అవీ-ఇవీ

నేను పురాణాలు బ్లాగులో రాసిన టపాలను కూడా ఇప్పుడు మీరు ఇక్కడే చదవొచ్చు.

Monday, 2 February, 2009

దేవుని కడపనొక కంట చూడు దేవా!

దేవుని కడప శ్రీలక్ష్మీవేంకటేశ్వరాలయ ప్రధాన గోపురం

తిరుమలేశుని తొలిగడపగా ప్రఖ్యాతి పొందిన దేవాలయం దేవుని కడప శ్రీలక్ష్మీవేంకటేశ్వరాలయం. అంతేకాదు, దక్షిణ ప్రాంత యాత్రికులు కాశీ వెళ్లడానికీ ఉత్తర భారతదేశ యాత్రికులు రామేశ్వరం వెళ్లడానికీ తిరుమల వేంకటేశ్వరుని వద్దకు కాలిబాటన వెళ్లడానికీ కడపే ప్రధాన మార్గం. ఈ కారణంగా మూడుచోట్లకూ వెళ్లే భక్తులు కచ్చితంగా ఇక్కడ మొదటిగా శ్రీ లక్ష్మీప్రసన్న వేంకటేశ్వరుణ్ణి, సోమేశ్వరస్వామిని దర్శించుకుని అనంతరం మూడు క్షేత్రాలకు వెళ్లేవారు. ఈ కారణంతోనే మూడు పుణ్యక్షేత్రాల తొలి గడపగా దేవునికడపను పేర్కొంటారు. ఇక్కడి దైవం ఏడుకొండల వేంకటేశ్వరునికి ముమ్మూర్తులా ప్రతిబింబంలా కనిపించే శ్రీ లక్ష్మీప్రసన్న వేంకటేశ్వరుడు. తిరుమల శ్రీవారి మాదిరిగానే ఇక్కడ కూడా స్వామివారి వక్షస్థలంపై కుడివైపు మహాలక్ష్మి కొలువై ఉంది.

తిరుమలలోని శ్రీవారి దర్శనార్థం వెళ్ళే భక్తులు ముందు దేవుని కడపలో స్వామివారి దర్శనం చేసుకుని ఆ తర్వాతే తిరుమలకు వెళ్ళడం ఆచారం. రవాణా సౌకర్యాలు ఇప్పుడున్నంతగా అభివృద్ధి చెందని రోజుల్లో భక్తులు తిరుమల మొక్కులు కూడా ఇక్కడే చెల్లించుకునేవారు. ఇక్కడ చెల్లించే మొక్కులు, కానుకలు సాక్షాత్తూ తిరుమలలోని స్వామివారి సన్నిధిలో చెల్లించినట్లుగా స్వామివారు ప్రీతి చెందుతారు. అంతటి ముఖ్యమైన దేవస్థానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోకి తీసుకువచ్చినప్పుడు భక్తులంతా ఎంతగానో సంతోషించారు. ఈ దేవస్థానం కూడా బాగా అభివృద్ధి చెందుతుందని ఆశించారు. ఐతే గత ఆగస్టులో అక్కడికి వెళ్ళిన మేము అక్కడి వాస్తవ పరిస్థితులను, దేవస్థానం వారి నిర్లక్ష్యాన్ని, సాక్షాత్తూ దేవాలయంలో నెలకొన్న దుర్భరమైన అపరిశుభ్ర వాతావరణాన్ని చూసి దిగ్భ్రాంతి చెందవలసి వచ్చింది. ఇంతటి ప్రాశస్త్యం గల దేవాలయం, అందునా ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేస్తున్న సొంత జిల్లా కేంద్రంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం అంతటి దయనీయమైన స్థితిలో ఉన్నందుకు ఆవేదన కలిగింది.

"Cleanliness is next to Godliness" అంటారు. మన సంప్రదాయాలు, మడీ-దడీ-ఆచారాలు కూడా శుభ్రతకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఏర్పాటు చేసుకున్నవే. శుచి-శుభ్రత లేనిచోట దరిద్రం తాండవిస్తుందని మన నమ్మకం. కానీ మేం వెళ్ళినప్పుడు ఇక్కడ అడుగడుగునా అపరిశుభ్రతే కనిపించింది. గర్భగుడి చుట్టూ భక్తులు ప్రదక్షిణం చేసే అంతరాళంలో గర్భగుడి గోడల వెలువలివైపున, నేల మీద ఎంగిళ్ళు, వక్కాకు చారికలు, బీడీ ముక్కలు, ...అది చూసి తట్టుకోలేక ప్రదక్షిణాలు గబగబా ముగించుకుని ఇవతలికి వచ్చేశాం.

పేరుకు ఇక్కడ ఒక అద్దాల మండపం కూడా ఏర్పాటు చేశారు కానీ దాని అతీ గతీ పట్టించుకునే నాథుడే లేడు. ప్రవేశద్వారం దగ్గర "ప్రవేశరుసుము 2 రూపాయలు" అని ఉంది. కానీ లోపలికి వెళ్ళాలనుకునేవారికి టిక్కెట్లు అమ్మేవాళ్ళుగానీ, టిక్కెట్లను తనిఖీ చెయ్యడానికి గానీ దరిదాపుల్లో ఎవరూ లేరు. చివరికి లోపలికివెళ్ళినవాళ్ళు అద్దాలన్నిటినీ పగలగొట్టి వచ్చినా పట్టించుకునే దిక్కులేదనడానికి ప్రత్యక్ష తార్కాణం అక్కడే మా కళ్ళబడింది. ఆ అద్దాల మండపం ద్వారం దగ్గర పాలరాతితో ఏర్పాటుచేసిన మెట్లను (సోపానాలను) ఎవరో రాళ్లతో తుక్కుతుక్కుగా నలగ్గొట్టిపెట్టారు. మరీ ఒక మెట్టు మీదైతే పాలరాయి ఒకవైపు అడుగు వ్యాసంలో పూర్తిగా పొడిపొడిగా మారిపోయి ఉంది. అక్కడి నుంచి అన్ని వైపులకూ చివరి దాకా నెర్రెలు చీలి ఉన్నాయి. నలగ్గొట్టడానికి వాడిన రాయి కూడా ఫుట్ బాల్ సైజులో ఆ మెట్టుమీదే ఉంది! ఆలయ నిర్వాహకులు ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉండగలుగుతారసలు?

ఇవన్నీ చూశాక "సీతారామస్వామీ! నువు చేసిన నేరంబేమి" అనిపించకమానదు. ఆ దేవుడే మొరబెట్టుకున్నా మన ఏలినవారి చెవులకెక్కవుగదా? ఇక మన (ఆ)వేదనలు వినిపిస్తాయా? సొంతజిల్లాలో కోట్లు ఖర్చుబెట్టి వారు చేస్తున్న అభివృద్ధి ఫలాలు అస్మదీయులకేనా? అనిపించి అక్కడ లభించే తిరుపతి లడ్డు తిన్న తర్వాత కూడా నోరంతా చేదుగా అనిపించింది.

ఈ ఆలయానికి సంబంధించి కొన్ని విశేషాలు:

    తిరుమల వరాహక్షేత్రం కాగా ఇది హనుమక్షేత్రం. ఆంజనేయస్వామి ఇక్కడి క్షేత్రపాలకుడు.

    ఇక్కడ స్వామివారి విగ్రహాన్ని మహాభారతంలో కౌరవుల కులగురువైన కృపాచార్యులు ప్రతిష్ఠించారని అంటారు.కాబట్టే ఈ ప్రాంతానికి కృపాపురం అనే పేరు వచ్చిందంటారు. కాలక్రమంలో అది కురుప, కరిపె, కరిగె గా రూపాంతరం చెందిందనీ అదే కడపగా మారి ఉండొచ్చనీ చరిత్రకారుల అంచనా. (క్రీ.శ. రెండవ శతాబ్దంలో టాలెమీ కడపను కరిపె, కరిగె అని పేర్కొన్నాడు. పేరులో కరి అని ఉంది కాబట్టి ఇక్కడ ఆ కాలంలో ఏనుగులు ఎక్కువగా ఉండేవంటారు.)

    ఐతే ఇక్కడ అంతకుముందునుంచే ఆంజనేయస్వామి క్షేత్రం, హనుమత్ పుష్కరిణి ఉండేవని, స్వామివారి స్వప్నసందేశాన్ననుసరించి స్వామివారిని ప్రతిష్ఠింపజేయడానికి ఈ స్థలం అనువైనదిగా నిర్ణయించినది జనమేజయ మహారాజు అని, శ్రీవారి విగ్రహానికి వెనుక వైపున గోడలో ఆంజనేయుడి ప్రతిమ రాతిలో కనిపిస్తుందని "మనకు తెలియని కడప" గ్రంథంలో శశిశ్రీ రాశారు.

    ఆలయ ప్రాంగణంలో ఆండాళమ్మ, విష్వక్సేన, పద్మావతి అమ్మవారు, శంకచక్ర ధ్వజగరుడ అళ్వారు, హన్మత్‌పెరుమాళ్లు, నృత్యగణపతి... తదితర దేవీదేవతలు కొలువై ఉన్నారు.

    దేవుని కడప ఆలయ కోనేటిని హరిహర సరోవరమని, హనుమత్‌ పుష్కరిణి అని పిలుస్తారు. కొలనులో నిరయ మంటపం, తీర్థవాశి మంటపం ఉన్నాయి. పాతకడప చెరువు నుంచి ఇక్కడికి నీటి మార్గం ఉంది. పుష్కరిణిలో స్వామి తెప్పోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు.

    ఏటా ధనుర్మాసంలో ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. ఇక ప్రతి ఏడాదీ మాఘశుద్ధ పాడ్యమి(ఈ ఏడాది జనవరి 27) నుంచి ఏడురోజుల పాటు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అన్ని మతాలకు చెందిన భక్తులు పాల్గొంటారు.

    మరో విశేషమేమిటంటే ఈ ఆలయ ఆవరణలో ఉన్న వినాయకుడికి నిలువునామాలుంటాయి.

ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే గాక కేంద్ర ప్రభుత్వం కూడా కడపజిల్లాలోని పర్యాటక కేంద్రాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. పర్యాటకులను విశేషంగా ఆకర్షించగల ఇంత గొప్ప పుణ్యక్షేత్రంలో ఆలయప్రాంగణం ఎల్లవేళలా శుభ్రంగా ఉంచడం నిర్వాహకుల కనీస ధర్మం.
-శ్రీదేవి & త్రివిక్రమ్


ఈరోజు దేవుని కడప బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం జరుగుతుంది. ఏటా రథసప్తమి నాడు జరిగే రథోత్సవం, కల్యాణోత్సవం, గరుడవాహన సేవలో పాల్గొనడానికి భక్తులు వేలాదిగా తరలివస్తారు. దేవుని కడప రథోత్సవం గురించి
"కన్నుల పండుగ లాయే కడప రాయని తేరు
మిన్ను నేల శృంగారము మితిమీరినట్లు"
అన్నాడు అన్నమయ్య.

Wednesday, 12 November, 2008

తెలుగు పతాక ఆవిష్కరణ, తెలుగు శాసనాల మ్యూజియం

సి.పి.బ్రౌన్ 210వ జయంతి సందర్భంగా నేడు సి.పి. బ్రౌన్ భాషాపరిశోధక కేంద్రంలో తెలుగు పతాకం ఆవిష్కరణ జరుగుతోంది. భారత జాతీయ పతాకాన్ని రూపొందించిందే ఒక తెలుగువాడైనప్పుడు ఆ తెలుగువారి పతాకం ఇంకెంత గొప్పగా ఉంటుందో చూడాలనే ఆసక్తితో తెలుగు నేలకు వచ్చి నిరాశ చెందిన సి.పి. బ్రౌన్ చుట్టం గురించి జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి గారి కథ "తెలుగు పతాకం" నిరుడు సాహిత్యనేత్రం నిర్వహించిన కథల పోటీలో ద్వితీయ బహుమతి పొందింది. తెలుగు భాష ప్రస్తుత స్థితిని, ప్రసార మాధ్యమాల్లో తెలుగు స్థాయిని చక్కగా విశదీకరించిన ఆ కథను, ఆయన ఆ కథ రాయడం వెనకున్న నేపథ్యం గురించి మీరు చదివే ఉంటారు. ఇప్పుడు అలాంటివారు నిరాశ చెందకుండా మనం వారికి తెలుగు పతాకాన్ని చూపించొచ్చు. ఈ ఆవిష్కరణోత్సవానికి ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి, సాహిత్యనేత్రం సంపాదకులు శశిశ్రీ, శ్రీకృష్ణదేవరాయ, యోగి వేమన విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సెలర్లు హాజరౌతున్నారు. ఈనాడులో వచ్చిన వార్త:


నేడు తెలుగు పతాక ఆవిష్కరణ
కడప నగరం, న్యూస్‌టుడే : తెలుగుభాషకు ప్రాచీన హోదా లభించిన నేపథ్యంలో బ్రౌన్‌ 210వ జయంతిని పురస్కరించుకొని బ్రౌన్‌ గ్రంథాలయంలో బుధవారం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వీసీ రామచంద్రారెడ్డి చెప్పారు. ఈసందర్భంగా తెలుగు పతాకాన్ని ఆవిష్కరించనున్నామన్నారు. సాయంత్రం 6 గంటలకు సభ మొదలువుతుందని ముఖ్యఅతిథిగా శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వీసీ పి.కుసుమకుమారి రానున్నారన్నారు. విశిష్ఠ అతిథిగా కలెక్టర్‌ ఎం.టి.కృష్ణబాబు, గౌరవ అతిథులుగా డా. జానుమద్ది హనుమచ్ఛాస్త్రి, ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి, శశిశ్రీ హాజరవుతున్నారు. గ్రంథాలయానికి పుస్తకాలు ఇచ్చిన వారిని సత్కరించనున్నామని చెప్పారు. ఇంకా విలేకరుల సమావేశంలో తెలుగుభాష పరిశోధకుడు కట్టా నరసింహులు, పీఆర్వో డా. మూలె మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు.

బ్రౌన్ జయంతిని పురస్కరించుకొని కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయంలో సి.పి. బ్రౌన్ మెమోరియల్ సెంటర్, తెలుగు శాసనాల మ్యూజియం కూడా నెలకొల్పుతున్నారు. తెలుగుకు ప్రాచీన భాషగా గుర్తింపు వచ్చిన నేపథ్యంలో సి.పి. బ్రౌన్ మెమోరియల్ సెంటర్ ప్రాచీన భాషా పరిశోధనాకేంద్రంగా పనిచేస్తుందని, విశ్వవిద్యాలయం బ్రౌన్ రచనలన్నింటినీ ఆధునీకరించి, డిజిటైజ్ చేస్తుందని, ఇందుకోసం బ్రౌన్ లేఖలు, డైరీలను చెన్నై మ్యూజియం నుంచి ఇక్కడికి తెప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని యోగి వేమన విశ్వవిద్యాలయం వీసీ ఆర్జుల రామచంద్రారెడ్డి చెప్పారు. వివరాలు హిందూలో.

Thursday, 16 October, 2008

జ్ఞాన పీఠం

"జ్ఞాన పీఠ అవార్డు ఇవ్వడానికి తెలుగు భాషను పరిశీలించే సమయం వచ్చింది" అన్నారు 'చంద్రిమ' బ్లాగులో రాసిన జ్ఞాన పీఠము తెచ్చినారము జ్ఞానులెవ్వరొ తెలుపుడీ! టపాలో చంద్రమోహన్ గారు.

నాకు తెలిసి అలాంటిదేమీ లేదు, ఒకసారి ఒక భాషవారికి ఇచ్చాక మూడు సంవత్సరాల పాటు ఆ భాషను పరిశీలించరు. అంటే గత మూడేళ్లలో అవకాశం రాని భాషలన్నిటికీ "సమయం" వచ్చినట్లే. నిన్న మొన్నటి దాకా భారతదేశంలో ఇతర భాషల్లో అసలు మంచి సాహిత్యమే రానట్లు దాదాపు ప్రతి మూడేళ్లకొకసారీ జ్ఞానపీఠాన్ని ఆనవాయితీగా ఎగరేసుకుపోతూ వచ్చిన కన్నడిగుల మీద నా ఉక్రోషాన్ని నమ్మ బెంగళూరు టపాలో చూపించాను. అది హాస్యానికనుకున్నారేమో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. (ఇప్పటి వరకూ కన్నడానికి ఏడు పీఠాలు వస్తే హిందీకి మాత్రం ఆరుసార్లు పీట వేశారు.) నాకు తెలిసిన కన్నడిగులను ఈ సప్తపీఠాల గురించి అడిగితే వాటిలో సాహిత్యేతర కారణాల వల్ల వచ్చినవి కూడా కొన్ని ఉన్నాయని అంగీకరించారు. కానీ కన్నడంలో ఆ పీఠమెక్కవలసినవారు ఇంకా చాలామంది ఉన్నారని కూడా వాక్రుచ్చారు!

విశ్వనాథ సత్యనారాయణ కోసం ఆ పీటనెత్తుకొచ్చింది అప్పటి జ్ఞానపీఠ అవార్డుల కమిటీ అధ్యక్షుడుగా ఉన్న బెజవాడ గోపాలరెడ్డి. ఒక ఇంటర్వ్యూలో ఆయనే చెప్పారు - ఆ పీటను తీసుకు రావడానికి తాను గట్టి కృషే చేశానని (ఆయన విశ్వనాథకు వీరాభిమాని లెండి).సినారెకు వచ్చినప్పుడు ఆ కమిటీ అధ్యక్షుడుగా ఉన్నది పి.వి. నరసింహారావు అనుకుంటా. అంటే కేవలం సాహిత్యానికే పరిమితం కాకుండా రాజకీయాల్లో ఆరితేరిన వారు ఆ కమిటీ అధ్యక్షులుగా ఉండి సామ, దాన, భేదోపాయాలను ప్రదర్శిస్తే తప్ప ఆ పీఠం తెలుగు నేలకు రాలేదన్నమాట. జ్ఞానపీఠాన్ని మళ్ళీ తెలుగునేలకు రప్పించే రహస్యం ఇదేనా? ఏమో!

విషయానికి వస్తే చంద్రిమ బ్లాగులో అడిగిన ప్రశ్నకు నేను సమాధానం అక్కడే రాసినా అది ఎందుకనో కనబడలేదు. అందుకే అక్కడ అడిగిన ప్రశ్నకు నా సమాధానం ఇక్కడ రాస్తున్నాను: కాళీపట్నం రామారావు.

Monday, 13 October, 2008

చందమామ పిచ్చోళ్ళ కథ

నాగమురళి గారి బ్లాగులో పాత చందమామలు చదివారా? నా కలల్లో కనిపించే స్వర్గం కూడా అలాగే ఉంటుంది. కాకపోతే నా అభిమానం పూర్తిగా చందమామ మీదే కేంద్రీకృతమైంది. బాలజ్యోతి రుచి దాదాపుగా నేనెరుగను. చిన్నప్పుడు చదివిన బాలమిత్ర కాస్త పెద్దయ్యాక నాకు నచ్చడం మానేసింది. చందమామ అలా కాదు. కొన్నేళ్ల కిందట తెలుగులోనూ, ఇంగ్లీషులోనూ చందమామకు విరివిగా ఉత్తరాలు రాశాను. అప్పట్లోనే నేను రాసిన సింగిల్ పేజీ కథ కూడా ఒకటి చందమామలో వచ్చింది. అంతర్జాలంలోకొచ్చాక తెవికీలో చురుగ్గా ఉన్నరోజుల్లో చందమామ గురించి రాశాను, ఆర్కుట్లో చందమామ కమ్యూనిటీని ఏర్పాటు చేశాను. ఇంకా... బ్లాగుల్లో కూడా బహుశా చందమామ గురించి ఎక్కువసార్లు బ్లాగింది నేనే అనుకుంటా. ఇప్పటికీ ప్రతినెలా విడవకుండా చందమామ చదువుతాను. ఎప్పటికీ చదువుతూనే ఉంటాను. అందుకే చందమామ పిచ్చోళ్ళ క్లబ్బులో నాకు శాశ్వత సభ్యత్వముంది. :) ఇస్తే చిన్నదో, పెద్దదో ఒక పదవి కూడా తీసుకుంటా!

మొదట్లో chandamama.com లో పెట్టిన PDF ఫైళ్ళు అన్నీ ఆత్రంగా డౌన్లోడు చేసి పెట్టుకున్నాను. అదెంత మంచిపనో ఇప్పుడు chandamama.comలో ఆర్కైవ్స్ చూసినవాళ్లకు అర్థమౌతుంది. ఐతే ఒక లోటేమిటంటే ఆ PDF ఫైళ్లలో జూలై 1947, డిసెంబర్ 1948, ఫిబ్రవరి 1949, మార్చ్ 1955, సెప్టెంబర్ 1959 సంచికలు లేవు. "ఎలాగరా దేవుడా! మనకు ఇంతేనా ప్రాప్తం?" అనుకుంటూ ఉంటే దేవుడల్లే నాగమురళి గారు తన బ్లాగులో నేను చూడని ఆ టపా గురించి బ్లాగాగ్ని గారి బ్లాగులో వ్యాఖ్య రాసి ulib.orgకి దారి చూపించారు. ఐతే ఆ ulibలో డిసెంబరు 1948 పేరుతో ఉన్నది డిసెంబరు 1949 సంచిక. (ఈ విషయం నేను ULIB వాళ్ళకు తెలిపాను. డిసెంబరు 1948 సంచిక ULIBలో లేకపోయినా ఇప్పుడు నా దగ్గర ఉంది లెండి. లేకపోతే నేను చంపినెలా అవుతాను? :)) పైగా ulib.org సర్వరు మీద మనలాంటి పిచ్చోళ్ళు ఎక్కువగా దాడి చేస్తూండడం వల్లనో ఏమో ఆ సైటు ఎప్పుడూ ముక్కుతూ మూల్గుతూ ఉంటుంది. పోయిన్నెల్లో పరిస్థితి ఇది. ఇప్పుడు బాగైందేమో తెలియదు.

ఇదంతా ఇప్పుడెందుకంటే ఈమధ్య నేను హైదరాబాదుకు వెళ్ళినప్పుడు పని ఉండి ఒక పెద్దాయన్ను కలిశాను. మాటల మధ్యలో చందమామ ప్రస్తావన వచ్చింది. ఆయన తన దగ్గర పాత చందమామలు చాలా ఉన్నాయి కానీ ప్రారంభ సంచిక (1947 జూలై) లేదని వాపోయాడు. అప్పుడు నేను ఆయనకు చాలా ఉత్సాహంగా "ఆన్లైన్లో చందమామ" కథ చెప్పాను. ulib.org నుంచి శ్రమపడి అంతకుముందురోజే డౌన్లోడు చేసుకున్న సదరు సంచికలోని 68 పేజీలూ 68 పీడీఎఫ్ ఫైళ్ళుగా నా దగ్గరున్న పెన్ డ్రైవ్ లో భద్రపరచుకుని తిరుగుతున్న నేను ఆయన కోరిన సంచికతో బాటు బ్లాగాగ్ని కానుకలైన సీరియళ్లను కూడా ఆయన కంప్యూటర్లోకి కాపీ చేసి ఇచ్చాను. అవి చూసి ఆయన పరమానందభరితుడయ్యాడు.

అన్నిటికంటే ముఖ్యంగా (అసలు దొరుకుతుందనే ఆశలు దాదాపుగా వదిలేసుకున్న) ప్రారంభసంచిక కంటబడడంతో ఆయన ఉత్సాహంగా మాట్లాడుతూ, ఆ విడి విడి పేజీలను పేజ్ మేకర్లో అమర్చుకుని, వెలిసిన రంగులు సరిచేసి, పడిన మరకలు తుడిచేసి, ప్రింటౌట్లు తీసుకుని మళ్ళీ కొత్తగా చందమామను తయారుచేసుకుంటాననేసరికి నేను నోరెళ్ళబెట్టాను. ఆయన అదేమీ గమనించకుండా తన ధోరణిలో తాను ఇంకా సెలవిచ్చిందేమంటే అలా చెయ్యడానికి రోజుకు పద్దెమినిది గంటల చొప్పున పనిచేస్తే మూడురోజులు పడుతుందని, ఇంతకుముందొకసారి తాను అలాగే చేశాడని! అప్పుడే అనిపించింది నాకు - ఆయన్ను ఆలిండియా చందమామ పిచ్చోళ్ళ సంఘానికి అధ్యక్షుణ్ణి చేసెయ్యొచ్చని. ఐతే మరి కాసేపట్లోనే ఆ అభిప్రాయం మార్చుకున్నాను. ఎందుకో కింద చదవండి. ;)

నా నోరు మూతపడిన తర్వాత మాటలు చందమామ సీరియళ్ల మీదికి మళ్ళాయి. నేను 1980 ల ప్రారంభంలో చందమామ చదవడం మొదలుపెట్టినప్పుడే ముగ్గురు మాంత్రికులు సీరియల్ మొదలైందని నేనంటే ఆయన "ఆ సీరియళ్లన్నీ అంతకుముందే ఒకసారి వచ్చాయి. 80లలో వెయ్యడం అంటే అది రెండోసారి" అన్నాడు. దానికి నేను "అవునండీ, మా తరం వాళ్లం ఫాలో అవగలిగింది రెండో ఇన్నింగ్స్ నే" అని చెప్పాను. ఆయన తాను చదివిన సీరియళ్ల గురించి చెప్తూ పుస్తకరూపంలో తన దగ్గరున్న విచిత్ర కవలలు, మరికొన్ని చందమామ సంచికలను కలిపి బైండ్ చేసిన పుస్తకాన్ని నాకు చూపించాడు. (ఇంతకు ముందు చందమామలో ప్రజాదరణ పొందిన సీరియళ్ళను, కథలను తెలుగులో (కూడా) పుస్తకాలుగా విడుదల చేసేవాళ్ళు. ఆ పుస్తకం చూడగా నాకు తెలిసింది ఏమిటంటే అలా విడుదల చేసిన పుస్తకాల్లో ఆ కథలు బొమ్మలతో సహా అచ్చం చందమామలో వచ్చినప్పుడు ఎలా ఉండేవో అలానే ఉండేవని. ఎంత గొప్ప విషయమో కదా? సాధారణంగా పుస్తకాలుగా వచ్చే కథలు, నవలల్లో అలా బొమ్మలు ఉండవు.) మడతలు పెట్టి, ట్వైన్ దారంతో చుట్టిన ఒక పాలిథీన్ కవర్లో భద్రంగా ఉంది ఆ పుస్తకం. ఉద్వేగంగా దాన్ని అందుకుని తెరవబోతే తిప్పిన పేజీలు తిప్పినట్లు ఊడి చేతిలోకొచ్చేస్తున్నాయి. బహుశా చందమామ ప్రారంభసంచికను ఏదో ఒకరూపంలో అందజేశానన్న అభిమానంతోనే వాటిని నాకు చూపెట్టినట్లు అర్థం చేసుకున్నాను.అదే పుస్తకం ఆ స్థితిలో నా దగ్గరున్నట్లైతే సాక్షాత్తూ మన్మోహన్ సింగ్ వచ్చి అడిగినా ఇచ్చేవాడిని కాను. ఏమో, బహుశా అబ్దుల్ కలాం అడిగితే ఇస్తానేమో లెండి. ;) పైగా ఆయన ULIB founding sponsor కూడా.

తా.క.:

అన్నట్లు మీకు దాసరి వెంకట రమణ అనే పేరు తెలుసా? చందమామలో అప్పుడప్పుడూ కథలు రాసే ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో "చందమామ కథలు - బాలల్లో వ్యక్తిత్వ వికాసం" గురించి పరిశోధన (Ph.D.) చేస్తున్నారు. ఆయన చాలా కాలంగా పాత చందమామల కోసం వెదుకుతున్నారు. గతంలో ఆయన ఫోన్నంబరు, ఈమెయిల్ ఐడీ కూడా నా దగ్గర ఉండేవి. ఇప్పుడు వెదికితే కనిపించలేదు. మీకు తెలిస్తే పాత చందమామలు chandamama.comలోను, ulib.orgలోను దొరుకుతాయని ఆయనకు చెప్పండి.

వచ్చే నెలనుంచి చందమామ విడిప్రతి 20 రూపాయలు ఔతుందట. ఈ నెలాఖరులోగా చందా కట్టేవారికి ప్రత్యేక తగ్గింపు ధరలు ఉంటాయి. కాబట్టి త్వరపడండి.

Monday, 8 September, 2008

బేడర కన్నప్ప - భక్త కన్నప్ప

శివుడు కలలోకొచ్చి తన కళ్లను సమర్పించమని కోరాడని చెప్తూ తన రెండు కళ్లనూ (ఒక్కో కన్నునొక్కోసారి) పెరికేసుకుని శివుడికి సమర్పించి ఇటీవల వార్తల్లోకెక్కాడొక కన్నడిగుడు. అతడి పేరు ముదుకప్ప ఎల్లప్ప కరాడి. అతడికి తిరిగి చూపొచ్చే అవకాశం లేదని వైద్యులు తెలిపారు. బాగల్కోట్ ప్రాంతానికి చెందిన ఈయన ప్రస్తుతం బెంగుళూరులోని NIMHANS (National Institute of Mental Health And Neuro Sciences)లో మానసిక చికిత్స పొందుతున్నాడు. ఈ విపరీత ప్రవర్తనకు మూలం భక్త కన్నప్ప కథే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఐతే శ్రీకాళహస్తీశ్వర దేవాలయంలో శివుడికి తన కళ్ళు పెకలించి సమర్పించిన భక్త కన్నప్ప ఎక్కడి వాడు? ఈయన కడప జిల్లాలోని రాజంపేట మండలం ఊటుకూరులో జన్మించాడని ఎస్‌.కె. పళణిస్వామి అనే పరిశోధకుడు అంటున్నారు. వివరాలు నిన్నటి ఈనాడు కడప జిల్లా వార్తల్లో ఇలా ఉన్నాయి:
భక్తకన్నప్ప చరిత్ర రికార్డుల అప్పగింత
రాజంపేట గ్రామీణ, న్యూస్‌టుడే : శ్రీకాళహస్తీశ్వరస్వామి పరమభక్తుడు భక్తకన్నప్ప(తిన్నడు) కడప జిల్లా రాజంపేట మండలం ఊటుకూరులో జన్మించినట్లు తెలిపే చరిత్ర రికార్డులను, ఆధారాలను శనివారం ఊటుకూరు గ్రామ సర్పంచి ఎం.ఎల్‌.నారాయణ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు కాళహస్తీశ్వర దేవస్థానం డిప్యూటీ ఈవోకి అందజేశారు. భక్తకన్నప్ప చరిత్రపై సర్వే నిర్వహించిన ఎస్‌.కె. పళణిస్వామి ఈ సందర్భంగా భక్తకన్నప్ప ఊటుకూరులో జన్మించినట్లు ఆధారాలను కాళహస్తీ అధికారులకు చూపించి విఫులంగా వివరించారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం డిప్యూటీ ఈవో ఎన్‌.వి. వెంకట్రాజు మాట్లాడుతూ ఆధారాలను పరిశీలించి జన్మస్థలిగా గుర్తింపు కోసం ఈ ఆధారాలను ఉన్నతాధికారులకు పంపుతామని పేర్కొన్నారు.

Monday, 11 August, 2008

ఒలింపిక్స్ లో స్వర్ణంతో భారత్ బోణీ

"ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురై వస్తే..." హృదయం నిజంగానే ఆనందంతో ఎగసి ఎగసి పడుతోంది. 1980 మాస్కో ఒలింపిక్స్ లో హాకీలో వచ్చింది, 28 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో ఒక స్వర్ణ పతకం. అభినవ్ బింద్రా పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో 700.5 పాయింట్లతో బంగారు పతకం గెలుచుకున్నాడు. 8 స్వర్ణ, ఒక రజత, రెండు కాంస్యాలను గెలుచుకున్న గతమెంతో ఘనకీర్తి గల మన జాతీయ క్రీడ హాకీని మినహాయిస్తే ఇప్పటి వరకు మనం గెలుచుకున్న ఒలింపిక్ పతకాలను వేళ్లమీద లెక్కపెట్టవచ్చు: 1900 పారిస్ ఒలింపిక్స్ లో అథ్లెటిక్స్ లో నార్మన్ ప్రిచార్డ్* (200 మీటర్ల పరుగు, 200 మీటర్ల హర్డిల్స్ లో) రెండు రజతాలు, 2004 సిడ్నీ ఒలింపిక్స్ లో షూటింగ్ (డబుల్ ట్రాప్)లో లెఫ్టినెంట్ కల్నల్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ఒక రజతం గెలుచుకోగా
1952 హెల్సింకీ ఒలింపిక్స్ లో కుస్తీలో ఖషబ దాదాసాహెబ్ జాధవ్,
1996 అట్లాంటా ఒలింపిక్స్ లో టెన్నిస్ లో లియాండర్ పేస్,
2000 సిడ్నీ ఒలింపిక్స్ లో వెయిట్ లిఫ్టింగ్ లో కరణం మల్లీశ్వరి ఒక్కో కాంస్యం గెలుచుకున్నారు.
-------------------
*భారత్ లో పుట్టి పెరిగిన నార్మన్ ప్రిచార్డ్ ఒక ఆంగ్లేయుడు. 1905 లో ఇంగ్లాండుకు వెళ్ళి అక్కడే స్థిరపడ్డాడు.

