట్టు లోనే మొదటి కథల పుస్తకం తీసి దాంట్లోని మొదటి కథను పిల్లల చేత చదివిస్తూ, అర్థం వివరిస్తూ ఉన్నాను. అయితే చివరకొచ్చే సరికి ఆ కథ సారాంశం నన్ను కలవరపాటుకు గురి చేసింది. ఇంతకూ ఆ కథలో రెండు అడవి జంతువులు పాయసం లాంటిది చేసుకుని తినబోతాయి. ఐతే సమయానికి చెంచాలు కనబడవు. చెంచా లేకుండా చేత్తో తినడం అత్యంత హేయమైన , ఘోరమైన, నీచమైన పనిగా భావించిన ఆ అడవి జంతువులు చెంచాల కోసం తీవ్రంగా గాలించి చెంచాలతోనే తింటాయి.
చిన్న పిల్లలకు చెప్పడానికి ఇంతకంటే లోకోత్తరమైన విషయాలు ఇంకేమీ లేవా? మిగిలినవేవీ దీని కంటే ముఖ్యమైనవీ, ముందు తెలుసుకోదగ్గవీ కావా? కత్తులూ కఠార్లూ వాడకుండా ఉత్త చేతుల్తో తినే వాళ్ళు పరమ అనాగరికులని అడవి జంతువుల చేత అనిపించాలా? మనమందరమూ తినేది చేతులతో కాదా? ఆ పుస్తకాలు ప్రత్యేకంగా "For sale in India" అట!

నేను అప్పుడప్పుడూ మాత్రమే చదివే రీడర్స్ డైజెస్ట్ లో 2005 ఫిబ్రవరి నెలలో "వర్డ్ పవర్" శీర్షిక లో (ఈ శీర్షిక చాలా ప్రసిద్ధి చెందింది - అసలు ఈ సంచిక నేను చదవలేదు గానీ తర్వాత మే నెలలో లెటర్స్ ఫ్రమ్ రీడర్స్ లో దాని గురించి రేగిన దుమారం చదివాను) bumpkin(=An awkward, unsofisticated person) అనే ఇంగ్లీషు పదానికి అర్థం వివరిస్తూ "What sort of bumpkin eats with his hands?" అని వ్రాశారట . భారతీయ పాఠకులు తీవ్రంగా మండిపడే కొద్దీ ఆ వాక్యాన్ని కళ్ళు మూసుకుని ప్రచురించిన భారతీయ సంపాదకులు స్వయంగా వేడుకున్నారు - అలాంటి విషయాలు చూసుకోకుండా ప్రచురించడం తప్పేననీ తాము కూడా సగటు భారతీయుల్లాగే చేతుల తోనే తింటామనీ.

ఇప్పుడు ఆలోచించండి:

మన పద్ధతులు, ఆచారాలు, అలవాట్ల మీద సాహిత్యం రూపంలో గానీ, మీడియా ద్వారా గానీ ఇంత నేరుగా, ఇంత తీవ్రంగా దాడి జరుగుతున్నా మనం పట్టించుకోవడం లేదు. ఈ దాడి ఫలితంగా మనమే ఒకరకమైన ఆత్మన్యూనతకూ, అభద్రతాభావానికీ గురవుతున్నాం. అందుకే మనం ఎక్కడికి వెళ్ళినా మన అలవాట్లు, ఆచార వ్యవహారాలు అవతలి వాళ్ళకు విడ్డూరంగా లేదా అనాగరికంగా కనిపిస్తాయేమో ననే ఆలోచనతో ముందుగా అక్కడివాళ్ళ లాగే ప్రవర్తించడానికి, వ్యవహరించడానికి తంటాలు పడుతూ, దానికి ఫ్లెక్సిబిలిటీ అని ముసుగు తొడుగుతున్నాం. దాని మూలంగా అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటాం. (మీలో వీలున్న వాళ్ళు యండమూరి కథ 'మిస్ట్' ఒకసారి చదవండి. ఇది 'ది బెస్ట్ ఆఫ్ యండమూరి' కథా సంపుటిలో నూ, 'కథాసాగర్' సంకలనం లోనూ ఉంది.) ఒక్కో సారి అపహాస్యం పాలవుతూ ఉంటాం. పార్లమెంటుకైనా పరలోకానికైనా పంచెతో వెళ్ళగలిగేది తమిళుడొక్కడే. హైదరాబాదులో నేను ఎప్పుడైనా లుంగీ మీద ఇంటి గేటు దాకా వస్తేనే జానెడు నిక్కర్లతో ఊరంతా తిరగ్గలిగే నా స్నేహితులు భయం భయం గా దిక్కులు చూస్తారు-ఈ అనాగరికుడి పక్కన తాము నిలబడ్డం మూడో మనిషి గమనిస్తే ఎంత ప్రమాదం/నగుబాటు? అన్నట్లు.

"కాన్వెంటు బళ్ళలో పిల్లలు నేర్చుకునేది పచ్చి విజాతీయ సంస్కృతి, పనికి మాలిన జీవిత దృక్పథాలు, మతబోధలు. వీరి కంటే పారా పలుగూ పట్టుకుని పని చేసే వారే దేశ భవిష్యత్తుకు నిజమైన పునాదులు తవ్వుతున్నారు." - కొడవటిగంటి కుటుంబ రావు
భారత దేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశ పెట్టడం ద్వారా భారతీయుల అభిప్రాయాలు, ఆచారవ్యవహారాలను సమూలంగా మార్చివేసి వారిని ఆంగ్ల సంస్కృతికి బానిసలుగా మార్చివేయాలని మెకాలే భావించాడు. (Macaulay wanted to create "a class of persons, Indian in blood and colour, but English in taste, in opinions,.." by introducing English in India.) ఇప్పుడు మన కళ్ళెదురుగా జరుగుతున్న దాడి దానికి తీసి పోయిందా? కానీ ఈ విషయంలో మనమేం చేస్తున్నాం? మనకు ఆరోగ్యవంతమైన తిండి మనల్ని తిననివ్వకుండా పిజ్జాలు, బర్గర్ల పేరుతో అడ్డమైన గడ్డి మన నోట్లో కుక్కి (ఇది నా వ్యక్తిగత అనుభవం - ఒక ఆదివారం రాత్రి అమీర్ పేటలో తినడానికి పిజ్జాలు, బర్గర్లు తప్ప మరేమీ దొరకలేదు. ఇంకోసారి ఒక పంచ తారల ఆసుపత్రి క్యాంటీన్ లోనూ అదే పరిస్థితి) మనకు సౌకర్యంగా ఉండే బట్టలు మనని కట్టుకోనివ్వకుండా మన సాంస్కృతిక వారసత్వాన్ని గురించి మనమే కించ పడేలా చేస్తున్న సాంస్కృతిక దాడినెలా ఎదుర్కోవాలి?
We should keep the window open to let fresh breeze coming from all directions but should not allow ourselves to be swept away. We should learn English but that should not result in a change in our habits, opinions, or our way of living.

1 comment: