Wednesday 12 April, 2006

మొల్ల

1. 2-4-2006 న వార్త దినపత్రిక ఆదివారం అనుబంధంలో ద్వా.నా.శాస్త్రి వ్రాసిన ఆర్టికల్ ఇది:

"ఘనమగు సంస్కృతము జెప్పగా రుచియగునే" అని సంస్కృతాధిపత్యాన్ని నిరసించిన కవయిత్రి మొల్ల.
"కందువ మాటల సామెతలందముగా గూర్చి చెప్ప నది తెలుగునకుం
పొందై రుచియై వీనుల విందై" ఉంటుందని తెలుగు భాషాఅభిమానాన్ని ప్రకటించిన కవయిత్రి మొల్ల.
"గూఢ శబ్దములను గూర్చిన కావ్యమ్ము మూగచెవిటి వారి ముచ్చటగును" అంటూ తెలుగు కవిత్వానికి సారళ్య అవసరాన్ని నొక్కి చెప్పిన కవయిత్రి మొల్ల.
"శ్రీకంఠ మల్లీశు వరము చేత నెఱి కవిత్వంబు చెప్పగా నేర్చుకొంటి" అంటూ భక్తికి పట్టం కట్టిన కవయిత్రి ఆమె.
"తప్పులెంచకుడు కవుల్" అనగల వినయ సంపద గల కవయిత్రి ఆమె.
వాల్మీకి రామాయణాన్ని కథాప్రధానంగా అందరికీ అర్థమయ్యేలా చెప్పినట్లు గానే వ్రాసిన కవయిత్రి మొల్ల.
మొల్ల కడప జిల్లా గోపవరం గ్రామం లో జన్మించినట్లుగా చాల మంది నిర్ణయించారు.
నెల్లూరు దగ్గర గోపవరం ఉన్నా గానీ అక్కడ శ్రీకంఠ మల్లేశ్వరస్వామి ఆలయం లేదు. మొల్ల తాను శ్రీ కంఠ మల్లేశ్వరుని వరం చేతనే కవిత్వం నేర్చుకున్నానని స్వయంగా చెప్పింది. శ్రీరామాలయమూ గోపవరంలోనే ఉంది. తరతరాలుగా జనం చెప్పుకునే మొల్ల బండ ఉంది. గ్రామస్థులు ఈ బండకు పూజ చేయడం ఉంది. శ్రీ కృష్ణదేవరాయలు గోపవరం లో బస చేసినట్లుగా స్థానికులు చెప్పుకొంటూ ఉంటారు. మొల్ల పూర్వీకులు ఆత్మకూరుకు చెంది ఉంటారనీ, అందుకే ఆతుకూరు ఇంటిపేరు అయిందనీ కొందరి అభిప్రాయం. కుమ్మరి కులానికి చెంధిన మొల్ల ఈ ప్రాంతానికి చెందినదనడానికి గోపవరం దగ్గర కుమ్మరి కులాలవారూ ఉనారు. మొల్ల నివసిచిన ఇల్లుగా గోపవరంలో పాడుబడిన ఇల్లు ఉంది. పెద్దన కూడా గోపవరం వచ్చినట్లుగా కొందరు వృద్ధుల కథనం.


ఇంత చారిత్రక ప్రాధాన్యం గల గోపవరం లో శ్రీకంఠమల్లేశ్వరుని దేవాలయం జీర్ణావస్థలో ఉంది. విగ్రహం ఎండలో ఎండుతూ, వానలో తడుస్తూ, దుమ్ములో ఉంది. ఈ దేవాలయాన్ని పునరుద్ధరించాలి. రామాలయంలోని విగ్రహాలను ఎవరో ఎత్తుకుపోయారు. రాముని పటం మాత్రమే ఉంది."మొల్ల బండ"కు పరిరక్షణ లేదు. ఇటీవల మొల్ల జయంతి సందర్భంగా గోపవరంలో మొల్ల విగ్రహావిష్కరణ జరిగింది.దానికి మూల కారకులు విద్వాన్ గానుగపెంట హనుమంత హనుమంత రావు గారు.ఈయన కృషి వల్లనే మొల్ల సాహితీ పీఠం స్థాపించ బడింది. శాలివాహన సంఘం మొల్ల కవితా వ్యాప్తికి నడుం బిగించింది. గానుగపెంట హనుమంత హనుమంత రావు గారు మొల్ల పై చిన్న పుస్తకం కూడా వ్రాశారు.

అయితే మొల్ల కు తగిన న్యాయం లభించిందా? అన్నది ప్రశ్న. ట్యాంక్ బండ్ పై మొల్ల విగ్రహం ప్రతిష్ఠించడమొక్కటే చెప్పుకోదగినది. మొల్ల రామాయణం 1917 లో వావిళ్ళ వెంకటేశ్వర్లు గారు అచ్చు వేశారు.కందుకూరి కవుల చరిత్ర వ్రాసే నాటికి మొల్ల రామాయణం అసలు ప్రతి దొరకలేదేమో ? కానీ ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యం లో మొల్ల గురించి టూకీ గా మాత్రమే వ్రాశారు. అంటే సమగ్ర విశ్లేషణ చేయదగ్గ కవయిత్రిగా భావించలేదన్న మాట. మొల్లకు న్యాయం జరగాలంటే గోపవరమ్ లో శ్రీకంఠమల్లేశ్వరుని దేవాలయాన్ని పునరుద్ధరించాలి.రామాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన చేయడం, మొల్ల బండకు ప్రాధాన్యమిచ్చి కాపాడడం తక్షణం చేపట్టాలి.గోపవరం మండలాన్ని మొల్ల మండలంగా మార్చాలన్న వినతిని కడప జిల్లా పరిషత్ చేర్మన్ అంగీకరించారు.రాజకీయ నాయకుల, పురుషుల పేర్లతో జిల్లాలు, వీధులు ఉంటాయి.స్త్రీల పేర్లతో ఎందుకుండవో అర్థం కాదు.గోపవరాన్ని మొల్ల మండలంగా మారిస్తే అదొక చారిత్రక ఘటన అవుతుంది. తెలుగు విశ్వ విద్యాలయం మొల్ల రామాయణాన్ని వ్యాఖ్యానంతో ముద్రించడం అవసరం. రాయలసీమ అంటే బాంబుల సీమ కాదు ముఠాకకషలకు పుట్టినిల్లు కాదు.అని ఈ తరానికి, రాబోయే తరాలకు చెప్పవలసి ఉంది. మొల్ల, అన్నమయ్య, తిమ్మక్క, వేమన, పోతులూరి వంటి ఎందరో మహానుభావులు జన్మించిన నేలగా, బ్రౌన్ నడయాడిన నేలగా, విస్తృతంగా ప్రచారం చేయవలసి ఉంది. మన సాహితీ అవశేషాలను భద్రపరచవలసి ఉంది. గోపవరాన్ని చారిత్రక పర్యాటక స్థలంగా అభివృద్ధి చేయవలసి ఉంది.

2. 13-3-2006 న ఈనాడు కడపలో వచ్చిన వార్త~:

మొల్ల ఊరు..మరచి పోయారు


అనాదరణకు గురవుతున్న పెద్ద గోపవరం
నేడు జయంతి

శ్రీకృష్ణాదేవరాయల కొలువులోని హాస్యకవి తెనాలి రామలింగనికి సమకాలీనురాలుగా భావిస్తున్న రచయిత్రి మొల్ల తెలుగు రామాయణంతో చరిత్రలో సుస్థిర స్థానం పొందింది. ఆమె పాద ముద్రికలు బద్వేలు మండలం పెద్దగోపవరంలో నిలచి ఆ ఘనతను చాటుతున్నాయి. ఆమె జ్ఞాపికలను పదికాలాల పాటు నిలిపే ప్రయత్నం మాత్రం జరగడం జరగడం లేదు.