Friday, 25 July, 2008

బెంగుళూరులో బాంబు పేలుళ్ళు - ఒకరి మృతి, 15 మందికి గాయాలు

ఈరోజు శుక్రవారం మధ్యాహ్న నమాజు సమయంలో బెంగుళూరు నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో కొన్ని నిమిషాల తేడాలో 7 బాంబులు పేలాయి. ఈ పేలుళ్లలో ఒక మహిళ చనిపోగా పదహైదు మంది గాయపడ్డారని ప్రాథమిక సమాచారం. ఈ పేలుళ్ల గురించిన వార్తలు సర్వత్రా వ్యాపించడం వల్ల ఒత్తిడి పెరిగి టెలిఫోన్ నెట్వర్కులు జామ్ అయ్యాయి. మడివాళ, అడుగోడి, కోరమంగళ, హోసూరు రోడ్డు, మైసూరు రోడ్డు, నాయదహళ్ళి లలో పేలిన ఈ బాంబులు తక్కువ తీవ్రత గల నాటు బాంబులని, టైమర్ సహాయంతో వీటిని పేల్చారని పోలీసులు తెలిపారు. పేలుళ్ళు జరిగిన ప్రాంతాలకు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్లను పంపారు. పాఠశాలలు, కళాశాలలు, వాణిజ్య సముదాయాలు, సినిమా హాళ్ళను మూసేశారు. జమ్మూ కాశ్మీరులో అమరనాథ్ యాత్రీకుల సౌకర్యార్థం ఆలయ బోర్డుకు రాష్ట్రప్రభుత్వం 40 హెక్టార్ల అటవీభూమిని కేటాయించబోయి విరమించుకున్న నేపథ్యంలో ఈ పేలుళ్ళు హిందూ అతివాదుల చర్య అని అనుమానిస్తున్నారు.

Update:

పేలుళ్ళ వివరాలు:


1. 1.20 pm, మడివాళ బస్ డిపో

2. 1.25 pm, మైసూరు రోడ్డు

3. 1.40 pm, అడుగోడి

4. 2.10 pm, కోరమంగళ

5. 2.25 pm, విఠ్ఠల్ మల్లయ్య రోడ్డు

6. 2.35 pm, లాంగ్ ఫోర్డ్ టౌన్

7. రిచ్ మాండ్ టౌన్

Wednesday, 2 July, 2008

చెప్పుకోండి చూద్దాం



ఈ బ్లాగులో అప్పుడప్పుడూ వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల ఫోటోలు చూపించి ఆ ఫోటోల్లోని వ్యక్తులెవరో చెప్పుకోండి చూద్దాం అని ఒక క్విజ్ లాగ నడుపుదామని నాకొక ఆలోచన వచ్చింది. శాస్త్రవేత్తగా మారిన ఒక హాలీవుడ్ నటి హెడీ లమర్ గురించి దాదాపు రెండేళ్ళ కిందట "ఆమె ఒక శాస్త్రవేత్త. ఆమె వెండితెర వేలుపు. ఆమె ఒక సాహసి. ఆమె ఒక సౌందర్యరాశి." అని అడిగి సమాధానం కూడా నేనే చెప్పేశాను. ఆ తర్వాత ఈ క్విజ్ ఆలోచన వచ్చింది గానీ ఇప్పటిదాకా ఆచరణలో పెట్టలేదు. ఇప్పుడు కాచుకోండి: ఈ ఫోటోలోని వ్యక్తి ఒక ప్రముఖ తెలుగురచయిత. ఈయనెవరో చెప్పుకోండి చూద్దాం.



క్లూలు కావాలా? ఐతే ఒకటి అందుకోండి: ఈయన వాసికెక్కిన రచయిత. మల్లాది వెంకటకృష్ణమూర్తి కాదు కాబట్టి ఈయన ఫోటోలు ఈయన పుస్తకాలపైనేగాక అంతర్జాలంలో కూడా కనబడుతాయి.







Tuesday, 24 June, 2008

నమ్మ బెంగలూరు

ఐదేళ్లకు పైగా హైదరాబాదులో పాతుకుపోయిన నేను అకస్మాత్తుగా బెంగళూరు వచ్చెయ్యాలనేసరికి కాస్త బెంగపడ్డమాట నిజం. ఐతే నేను హైదరాబాదు వదిలేసి బెంగలూరు వచ్చేస్తున్నానని తెలియగానే కొందరు ఆత్మీయులు నా బెంగ అర్థరహితం, అనవసరం అని కొట్టిపారేస్తూ, "ఇక్కడికొచ్చాక మీరే నమ్మ బెంగుళూరు అంటారు, వచ్చెయ్యండి" అని నమ్మబలికారు. ఇంకా వెనుకాడుతున్న నన్ను చూసి బెంగుళూరులో ఉండివెళ్ళిన కొందరు మిత్రులు "బెంగుళూరు నచ్చాలంటే మనలో ఆ క్లాస్ ఉండాలమ్మా" అని విదేశాలనుంచి సన్నాయినొక్కులు నొక్కారు. ఏమైతేనేం, చివరకు అందరూ కలిసి నన్ను బెంగుళూరుకు లాగేశారు.

నిజం చెప్పాలంటే మా ఊరినుంచి హై. కంటే బెంగలే దగ్గర. కానీ రాష్ట్రం దాటి రావాలంటే ముందుగా భాష గురించే నాకు బెంగ. ఎందుకంటే మనకు ఆంధ్రాంగ్లములు దక్క ఇతరేతర భాషలు రావు. MCA చదువుతున్నప్పుడు స్నేహితుల బలవంతమ్మీద జీవితంలో మొదటిసారి హిందీ సినిమా చూడడానికి వెళ్తూ వెళ్తూ దారిలో విశాలాంధ్రలో హిందీ డిక్షనరీ కొనుక్కుని మరీ వెళ్ళాను. ఇప్పుడూ అలాగే బెంగుళూరుకు రాకముందే ముందుజాగ్రత్తగా విశాలాంధ్రలో National Integration Series వారి 30 రోజుల్లో కన్నడం కొనిపెట్టుకున్నాను. (దాన్నింత వరకు తెరిచి చూడలేదనుకోండి, అది వేరే విషయం.) గుడ్డిలో మెల్ల ఏమిటంటే చిన్నప్పుడే నాకు 'ఉ', 'హ', 'క' తో సహా కన్నడం చదవడం వచ్చు. అందుకే ఇక్కడి (బెంగళూరు)కొచ్చాక కనిపించిన ప్రతి కన్నడ బోర్డునూ ఉత్సాహంగా చదివిపారేస్తున్నాను - అర్థమైనా, కాకపోయినా.

మొదటి అనుభవం: షేవింగు సెట్టుకు 'కత్తెర'

అసలు బెంగళూరుతో నా అనుబంధం పదినెల్ల కిందటే మొదలైంది. వారాంతాల్లో బెంగళూరుకు రావడానికి నా అలవాటుకొద్దీ ఒక చిన్న బ్యాగులో నా బ్రష్షూ పేస్టూ, షేవింగ్ సెట్టూ, సెల్ ఫోన్ ఛార్జరూ, దార్లో చదూకోడానికి రెండు మూడు పుస్తకాలు వేసుకుని బయలుదేరితే హైదరాబాదు విమానాశ్రయంలోని భద్రతాసిబ్బంది నన్ను, నా మీసకట్టును చూడగానే తెగముచ్చటపడిపోయి, "మీ మీసకట్టు చూడముచ్చటగా ఉంది, మీరు ఏ కత్తెరతో షేప్ చేసుకుంటారో చూపించండి" అని, నేనెంత మొహమాటపడుతున్నా పట్టించుకోక నా బ్యాగునంతా వెదికి మరీ నా కత్తెరను సావనీరుగా తీసేసుకునేవాళ్ళు. అలా వాళ్ల దగ్గర నావి ఐదారు కత్తెరలు (ఉండి)పోయాయి. ఐనా నేనొచ్చినప్పుడల్లా కొత్త కత్తెరను తీసుకోవడం అస్సలు మర్చిపోరు. ఒకసారి ఎందుకనో గుర్తులేదుగానీ నా బ్యాగునిండా చీమ దూరడానికి కూడా సందు లేకుండా ఏవేవో వస్తువులు కుక్కుకుని బయలుదేరాను. (ఎందుకేమిటిలెండి, మా ఆవిడకు జన్మదిన కానుక(లు) తీసుకెళ్తున్నాను) అప్పుడైతే వాళ్లకు కత్తెర వెంటనే దొరకలేదని చిన్నబుచ్చుకున్నారు కూడా. 'లేదయ్యా, నా దగ్గర అసలు కత్తెర లేనేలేదు, పోయినసారి మీరు తీసేసుకున్న తర్వాత నేను మళ్ళీ కొనలేదు, ఒకవేళ కొన్నా వెంట తెచ్చుకోలేదు, కావాలంటే నా షేవింగ్ సెట్టు చూడండీ' అని షేవింగ్ కిట్టు తెరిచి చూపించినా వాళ్ళు నిరాశపడలేదు. నా బ్యాగునంతా రెండుసార్లు వెదికాక నేను బ్లేడుతోనే షేప్ అనుకుంటానేమో అని అనుమానించి బ్లేడ్లు తీసేసుకున్నారు. మళ్ళీ నా బ్యాగును వెనక్కి X-రే స్కానింగుకు పంపి "కహా హై, కహా హై" అని అక్కడి గార్డును కంగారుపెడితే అతను "Centre మే హై" అని చెప్పేవరకూ వాళ్ళు శాంతించలేదు. వాళ్ల వాలకం చూస్తే కత్తెర కోసం గిఫ్టు పాకెట్లు కూడా విప్పి చూపమంటారేమోననిపించింది. అసలా బ్యాగులో కత్తెర ఉన్నట్లు అప్పటివరకూ నేను చూసుకోనేలేదు. చూసుకున్నట్లైతే వాళ్లనంతగా ఇబ్బందిపెట్టి ఉండను. ;) అలా ఆ ట్రిప్పులో కత్తెరతోబాటు బ్లేడ్లు కూడా పోగొట్టుకున్నాను. (భద్రతాకారణాల వల్ల ఇలా ప్రయాణీకుల నుంచి స్వాధీనం చేసుకున్న "ఆయుధాల"ను బేగంపేటలో ప్రదర్శనకు పెట్టమని ఏలినవారిని కోరాలి). బెంగుళూరు వెళ్ళబోతే ప్రయాణంలోనే ఇలాంటి అనుభవాలౌతున్నాయే, బెంగుళూరు వెళ్ళాక పూర్తిగా క్షవరమైపోతానేమో అని కూడా అనిపించినా 'అబ్బే, మా ఆవిడ చాలా మంచిది. అలాంటి పనులేవీ చెయ్యదు' అని నాకు నేనే ధైర్యం చెప్పుకునేవాడిని. మొత్తానికి అలా నేను బెంగళూరు వచ్చిపడ్డానన్నమాట. ఇక బెంగళూరులో నా అనుభవాలు కాస్కోండి:

బాగిలు

మొదటిరోజు ఇంటినుంచి ఆఫీసుకు వెళ్లడానికి సిటీబస్టాపుకెళ్ళాను. 'హై.లోలాగ ఇక్కడ షేరింగ్ ఆటోలు ఎందుకు లేవా' అని చింతిస్తూ, బస్సు రాగానే ఎక్కడానికి వీలుగా కుడివైపు నిలబడ్డాను. ఇంతలో బస్సు రానేవచ్చింది. కానీ ఆ బస్సుకు వెనకవైపు అసలు డోరే లేదు. ముందుపక్క ఒకే ఒక డోరు మాత్రమే తెరచి ఉంది. ఇదెక్కడి వింత? అనుకుంటూ బస్సెక్కి చూస్తే ఒకచేత్తో స్టీరింగు తిప్పుతూ ఇంకో చేత్తో టికెట్లిస్తున్న డ్రైవరు కనబడ్డాడు. అది చూసి అదిరిపడ్డాను. సిటీ బస్సుల్లో వన్ మాన్ సర్వీసులా? బెంగళూరుకు రాకముందు ఇలాంటిదొకటి ఉందని, అది మనదేశంలోనే విజయవంతంగా అమలౌతోందని ఎవరైనా చెప్పినా నమ్మేవాణ్ణి కాదు. ఎవరూ చెప్పలేదు కాబట్టి బతికిపోయారు. బస్సెక్కిన కాసేపటికి రోడ్ల మీద వెస్టిబ్యూల్ బస్సులు కూడా తిరుగుతూ కనబడ్డాయి. ఇక్కడ విజయవంతంగా నడుస్తున్న ఈ జంటవాహనగళు హైదరాబాదులో మూణ్ణాళ్ళ ముచ్చటగా ఎందుకు మూలనబడ్డాయో నాకు అర్థం కాలేదు.

బస్సు ఎక్కబోతూ డోరు దగ్గర కన్నడంలో స్వయంచాలిత బాగిలు అని చూసి 'బాగిలు అంటే ఏమిటబ్బా?' అని ఆలోచించాను. అప్పుడేమీ తట్టలేదుగానీ 30 రోజుల్లో కన్నడం కూడా చదవనసరం లేకుండానే త్వరలోనే అదేమిటో అనుభవపూర్వకంగా బోధపడింది. కాసేపు ఓపిగ్గా ఈ టపా చదివితే మీకు కూడా తెలిసిపోతుంది. (అసలు నా బ్లాగు చదవడమే ఓ ఎడ్యుకేషన్. అందుకే రోజూ వచ్చి నా బ్లాగు చదివేస్తూ ఉండండి. మీ విజ్ఞానాన్ని పెంచుకోండి.)

హైదరాబాదులో ఐతే సిటీ బస్సులు బస్టాపులో ఆగడం, ఆగకపోవడం దైవాధీనం. అది డ్రైవరు మూడును బట్టి ఉంటుంది. బస్టాపులోని దీనజనాల మీద దయ కలిగిందా ఆగుతుంది, లేదంటే ఎక్కడో వెళ్ళి ఆగుతుంది. మనం అక్కడిదాకా పరిగెత్తిపోయేలోపే "Catch me if you can" అంటూ కదిలి బుర్రున వెళ్ళిపోతుంది. ఐతే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర మాత్రం నమ్మకంగా ఆగుతుంది. అందుకే బస్సెక్కాలన్నా, దిగాలన్నా జనాలు బస్టాపుల కంటే ఎక్కువగా ట్రాఫిక్ సిగ్నళ్ళనే నమ్ముకుంటారు. ఈ ట్రెండు చూసి ఆర్టీసీ వాళ్లు ముచ్చటపడి అమీర్ పేట మైత్రీవనం గేటు ముందైతే ఏకంగా సిగ్నల్ దగ్గరే బస్టాపు ఏర్పాటుచేశారు.

ఒక అచ్చమైన హైదరాబాదీలాగ అదే అలవాటుతో నేనూ బెంగళూరులో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరే బస్సు దిగడం మొదలుపెట్టాను. నాలుగురోజులు బాగానే గడిచింది. ఐదో రోజు, అనగా ఒక శుక్రవారం నాడు, శుక్రుడు వక్రదృష్టితో చూశాడేమో నన్ను, బస్సు డ్రైవరు బస్సు దిగడానికి వస్తున్న నన్ను చూసి ముఖం మాడ్చుకుని ముందుకు వంగాడు. అతడలా వంగాడో లేదో అప్పుడే అలీబాబా అన్నకు గుహద్వారం ముసుకుపోయినట్లు నా కళ్లముందే బస్సుడోరు ముసుకుపోయింది. అసలే మన హై.లో సిటీ బస్సులకు డోర్లుండడం, ఉన్నా అవి మూసుకుపోవడం ఏ జన్మానా ఊహించలేం కదా? అందుకే 'ఈ డోరేమిట్రా ఇలా చేసిందీ' అని నిర్ఘాంతపోయాను. "డోరా డోరా తెరుచుకోవే" అని నాకొచ్చిన మంత్రాలన్నీ పఠించాను, లాభం లేకపోయింది. బస్సు డ్రైవరేమో నా మొర ఆలకించకుండా ఎటో చూస్తున్నాడు. ఈలోగా సిగ్నలు మారి బస్సు కదిలిపోయింది. ఆ కదలడం కదలడం ఒక కిలోమీటరు దాకా ఎక్కడా ఆగలేదు! దార్లో ఎక్కడా అంగుళం కూడా అడ్డం రాని బెంగళూరు ట్రాఫిక్ మీద మండమంటే మరి నాకు మండదా?

అలా ఎక్కడో దిగవలసిన నన్ను ఇంకెక్కడో వదిలి వెళ్ళిపోతున్న బస్సు వైపు "బలివాడ కాంతారావు నవలలా" చూసేసరికి ఆ బస్సు వెనుక రాసి ఉన్న రెండులైన్ల ముషాయిరా కనబడింది:

నడువె అంతరవిరళి
అఫవాతక్కి అవసరవే కారణ


మొదట అదేమిటో అర్థం కాలేదు. కాసేపటికి తేరుకుని నాకు అర్థమైనంతవరకు ఆ రెండు లైన్లకు స్వీయానువాదం
"నడువరా అంతదూరమూ, అవసరమే అందుకు కారణము" (నడువరా కి నడువే అని లింగమార్పిడి చేశారన్నమాట!) అని పాడేసుకుంటూ వెనుదిరిగి సాగిపోతున్నాను. ఒక్కో బస్సూ నన్ను దాటుకుని వెళ్తున్నప్పుడల్లా స్వయంచాలిత బాగిలు అని కళ్లముందు కనబడుతూనే ఉంది. ముషాయిరా అనువాదం కనిపెట్టిన ఉత్సాహంలో ఉన్నా కదా? అదే ఊపులోనైతే వీజీగా తడుతుందని స్వయంచాలిత బాగిలును కూడా స్వీయానువాదం చేయడానికి ప్రయత్నించాను. స్వయంచాలిత అంటే ఆటోమాటిక్. మరి బాగిలంటే ఏమయ్యుంటుంది? అని ఊహించబోతే ఎంతకీ తట్టలేదు. కుంచంతో నిలువుగా కొలవడానికి వీల్లేనప్పుడు తిరగేసి కొలవమన్నారు కదా? అందుకని ఇలా కాదని అసలు ఆ బస్సుల్లో కదిలేవీ, హైదరాబాదు బస్సుల్లో కదలనివీ ఏమున్నాయాని ఆలోచించేసరికి మిష్టరీ ఇట్టే విచ్చిపోయింది. (చూశారా? అసలైన Education అంటే ఇదేగానీ జావాలు, డాట్ నెట్లూ కాదని మీకెవరు చెప్తారు?) ఇంతకూ బాగిలు అంటే ఏమిటనుకున్నారు? అవే... ముదనష్టపు డోర్లు!! వాకిలిని కన్నడంలో బాగిలు అంటారన్నమాట. ఆహా! గొప్ప డిస్కవరీ. (నిండా కష్టాల్లో ఉన్నప్పుడే మనకలా బ్రెయిన్ వేవులొస్తుంటాయిలెండి) ఈ లెక్కన కన్నడం నేర్చుకోవడం చాల వీజీనే. అర్థం కానిచోటల్లా తెలుగు పదాలతో రైమింగు కుదిరేటట్లు చూసుకుంటే సరి.