వాల్మీకి రామాయణానికి తెలుగు వన్నెలద్దిన మహిళా కవితామూర్తి మొల్ల నేటికీ స్మరణీయురాలే.కానీ తెలుగు జాతికి ఖ్యాతి తెచ్చిన ఆమె నివాసగ్రామమైన బద్వేలు నియోజకవర్గంలోని పెద్దగోపవరం మాత్రం నిరాదరణకు గురవుతోంది. చారిత్రక ప్రాధాన్యమున్న ఈ ప్రాంతాన్ని అటు పురావస్తు శాఖ అధికారులు గానీ, ఇటు పర్యాట శాఖ అధికారులు గానీ పట్టించుకోవడం లేదు. ఆదికవి వాల్మీకి 24 వేల శ్లోకాల్లో రచించిన రామాయణాన్ని ఆమె తేట తెలుగులో 871 పద్యాలతో కావ్యంగా రచించి చెరగని ముద్ర వేసుకొంది. ఆ మహాయజ్ఞాన్ని ఆమె అయిదు రోజుల్లో పూర్తి చేసినట్లు దక్షిణ హిందూ స్థానపు కవుల చరిత్రలో కావలి వెంకటరామస్వామి పేర్కొని ఆమె ఘనతను కొనియాడారు. గుర్తుగా ఆమె కూర్చొని కవిత్వం రాసిన బండ మాత్రం ఏటా పండుగల సందర్భంగా పూజలను అందుకొంటోంది. ఈమె ఆరధ్య దైవమైన శ్రీకంఠ మల్లేశ్వరస్వామి ఆలయం నేచదరమైంది. ఆమె పూజించిన శివలింగం కాలగర్భంలో కలసి పోగా పానుమట్టం మాత్రమే మిగిలింది. వినాయకుడు, తదితర దేవతామూర్తి విగ్రహాలకూ ఇదే దుస్థితి పట్టింది.

శివకేశవుల బేధం ఉన్న రోజుల్లో ఇద్డరూ ఒకటేనని సమాజానికి చాటిచెప్పిన మహనీయురాలు ఆమె. రాముడిని, వేణుగోపాలుడ్నీ, శ్రీకంఠమల్లేశ్వరుడినీ ఆరాధించి ఆధ్యాత్మికంలో ఉన్న గొప్పదనాన్ని చాటింది. ఈ ఆలయాలు ఇప్పటికీ ఆమె జ్ఞాపికలుగా గ్రామంలో నిలిచాయి.

మొల్ల మాండలికాలపై సాహిత్య శోధనలు చేయాలి
మొల్ల తాను రచించిన రామాయణంలో గోపవరం ప్రాంత ప్రజలు మాట్లాడుకొనే పదాలనే కవిత్వంలో వాడిందని, వీటిపై సాహిత్య పరిశోధనలు జరిపించాలనికవయిత్రి మొల్ల సాహిత్య పీఠం గౌరవాధ్యక్షులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఏటా మార్చి 13న ఆమె జయంతిని జరుపుతున్నామని తెలిపారు. మొల్ల నివసించిన ఇంటిని స్మారక మందిరంగా మార్చాలని కోరారు.18,19 శతాబ్దాలలో కందుకూరి వీరేశలింగం పంతులు, బద్వేలుకు చెందిన ఆధునిక కవులు జంగా నరసింహశాస్త్రి, జనమంచి శేషాద్రి శర్మ, యాదాటి నరసింహశర్మ తదితరులు మొల్ల రామాయణం గూర్చి చర్చించారని తెలిపారు.

2 comments:

VillageMonkey said...

బాస్, గోపవరం అంటే, కడప లో ఎక్కడ ఉండేది. ప్రొద్దుటూరు దగ్గర గా ఉండేడా లేక వేరేది ఏదైనా నా ??

త్రివిక్రమ్ Trivikram said...

కాదండీ,

బద్వేలు నియోజకవర్గంలో నెల్లూరు జిల్లా సరిహద్దుల్లో ఉండే మండలకేంద్రం. దాని పేరును మొల్ల మండలంగా మారుస్తున్నారని కూడా అన్నారు. మార్చారో లేదో తెలియదు.