మనం దారిలో కనిపించిన బోర్డులన్నీ చదివేసుకుంటూ, అనువాదాలు చేసేసుకుంటూ ఇదే వేగంతో పురోగమిస్తే పది నిమిషాల్లో ఆఫీసు చేరుకోవచ్చు, ఆపైన పదిరోజుల్లో కన్నడంలో పండితులమైపోవచ్చు. 10 రోజుల్లో కన్నడం పుస్తకం సొంతంగా ముద్రించుకోవడం మంచిదా లేక ఆ అవకాశం విశాలాంధ్ర వాళ్ళకిద్దామా అని తీవ్రంగా ఆలోచిస్తూ ఆఫీసు చేరుకున్నాను.

హా!
హాఫీసు నుంచి తిరిగొచ్చేటప్పుడు పాలు, పూలు తీసుకురమ్మని చెప్పి పంపింది మా ఆవిడ. పాలను హాలు, పూలను హువ్వ అంటారని కూడా చెప్పింది. దాంతో మన చురుకైన బుర్రకు అంతా అర్థమైపోయింది. బెంగాలీలు 'వ' ను 'బ' అని పలికినట్లే కన్నడిగులు 'ప' ను 'హ' అంటారన్నమాట. ఆహా! మన కన్నడం క్షణక్షణాభివృద్ధి చెందడానికి ఇంటా బయటా ఇంత గొప్ప ప్రోత్సాహం లభిస్తూంటే పుస్తకం సొంతంగానే ప్రచురించుకోవచ్చు. కన్నడంలో కథలు కూడా రాసేసి అర్జెంటుగా ఒకటో రెండో జ్ఞానపీఠాలు కూడా గెలిచేసుకోవచ్చు. భారతదేశం వోల్మొత్తంలో జ్ఞానపీఠమెక్కడానికి దగ్గర దారి కన్నడ సాహిత్యమేకదా? అసలే గిరీష్ కర్నాడ్ కు ఆ పురస్కారం వచ్చాక మూడేళ్ల కాలపరిమితి దాటిపోయి కూడా చాలా కాలమైంది.

ఇంతకూ మా ఆవిడ హాలు, హూలు తెమ్మందేగానీ హళ్ళు తెమ్మని చెప్పలేదు (అదేనండీ పళ్ళు, ఇలాంటి పదాలు వీజీగా క్యాచ్ చెయ్యాలంటే చిట్కాల కోసం నేను రాయబోయే 10 రోజుల్లో కన్నడం పుస్తకం ముందుగానే పది కాపీలు రిజర్వు చేసుకోండి). కానీ కొన్ని పనులు చెప్పకుండా చేస్తే మనకే లాభం. (Education లో మూడో పాఠం) ఏ హళ్లు తీసుకెళ్ళాలి? సీజన్ కాబట్టి మామిడి హళ్ళు బెటర్.

మడివాళ లో దిగడానికి సిద్ధంగా డోరు దగ్గర చేరి బయటకు చూస్తున్న నాకు సెయింట్ జాన్స్ ఆస్పత్రి పక్కన ఆనందాశ్చర్యాలు కలిగించే బోర్డు ఒకటి కనబడింది. ఆ రోడ్డు పేరు "మహాయోగి వేమన రస్తె" అట! అదే హై.లోనైతే పెద్ద సెంటర్లకు కోఠీ, అబిడ్స్, లక్డీకాపూల్, కూకట్ పల్లి, మెహదీపట్నం, దిల్ సుఖ్ నగర్,.. అనీ; చిన్నసెంటర్లకు టప్పా చబుత్ర లాంటి విడ్డూరమైన పేర్లేవో ఉంటాయి. రోడ్లకు అన్నీ ఇంగ్లీషు పేర్లో, లేకపోతే నవాబుల పేర్లో ఉంటాయిగానీ తెలుగువాళ్ల పేర్లు కనబడవు. నిజం చెప్తున్నా, వీటిల్లో ఒక్కదానికి కూడా నాకు అర్థం తెలీదు. అలాంటిది ఇక్కడ ఒక రోడ్డుకు యోగి వేమన పేరు పెట్టారని చాలా సంతోషించాను. ఎంతైనా కన్నడిగులు చానా మంచోళ్ళు.

ఆ ఆనందంలోనే మామిడిపళ్ల బండి దగ్గరకెళ్ళి కొన్ని పళ్ళు ఏరుకున్నాను. తక్కెడ తీసి ఎన్ని కావాలని కాబోలు అడిగాడు పళ్లమ్మేవాడు. "హది" అన్నాను. అప్పుడు వాడు వేసిన వెర్రిమొహం మసకచీకటిలో కూడా స్పష్టంగా కనబడింది. దాంతో 'ఓ! మనమెక్కడో తప్పులో కాలేశాం' అనుకుని 'టెన్' అన్నాను, వాడింకా అలాగే చూస్తున్నాడు. 'దస్' అన్నాను. అది కూడా వాడికి అర్థమైనట్లు లేదు. ఇలా కాదని అచ్చతెలుగులో 'పది' అన్నాను. ఆ మాటతో వాడిలో చలనం వచ్చింది. 'హమ్మయ్య! వీడికి తెలుగొచ్చన్నమాట!!' అనే ఆనందంలో జరిగిందంతా మర్చిపోయి హళ్ళు తీసుకుని ఇంటికొచ్చేశాను.

మామిడి హళ్ళ ... క్షమించాలి, పళ్ళ అనుభవంతో నా కన్నడ పరిజ్ఞానం మీద నాకే రవంత అనుమానం కలిగింది. దాంతో 10 రోజుల్లో కన్నడం పుస్తకం రాసే ఆలోచన ప్రస్తుతానికి పక్కన పెట్టాను. ఐతే ఇటీవల నన్ను కన్నడంలో ఎవరేది అడిగినా సమాధానం కన్నడంలోనే చాలా జోరుగా, ఇంకా చాలా కాన్ఫిడెంటుగా చెప్పేస్తున్నాను. అదేమిటో గానీ అందరికీ ఆ సమాధానం అర్థమౌతోంది కూడా. అడిగినవాళ్ళెవరూ నాకేసి వెర్రిగా గానీ, విచిత్రంగా గానీ చూడకపోవడమే దానికి నిదర్శనం. "National Integration Series" వారి 30 రోజుల్లో కన్నడం పుస్తకం చదవకుండానే నాకు కన్నడం వచ్చేసిందా? బెంగుళూరులో నేను భాష గురించి బెంగ లేకుండా బతికెయ్యగలనా? మీరే చెప్పాలి.

... ... ...

ఇంతకూ అసలు విషయం నేను మీకు చెప్పనేలేదు కదూ? కన్నడంలో నేను చాలా జోరుగా, ఇంకా చాలా కాన్ఫిడెంటుగా వాడుతున్న ఏకైక పదం "గొత్తిల్ల"!
(ಗೊತ್ತಿಲ್ಲ = తెలీదు)



Monday, 9 June, 2008

కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని కడపలోనే స్థాపించాలి

ఎక్కడైనా ఒక ప్రాంతం సజావుగా/వేగంగా అభివృద్ధి చెందడమో, అభివృద్ధి కుంటుపడడమో, లేక అసలు లేకపోవడమో చూస్తాం. కానీ అభివృద్ధిపథంలో నానాటికీ వెనక్కెనక్కి పోవడం కడప జిల్లా ప్రత్యేకతేమో అనిపిస్తుంది కొన్ని విషయాలు చదివితే.

వివిధరంగాల్లో కడపజిల్లా అభివృద్ధి చరిత్రను ఒకసారి పరిశీలిస్తే,

రైల్వే: దేశాభివృద్ధికి జీవనాడుల్లాంటివి రైలుమార్గాలు. దేశంలోనే అతిప్రధానమైన రైల్వే మార్గాల్లో ఒకటి, స్వర్ణచతుర్భుజి లో భాగమైన ముంబై-చెన్నై రైలు మార్గం కడప గుండా పోతుంది. కానీ ఒక్క కడప జిల్లాలో మాత్రం ఆ మార్గం విద్యుదీకరణ గానీ, డబ్లింగు గానీ ఇంతవరకు పూర్తికాలేదు. (ఈ మార్గంలో ఉండడం వల్లే నూటపాతికేళ్ల కిందట రాష్ట్రంలో మొట్టమొదట రైల్వే సౌకర్యం పొందిన జిల్లాకేంద్రం కడప అయింది. విచారకరమైన విషయమేమిటంటే నేటికీ అదొక్కటే ఈ జిల్లాలో రైలుమార్గం. దశాబ్దాలు గడుస్తున్నా ఎర్రగుంట్ల-నంద్యాల రైలుమార్గం పూర్తికానే లేదు. కడప-నెల్లూరు, కడప-బెంగుళూరు రైలుమార్గాల పనులు ఇప్పట్లో ప్రారంభమౌతాయనే ఆశలు కూడా లేవు.)

పైగా ఆ మార్గంలో కడపజిల్లాలోనే నందలూరులో రైల్వే లోకో షెడ్ ఉండేది. గత ఐదేళ్ళుగా ఈ ప్రాంత ప్రజలు, ప్రజాప్రతినిధులు ఎన్నిసార్లు విజ్ఞాపనలు, ఆందోళనలు చేసినా పట్టించుకోకుండా దాన్ని కాస్తా ఈమధ్యే తిరుపతికి తరలించేశారు. అక్కడి ప్యాసింజర్‌ డ్రైవర్ల క్రూ కేంద్రాన్ని కూడా మూసేశారు. ఇక్కడి ప్రజలు నందలూరు రైల్వే ఐక్యపోరాట సమితి (ఐకేపీఎస్‌) ఆధ్వర్యంలో పలుదఫాలు ఆందోళనలు చేసిన మీదట స్థానిక రైల్వేకేంద్రంలో గూడ్సు వ్యాగన్ల మరమ్మతు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని రైల్వేమంత్రి హామీ ఇచ్చారు గానీ అది నెరవేరే సూచనలు ఇంతవరకూ కానరాలేదు.

విమానయానం: బ్రిటిష్ వారి హయాం లోనే రాష్ట్రంలో రెండో విమానాశ్రయం కడపలో ఏర్పాటుచేశారు. దాన్ని కాస్తా 1993లో అనుకుంటా మూసేశారు. పోనీ ఇదేమైనా మారుమూల ప్రాంతమా అనుకుంటే 6 జిల్లాలకు నడిబొడ్డులాంటి నగరం. మౌలిక సౌకర్యాలు ఎంతగానో అభివృద్ధి చెందవలసిన ప్రాంతం.

పారిశ్రామికాభివృద్ధిని చూద్దామంటే అపారమైన ఖనిజసంపద ఉన్నా పరిశ్రమలు మాత్రం సున్నా. (ఎర్రగుంట్ల దగ్గర మాత్రం 3 సిమెంటు ఫ్యాక్టరీలున్నాయి.) నందలూరు దగ్గరే ఆల్విన్ ఫ్యాక్టరీ ఉండేది. అది అనతికాలంలోనే మూతపడింది.

ప్రొద్దటూరు మిల్క్ ఫాక్టరీ (PMF): ప్రారంభంలో సుమారు లక్ష లీటర్ల పాల సేకరణలో పి.ఎం.ఎఫ్‌. అందరి మన్ననలు పొందింది. ఇక్కడి ఉత్పత్తులు దేశ రక్షణకు పనిచేసే సైనికులకు సరఫరా చేసేవారు. భక్తులందరూ అమితంగా ఇష్టపడే ప్రీతికరమైన తిరుపతి లడ్డూల తయారీకి ఇక్కడి పాలనే వినియోగించేవారు. సరైన నిర్వణ లేకపోవడంతో 13 ఏళ్ళ కిందట నష్టాల బాటలో మూతపడింది.

తాజాగా చెన్నూరు దగ్గరున్న కడప చక్కెర కర్మాగారం మూతపడింది.

విద్య, వైద్య సౌకర్యాలు: 1972 వరకు జిల్లాలో ఒకే ఒక డిగ్రీ కళాశాల ఉండేది. నిన్నమొన్నటి వరకు ఒక్క ఇంజనీరింగ్ కళాశాల మాత్రమే ఉండేది. పెద్దజబ్బులేవైనా చేసినా, అత్యవసర పరిస్థితుల్లో ఐనా పొరుగుజిల్లాలైన నెల్లూరికో, కర్నూలుకో పోవలసివచ్చే దుస్థితి.

ఇతరాలు: మొదట అన్నివిధాలుగా అనువైనచోటుగా భావించి ఇక్కడ కార్యాలయాలు ఏర్పాటుచెయ్యడం, తర్వాత గప్ చుప్ గా వాటిని వేరే ఎక్కడికో తరలించడం సాధారణంగా జరిగేదే. కడప రేడియో స్టేషన్ను కూడా తిరుపతికి తరలించడానికి గతంలో గట్టి ప్రయత్నాలే జరిగాయి. ఐతే అప్పట్లో కడపకు చెందిన రచయితలు, కళాకారులు పెద్దయెత్తున ఆందోళనలు జరిపి ఆ ప్రయత్నం సాగకుండా అడ్డుకోగలిగారు.

ఇలా అన్నిరంగాల్లో ఒక అడుగు ముందుకేస్తే రెండడుగులు వెనక్కి వేస్తున్న ఇలాంటి ప్రాంతాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి మౌలిక సదుపాయాలు కల్పించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. అందులో భాగంగానే కేంద్రప్రభుత్వం స్థాపింపతలపెట్టిన కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమలోని కడపలోనే ఏర్పాటు చెయ్యాలని నేను కూడా కోరుతున్నాను. దీనికి సంబంధించి ఈరోజు హిందూలో వచ్చిన వార్త:

Plea to locate Central University in Kadapa
Special Correspondent
District has been neglected for centuries, leaders of citizen associations tell Union Minister

Constitution of committee to study economic backwardness of the district sought

While Visakhapatnam has developed, Kadapa had only one degree college between 1952 and 1972


KADAPA: Citizens’ association leaders of the city on Sunday urged Union Minister for Human Resource Development N. Purandareswari to locate the Central University at Kadapa, which has been neglected for centuries, and not establish it at Visakhapatnam.

Association’s honorary chairman P. Subba Reddy, chairman S. Sitaramaiah and general secretary S. Elias Reddy said in a memorandum faxed to the Minister to constitute a committee to study the economic backwardness of Kadapa as well as Visakhapatnam before locating the Central University. Otherwise, the south Andhra Pradesh campus of the university may be located at Kadapa and the north campus at Visakhapatnam, they demanded.

Lost opportunity

Rayalaseema lost an opportunity to get a university at Anantapur during the British rule, when Prof. Kattamanchi Ramalinga Reddy recommended location of Andhra University at Visakhapatnam as Madras university was far away from it.

While Visakhapatnam has developed over the years, Kadapa had only one degree college between 1952 and 1972, they said.

When Chief Minister Y.S. Rajasekhara Reddy proposed to set up the Central University at Kadapa, people of Visakhapatnam launched an agitation, unmindful of Rayalaseema people’s agitation for a steel plant and upgradation of All India Radio at Visakhapatnam, they asserted. Visakhapatnam got a port, naval base, steel plant, Bharat Heavy Plates and Vessels, but Central funds to Kadapa were meagre.

Central location

Kadapa is centrally located in Rayalaseema region and is about 250 km from the south coastal backward districts.

The district would also serve backward areas like Bellary, Chintamani, South Arcot in neighbouring Tamil Nadu, they said.

Kadapa was on the Chennai-Mumbai railway line and Kadapa aerodrome was being developed, the citizen association leaders said.

పొద్దు పొడిచింది!!!


మీరు చూశారా? కోల్పోయినవి పోగా చివరన దొరికిందే అపురూపమా లేక అపురూపమైనదే చిట్టచివర దొరుకుతుందా? మెహెర్ రాసిన కథ “చిట్టచివరి స్నేహితుడు”.
సంపాదకీయం: చదువది యెంత గల్గిన..
తెలుగులో మొట్టమొదటి ఆన్‌లైన్ గళ్ళనుడికట్టు